Jeevan Reddy: ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తా

తనను సంప్రదించకుండా జగిత్యాల భారాస ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌ను కాంగ్రెస్‌లో చేర్చుకోవడంపై పార్టీ సీనియర్‌ నేత, ఎమ్మెల్సీ టి.జీవన్‌రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు.

Published : 26 Jun 2024 04:30 IST

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత టి.జీవన్‌రెడ్డి 
పార్టీలోనే కొనసాగుతానని స్పష్టీకరణ
జగిత్యాల భారాస ఎమ్మెల్యే చేరికపై అసంతృప్తి
జీవన్‌రెడ్డితో భట్టివిక్రమార్క, శ్రీధర్‌బాబుల చర్చలు

జీవన్‌రెడ్డితో సమావేశమైన భట్టి, శ్రీధర్‌బాబు

ఈనాడు, హైదరాబాద్‌: తనను సంప్రదించకుండా జగిత్యాల భారాస ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌ను కాంగ్రెస్‌లో చేర్చుకోవడంపై పార్టీ సీనియర్‌ నేత, ఎమ్మెల్సీ టి.జీవన్‌రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తానని చెప్పారు. ఇందుకోసం శాసనమండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి అపాయింట్‌మెంట్‌ కోరారు.బుధవారం ఉదయం 10 గంటలకు అపాయింట్‌మెంట్‌ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో జీవన్‌రెడ్డిని బుజ్జగించేందుకు డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, మంత్రి శ్రీధర్‌బాబు మంగళవారం ఆయన ఇంటికి వెళ్లి.. చర్చలు జరిపారు. పార్టీని వీడవద్దని నచ్చజెప్పారు. అనంతరం భట్టి, జీవన్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. భట్టి మాట్లాడుతూ.. ‘‘జీవన్‌రెడ్డి కాంగ్రెస్‌లో సీనియర్‌ నాయకులు. మా అందరికీ మార్గదర్శకులు. ఆయన అనుభవాన్ని, ఆలోచనలను ప్రభుత్వం నడపడం కోసం తప్పనిసరిగా వినియోగించుకుంటాం. గత పదేళ్లు కాంగ్రెస్‌ అధికారంలో లేని సమయంలో పార్టీ జెండాను భుజాన మోశారు.  ఆయన సీనియారిటీకి భంగం కలగకుండా.. తగిన ప్రాధాన్యమిచ్చి పార్టీ గౌరవిస్తుంది. జీవన్‌రెడ్డి 1983లో తొలిసారిగా చట్టసభకు పోటీ చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలోని చట్టసభల సభ్యుల్లో సీనియర్‌. ఇలాంటి సీనియర్‌ నాయకులను వదులుకోవడానికి పార్టీ సిద్ధంగా లేదు. ఆయన మనస్తాపానికి గురైన విషయాన్ని అధిష్ఠానం దృష్టికి తీసుకువెళ్తాను’’ అని అన్నారు.

ఆత్మగౌరవం ప్రధానం..

జీవన్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘‘నేను కాంగ్రెస్‌ను వదిలే ప్రసక్తే లేదు. పార్టీలోనే ఉంటాను. చేరికల విషయంలో మనస్తాపానికి గురయ్యాను. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తాను. పార్టీ పదవికి రాజీనామా చేయను. నా అవసరం అప్పుడు పార్టీకి ఉంది. ఇప్పుడు లేదేమో అని అనుకుంటున్నాను. గతంలో నేను ఒక్కడినే కాంగ్రెస్‌ తరఫున ఎమ్మెల్సీగా మండలిలో ఉన్నాను. ఇప్పుడు మహేశ్‌కుమార్‌గౌడ్, బల్మూరి వెంకట్‌ ఉన్నారు. గవర్నర్‌ కోటాలో వచ్చే ఎమ్మెల్సీలు కూడా ఉంటారు. నాకు ఓటు వేసి ఎమ్మెల్సీగా గెలిపించిన నిరుద్యోగులు, విద్యార్థుల తరఫున పోరాటం చేస్తూనే ఉంటాను. నాకు ఆత్మగౌరవం ప్రధానం. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించవద్దని కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించిన పాంచ్‌ న్యాయ్‌లో పేర్కొన్నారు. ఫిరాయింపులపై నా అభిప్రాయం, రాహుల్‌ గాంధీ అభిప్రాయం ఒక్కటే. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని రాజీవ్‌ గాంధీ అమల్లోకి తీసుకొచ్చారు. పార్టీకి రాజీనామా చేస్తానంటే.. వద్దని భట్టివిక్రమార్క, శ్రీధర్‌బాబు కోరారు. కాంగ్రెస్‌ రాష్ట్ర ఇన్‌ఛార్జి దీపా దాస్‌మున్షీ నాతో మాట్లాడారు. సీనియర్‌ నాయకులు నా దగ్గరికి వచ్చారు. కాంగ్రెస్‌తో నాకు 40 ఏళ్ల అనుబంధం ఉంది. తాజా పరిణామాలు బాధ కలిగించాయి. మండలి ఛైర్మన్‌ ఈరోజు అందుబాటులో లేరు. అందుబాటులోకి రాగానే నా నిర్ణయం చెబుతాను’’ అని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని