Lok Sabha Elections: ఎన్డీయే మురిపెమా.. ఇండియా విజయమా?

యావత్‌ భారతావని ఉత్కంఠగా ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది! రాబోయే ఐదేళ్లపాటు దేశ పాలనా పగ్గాలు ఎవరి చేతుల్లో ఉండబోతున్నాయో మరికొన్ని గంటల్లో తేలనుంది.

Updated : 04 Jun 2024 07:00 IST

ఉత్కంఠకు మరికొన్ని గంటల్లో తెర 
నేడే సార్వత్రిక ఎన్నికల ఫలితాలు 
హ్యాట్రిక్‌ గెలుపుపై భాజపా గురి 
ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తామన్న ధీమాతో కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు 
ఓట్ల లెక్కింపునకు పటిష్ఠ ఏర్పాట్లు 
ఉదయం 8 గంటలకు కౌంటింగ్‌ ప్రారంభం 
దిల్లీ

యావత్‌ భారతావని ఉత్కంఠగా ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది! రాబోయే ఐదేళ్లపాటు దేశ పాలనా పగ్గాలు ఎవరి చేతుల్లో ఉండబోతున్నాయో మరికొన్ని గంటల్లో తేలనుంది. 18వ లోక్‌సభ ఏర్పాటు కోసం మండుటెండల్లో రెండు నెలలకు పైగా సుదీర్ఘంగా సాగిన సార్వత్రిక ఎన్నికల ఫలితాలు మంగళవారం వెలువడనున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కారు ముచ్చటగా మూడోసారి అధికారంలోకి వస్తుందా? లేదంటే కాంగ్రెస్‌ నాయకత్వంలోని విపక్ష ఇండియా కూటమి మెజార్టీ సీట్లు దక్కించుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తుందా? ఇవేమీ కాకుండా అనూహ్యంగా హంగ్‌ తలెత్తుతుందా? దేశమంతటా.. ఇంకా చెప్పాలంటే ప్రపంచవ్యాప్తంగా పలు ఇతర దేశాల్లోనూ ఆసక్తి రేకెత్తిస్తున్న ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు ఇంకొన్ని గంటల్లోనే దొరకబోతున్నాయి. ఒక్కో ఈవీఎం కంట్రోల్‌ యూనిట్‌ తెరుచుకునేకొద్దీ అభ్యర్థుల జాతకాలు తేలబోతున్నాయి. దేశంలో మొత్తం 543 లోక్‌సభ నియోజకవర్గాలు ఉన్నాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసేందుకు కావాల్సిన కనీస మెజార్టీ 272. గుజరాత్‌లోని సూరత్‌ లోక్‌సభ స్థానంలో భాజపా అభ్యర్థి ముకేశ్‌ దలాల్‌ ఇప్పటికే ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మిగిలిన 542 సీట్లలో ఓట్ల లెక్కింపు జరగనుంది. ఆంధ్రప్రదేశ్, ఒడిశా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలూ మంగళవారమే వెలువడనున్నాయి. ఉదయం 8 గంటలకు ప్రారంభం కానున్న ఓట్ల లెక్కింపు ప్రక్రియ కోసం ఎన్నికల సంఘం (ఈసీ) పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేసింది. ఈ ఎన్నికల్లో ఘన విజయంతో భాజపా నేతృత్వంలోని ఎన్డీయే హ్యాట్రిక్‌ కొట్టడం ఖాయమని వివిధ సంస్థల ఎగ్జిట్‌ పోల్స్‌ ముక్తకంఠంతో జోస్యం చెప్పాయి. ‘చార్‌ సౌ పార్‌’ అన్న నినాదంతో ఎన్నికల బరిలో దిగిన కమలనాథులు.. ఆ మార్కుకు చేరువగా వెళ్తారని అంచనా వేశాయి. అదే జరిగితే- వరుసగా మూడు ఎన్నికల్లో సొంత పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన దేశ మొదటి ప్రధానమంత్రి జవహర్‌లాల్‌ నెహ్రూ రికార్డును మోదీ సమం చేస్తారు. ప్రధానంగా పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళల్లో భాజపా ఎలాంటి ఫలితాలను దక్కించుకుంటుందనేది చాలామంది దృష్టిని ఆకర్షిస్తున్న అంశం. తమిళనాడు, కేరళల్లో ప్రస్తుతం ఆ పార్టీకి సిటింగ్‌ ఎంపీలెవరూ లేరు. ఈ రెండు రాష్ట్రాల్లోనూ కమలదళం ఈసారి కచ్చితంగా బోణీ కొడుతుందని, బలమైన పక్షంగా అవతరిస్తుందని అంచనాలు జోరుగా వెలువడుతున్నాయి. బెంగాల్‌లో తృణమూల్‌ కాంగ్రెస్‌ను మించి కమలనాథులు సీట్లు గెల్చుకుంటారని ఎగ్జిట్‌ పోల్స్‌ జోస్యం చెప్పాయి. తనకు కంచుకోటల్లాంటి ఉత్తర్‌ప్రదేశ్, గుజరాత్, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల్లో భాజపా ఆధిపత్యాన్ని ఏ మేరకు కొనసాగిస్తుందనేది ఆసక్తికర ప్రశ్నగా మారింది. సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీయే విజయం ఖాయమని.. అది ఎంతటి ఘన విజయం సాధిస్తుంది? కొత్తగా ఏయే స్థానాలను తన ఖాతాలో వేసుకుంటుంది? అనే ప్రశ్నలే తేలాల్సి ఉందని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అమిత్‌ షా, రాజ్‌నాథ్‌ సింగ్, పీయూష్‌ గోయల్, భూపేందర్‌ యాదవ్, సర్బానంద సోనోవాల్, ధర్మేంద్ర ప్రధాన్‌ తదితర కేంద్ర మంత్రులతోపాటు మాజీ సీఎంలు శివరాజ్‌సింగ్‌ చౌహాన్, బసవరాజ్‌ బొమ్మై, త్రివేంద్రసింగ్‌ రావత్‌ భాజపా తరఫున ఈ ఎన్నికల బరిలో నిలిచారు.  

ఆశల పల్లకిలో కాంగ్రెస్, మిత్రపక్షాలు 

భాజపాను గద్దె దింపాలన్న లక్ష్యంతో కాంగ్రెస్‌ నేతృత్వంలో విపక్షాలు ‘ఇండియా’ కూటమిని ఏర్పాటుచేసుకున్నాయి. లక్ష్య సాధనలో ఆ కూటమి సఫలం కాబోదని, దాదాపుగా మూడింట ఒకవంతు సీట్లకే పరిమితమవుతుందని అత్యధిక ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనా వేశాయి. వాటి అంచనాలను విపక్ష నేతలు తోసిపుచ్చుతున్నారు. ‘ఇండియా’కు 295 సీట్లు వస్తాయని కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఆ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ ధీమాగా చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఫలితాలపై ఉత్కంఠ పెరుగుతోంది. గత రెండు ఎన్నికల్లో కాంగ్రెస్‌ కనీసం ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా సాధించలేకపోయింది. అనేక రాష్ట్రాల్లో దారుణంగా చతికిలపడింది. ఈ దఫా అది ఎంతవరకు మెరుగైన ఫలితాలను సాధిస్తుందో చూడాలి. వామపక్షాలకు కూడా ఈ ఎన్నికలు చాలా కీలకం. ప్రస్తుతం ఒక్క కేరళలోనే బలమైన శక్తిగా లెఫ్ట్‌ పార్టీలు ఉన్నాయి. సార్వత్రిక సమరంలో మెరుగైన ఫలితాలు దక్కకపోతే దేశవ్యాప్తంగా వాటి మనుగడ మరింత కష్టమయ్యే అవకాశాలు ఉన్నాయి. 

బరిలో 53 మంది మంత్రులు 

53 మంది సిటింగ్‌ మంత్రులు ప్రస్తుతం ఎన్నికల బరిలో ఉన్నారు. వారిలో ముగ్గురు రాజ్యసభ సభ్యులుగా కొనసాగుతున్నారు. 17వ లోక్‌సభలో ఎంపీలుగా ఉన్నవారిలో 327 మంది మళ్లీ ఇప్పుడు పోటీ చేశారు. వారిలో 34 మంది పార్టీ మారి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ప్రధాన రాజకీయ పార్టీల తరఫున బరిలో నిలిచిన అభ్యర్థుల్లో 27% మంది ఇప్పటికే కనీసం ఒక్కసారైనా ఎంపీగా పనిచేసినవారే. సార్వత్రిక ఎన్నికలను ఏప్రిల్‌ 19 నుంచి ఈ నెల 1 వరకు ఏడు విడతల్లో నిర్వహించిన సంగతి తెలిసిందే. 

సగటున ఒక్కో స్థానంలో 15 మంది 

పీఆర్‌ఎస్‌ లెజిస్లేటివ్‌ రీసెర్చ్‌ నివేదిక ప్రకారం.. ప్రస్తుత ఎన్నికల్లో 8,360 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. వీరిలో 16% మంది జాతీయ పార్టీల తరఫున, 6% మంది రాష్ట్ర పార్టీల నుంచి పోటీ చేస్తున్నారు. 47% మంది స్వతంత్రులు. అత్యధికంగా బహుజన్‌ సమాజ్‌ పార్టీ (బీఎస్పీ) 488 నియోజకవర్గాల్లో అభ్యర్థులను బరిలో దించింది. తర్వాతి స్థానంలో భాజపా (441) నిలిచింది. కాంగ్రెస్‌ 328 చోట్ల పోటీ చేస్తోంది. సగటున ఒక్కో నియోజకవర్గంలో 15 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. అత్యధికంగా తెలంగాణలో సగటున ఒక్కో స్థానంలో 31 మంది బరిలో నిలిచారు. లద్దాఖ్, నాగాలాండ్‌లలో ముగ్గురు చొప్పున మాత్రమే అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. తమిళనాడులోని కరూర్‌లో అత్యధికంగా 54 మంది బరిలో ఉన్నారు. వారిలో 46 మంది స్వతంత్రులు. 


పవార్, ఠాక్రేల భవితవ్యం ఏమయ్యేనో! 

న్సీపీ, శివసేన పార్టీల్లో చీలికల కారణంగా శరద్‌ పవార్, ఉద్ధవ్‌ ఠాక్రేల రాజకీయ భవితవ్యంపై ప్రస్తుతం ఒకింత నీలినీడలు కమ్ముకున్నాయి! పవార్‌ నేతృత్వంలోని ఎన్సీపీ (ఎస్పీ), ఠాక్రే నాయకత్వంలోని శివసేన (యూబీటీ) మహారాష్ట్రలో ఈ ఎన్నికల్లో సాధించే ఫలితాలే వారి భవిష్యత్‌ గమనాన్ని నిర్దేశిస్తాయనడంలో ఆశ్చర్యం లేదు. ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌), సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ), తృణమూల్‌ కాంగ్రెస్‌ (టీఎంసీ)లకూ ఈ ఎన్నికలు కీలకమే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు