YSRCP: కళ్లు నెత్తికెక్కిన మంత్రులను చాచి కొట్టిన ఓటర్లు

పదవి దక్కినప్పటి నుంచి విర్రవీగుతూ.. ఇష్టానుసారం వ్యవహరించి.. దౌర్జన్యాలు, దందాలు చేసి.. నోటి దురుసుతో విరుచుకుపడి.. కళ్లు నెత్తికెక్కిన.. మంత్రులు అందరికీ ఓటర్లు బుద్ధి చెప్పారు.

Updated : 05 Jun 2024 08:41 IST

ఈనాడు-అమరావతి: పదవి దక్కినప్పటి నుంచి విర్రవీగుతూ.. ఇష్టానుసారం వ్యవహరించి.. దౌర్జన్యాలు, దందాలు చేసి.. నోటి దురుసుతో విరుచుకుపడి.. కళ్లు నెత్తికెక్కిన.. మంత్రులు అందరికీ ఓటర్లు బుద్ధి చెప్పారు. కేవలం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మినహా మిగిలిన వారందరినీ చాచి కొట్టినట్లు ఓడించారు. తొలివిడత మూడేళ్లూ, తర్వాత రెండేళ్లూ మంత్రులుగా కొనసాగిన వారెవరికి విజయం దక్కలేదు. అయిదు సామాజిక వర్గాలకు చెందిన వారికి.. అయిదు ఉప ముఖ్యమంత్రుల పదవులంటూ ఆయా వర్గాల ఓట్లను పట్టేయచ్చని జగన్‌ వేసిన ప్రణాళికను ఓటర్లు ఏమాత్రం పట్టించుకోలేదు. తరతమ బేధం లేకుండా ఉపముఖ్యమంత్రులందరినీ ఓడించారు. ప్రస్తుత సిట్టింగ్‌ మంత్రులే కాకుండా, తొలి విడతలో మూడేళ్లు మంత్రులుగా పనిచేసిన వారిలో కూడా ఏ ఒక్కరూ గెలవలేదు. మొన్నటి వరకు మంత్రిగా కొనసాగిన గుమ్మనూరు జయరాం మాత్రం ఎన్నికలకు ముందు తెదేపాలో చేరి, గుంతకల్లు నుంచి పోటీచేసి విజయం సాధించారు.

ఉప ముఖ్యమంత్రులంతా ఔట్‌  

ప్రస్తుత సిట్టింగ్‌ ఉప ముఖ్యమంత్రులైన కొట్టు సత్యనారాయణ (తాడేపల్లిగూడెం), అంజాద్‌ బాషా (కడప), పీడిక రాజన్నదొర (సాలూరు) ఓటమి చవిచూశారు. అనకాపల్లి లోక్‌సభ అభ్యర్థిగా బరిలో నిలిచిన ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు ఓడిపోయారు. ఇప్పటివరకు సిట్టింగ్‌ ఉపముఖ్యమంత్రిగా ఉన్న నారాయణస్వామి ఈ ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఆ స్థానమైన గంగాధర నెల్లూరు నుంచి అతని కుమార్తె కృపాలక్ష్మిని పోటీలో నిలపగా, ఆమె కూడా ఆమె ఓటమిపాలయ్యారు.

బోల్తా కొట్టిన అమాత్యులు 

సీనియర్లు, జూనియర్లు అనే తేడా లేకుండా అన్నిశాఖల మంత్రులను ఓటర్లు ఊడ్చేశారు. ప్రస్తుత సిట్టింగ్‌ మంత్రుల్లో.. ధర్మాన ప్రసాదరావు (శ్రీకాకుళం), సీదిరి అప్పలరాజు (పలాస), బొత్స సత్యనారాయణ (చీపురుపల్లి), గుడివాడ అమర్‌నాథ్‌ (గాజువాక), దాడిశెట్టి రాజా (తుని), చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ (రాజమహేంద్రవరం గ్రామీణ), పినిపే విశ్వరూప్‌ (అమలాపురం), తానేటి వనిత (గోపాలపురం), కారుమూరి వెంకట నాగేశ్వరరావు (తణుకు), జోగి రమేశ్‌ (పెనమలూరు), మేరుగు నాగార్జున (సంతనూతలపాడు), విడదల రజని (గుంటూరు పశ్చిమ), అంబటి రాంబాబు (సత్తెనపల్లి), ఆదిమూలపు సురేష్‌ (కొండపి), కాకాణి గోవర్దన్‌రెడ్డి (సర్వేపల్లి), ఆర్కే రోజా (నగరి), బుగ్గన రాజేంద్రనాథరెడ్డి (డోన్‌), కేవీ ఉషశ్రీచరణ్‌ (పెనుకొండ) ఓటమి చవిచూశారు.

  • తొలి విడత మూడేళ్లపాటు ఉప ముఖ్యమంత్రులుగా పనిచేసిన ధర్మాన కృష్ణదాస్‌ (నరసన్నపేట), పాముల పుష్పశ్రీవాణి (కురుపాం), ఆళ్ల నాని (ఏలూరు) ఓడిపోయారు. తొలి మూడేళ్లూ మంత్రులుగా ఉండి, ప్రస్తుతం బరిలో నిలిచిన అవంతి శ్రీనివాస్‌ (భీమిలి), కురసాల కన్నబాబు (కాకినాడ గ్రామీణ), చెరుకువాడ శ్రీరంగనాథరాజు (ఆచంట), కొడాలి నాని (గుడివాడ), వెలంపల్లి శ్రీనివాస్‌ (విజయవాడ సెంట్రల్‌), మేకతోటి సుచరిత (తాడికొండ), బాలినేని శ్రీనివాసులురెడ్డి (ఒంగోలు) ఓటమి చవిచూశారు. నరసరావుపేట నుంచి లోక్‌సభ స్థానానికి పోటీచేసిన మాజీ మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్, అనంతపురం లోక్‌సభ స్థానం నుంచి బరిలో నిలిచిన మాజీ మంత్రి ఎం.శంకరనారాయణ కూడా ఓటమిపాలయ్యారు.
  • మాజీ మంత్రి పేర్ని నాని.. ఈసారి తన కుమారుడు కిట్టును మచిలీపట్నం అసెంబ్లీ స్థానం నుంచి పోటీచేయించగా, ఓటర్లు తిరస్కరించారు. తొలి విడతలో మంత్రిగా చేసి, ప్రస్తుతం రాజ్యసభ సభ్యునిగా ఉన్న పిల్లి సుభాష్‌చంద్రబోస్‌.. ఈసారి కుమారుడు పిల్లి సూర్యప్రకాశ్‌ని బరిలో నిలిపినా ఓటమి తప్పలేదు.

తాజా, మాజీలు 39 మందిలో.. ఒక్కరే.. 

జగన్‌ ప్రభుత్వంలో రెండు దఫాలుగా 41 మంది మంత్రులు పనిచేయగా.. వారిలో నేరుగా పోటీచేసిన 35 మందితోపాటు, తమస్థానంలో కుమారులు, కుమార్తెలను బరిలో నిలిపిన ముగ్గురు మంత్రులకు కూడా ఓటమి తప్పలేదు. కేవలం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాత్రమే విజయం సాధించారు. రెండు దఫాలు మంత్రిగా కొనసాగిన గుమ్మనూరు జయరాం మాత్రం, ఎన్నికలకు ముందు తెదేపా గూటికి చేరారు. గుంతకల్లు అసెంబ్లీ స్థానం నుంచి పోటీచేసి విజయం సాధించారు. 

  • తొలి దఫా 25 మంది మంత్రులు ఉండగా, అందులో పిల్లి సుభాష్‌ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ రాజ్యసభ సభ్యులుగా వెళ్లారు. వారి స్థానంలో చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, సీదిరి అప్పలరాజు మంత్రి వర్గంలోకి వచ్చారు. రెండో దఫా మంత్రివర్గంలో 25 మందికిగాను 11 మందిని కొనసాగించారు. 14 మందిని కొత్తగా మంత్రివర్గంలోకి తీసుకున్నారు. 
  • నారాయణస్వామి తన కుమార్తెను, పిల్లి సుభాష్‌ చంద్రబోస్, పేర్ని నాని తమ కుమారులను పోటీ చేయించినా ప్రయోజనం లేకపోయింది. 
  • రాజ్యసభ సభ్యుడైన మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ ఒక్కరే ఈసారి ఎన్నికల బరిలో నిలబడలేదు. మేకపాటి గౌతమ్‌రెడ్డి అమాత్యునిగా ఉండగానే మృతిచెందారు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని