Lok Sabha Elections Counting: 2.18 కోట్ల ఓట్లు.. 34 లెక్కింపు కేంద్రాలు

ఈవీఎంలలో నిక్షిప్తమైన అభ్యర్థుల భవితవ్యం మంగళవారం తేలనుంది. రాష్ట్రంలోని 17 లోక్‌సభ పరిధిలోని 119 అసెంబ్లీ సెగ్మెంట్లలో పోలైన ఓట్ల లెక్కింపు ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభం అవుతుంది.

Updated : 04 Jun 2024 07:06 IST

ఉదయం 8 గంటలకు కౌంటింగ్‌ ప్రారంభం
పోస్టల్‌ బ్యాలెట్లు లెక్కించిన   తర్వాత ఈవీఎంలు
సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ అసెంబ్లీ  ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపూ నేడే

కోట్ల విజయభాస్కర్‌రెడ్డి స్టేడియంలో సికింద్రాబాద్‌ లోక్‌సభ పరిధిలోని ఖైరతాబాద్, జూబ్లీహిల్స్‌ అసెంబ్లీ సెగ్మెంట్ల ఓట్ల లెక్కింపు టేబుళ్లు

ఈనాడు, హైదరాబాద్‌: ఈవీఎంలలో నిక్షిప్తమైన అభ్యర్థుల భవితవ్యం మంగళవారం తేలనుంది. రాష్ట్రంలోని 17 లోక్‌సభ పరిధిలోని 119 అసెంబ్లీ సెగ్మెంట్లలో పోలైన ఓట్ల లెక్కింపు ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభం అవుతుంది. తొలుత పోస్టల్‌ బ్యాలెట్లు లెక్కిస్తారు. 8.30 గంటల నుంచి ఈవీఎం ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. మరోవైపు లోక్‌సభ ఎన్నికలతోపాటు జరిగిన సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ అసెంబ్లీ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపూ మంగళవారమే జరగనుంది. సార్వత్రిక ఎన్నికల నాలుగో దశలో రాష్ట్రంలోని లోక్‌సభ స్థానాలకు మే నెల 13వ తేదీన పోలింగ్‌ జరిగిన విషయం తెలిసిందే. ఓట్ల లెక్కింపు కోసం అధికారులు 34 ప్రాంతాల్లో 1,855 టేబుళ్లు ఏర్పాటు చేశారు. ఆయా కేంద్రాల్లోనే సుమారు 2.18 లక్షల పోస్టల్‌ బ్యాలెట్ల లెక్కింపు కోసం 275 టేబుళ్లు అందుబాటులో ఉంచారు.  అధిక శాతం నియోజకవర్గాల్లో 18 నుంచి 21 రౌండ్లలో లెక్కింపు సాగుతుంది. ఈ వ్యవహారాలను పర్యవేక్షించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్రానికి 49 మంది పరిశీలకులను నియమించింది. లెక్కింపు జరిగే ప్రతి టేబుల్‌ వద్ద ఒక సూక్ష్మ పరిశీలకుడికి బాధ్యతలు అప్పగించింది. భద్రాచలం అసెంబ్లీ సెగ్మెంట్‌ పరిధిలో అతి తక్కువగా 1,05,383 మంది మాత్రమే ఓటు హక్కు వినియోగించుకున్న నేపథ్యంలో అక్కడ ఓట్ల లెక్కింపు తొలుత పూర్తి అవుతుందన్నది అంచనా. 

రౌండ్ల వారీగా ఈవీఎంల తరలింపు

పోస్టల్‌ బ్యాలెట్ల లెక్కింపు ముందుగా ప్రారంభమవుతున్న నేపథ్యంలో స్ట్రాంగ్‌ రూమ్‌ల నుంచి తొలుత పోస్టల్‌ బ్యాలెట్‌ బాక్సులను బయటకు తీసుకొస్తారు. తరవాత ఈవీఎంలను తీసుకొస్తారు. ‘అందరూ ఒకే సమయంలో స్ట్రాంగ్‌ రూమ్‌లలోకి వెళ్తే ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉన్నందున ఇలా ఏర్పాట్లు చేశాం. పోస్టల్‌ బ్యాలెట్ల లెక్కింపు సిబ్బంది, ఈవీఎం ఓట్ల లెక్కింపు సిబ్బంది వేరువేరుగా ఉంటారు. ఆయా లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలో పోలైన ఓట్లు, లెక్కింపు కోసం ఏర్పాటైన టేబుళ్ల సంఖ్యను పరిగణనలోకి తీసుకుని ఆ మేరకు మాత్రమే రౌండ్ల వారీగా ఈవీఎంలను బయటకు తీసుకువస్తాం. ఆయా నియోజకవర్గాల్లో ఓట్ల లెక్కింపు పూర్తయిన తర్వాత ర్యాండమ్‌గా ఎంపిక చేసిన అయిదు వీవీప్యాట్‌లలోని ఓటు పత్రాలను లెక్కిస్తాం. ఆయా ఈవీఎంలలోని ఓట్లు, వీవీప్యాట్‌లోని ఓటు పత్రాలు సమానంగా ఉన్నట్లు నిర్ధారణ అయిన తర్వాత ఫలితాన్ని ప్రకటిస్తాం. వ్యత్యాసం వచ్చిన పక్షంలో వీవీప్యాట్‌లోని ఓట్లనే ప్రామాణికంగా తీసుకుని ఫలితాన్ని ప్రకటిస్తాం’ అని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్‌రాజ్‌ ‘ఈనాడు’తో చెప్పారు. 


ఫలితాల వేళ సైబర్‌ మాయలు.. జాగ్రత్త

దేశవ్యాప్తంగా ఎటుచూసినా ఎన్నికల ఫలితాలపై చర్చ. మంగళవారం కౌంటింగ్‌ సందర్భంగా ఉత్కంఠ నెలకొంది. దీన్ని అవకాశం చేసుకొని సైబర్‌ మాయగాళ్లు మోసాలకు పాల్పడే అవకాశం ఉందని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఓట్ల లెక్కింపు వివరాల పేరిట ఈమెయిల్, మొబైల్‌ఫోన్లకు వచ్చే సందేశాలు నమ్మవద్దని సైబర్‌క్రైమ్‌ పోలీసులు చెబుతున్నారు. గుర్తుతెలియని వ్యక్తులు, సంస్థల నుంచి వచ్చే లింకులను క్లిక్‌ చేయటం ద్వారా వ్యక్తిగత సమాచారం, బ్యాంకుఖాతా వివరాలు మాయగాళ్ల చేతికి చేరతాయని హెచ్చరిస్తున్నారు.

  • రాష్ట్రంలో మొత్తం ఓటర్లు: 3,32,63,384
  • ఓటు హక్కు వినియోగించుకుంది: 2,18,14,025 
  • పోస్టల్‌ బ్యాలెట్లు:  సుమారు 2.18 లక్షలు
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని