Lok Sabha Election: సింగిలా.. డబులా.. దక్కేవెన్ని?

హోరాహోరీగా సాగిన లోక్‌సభ ఎన్నికల ఉత్కంఠకు తెర పడే సమయం ఆసన్నమైంది. పోలింగ్‌ ముగిసిన 21 రోజుల తర్వాత.. మంగళవారం ఓట్ల లెక్కింపు జరగనుండడంతో ఫలితాలు తేటతెల్లం కానున్నాయి.

Updated : 04 Jun 2024 07:12 IST

రెండంకెల సీట్లపైనే ప్రధాన పార్టీల దృష్టి 
లోక్‌సభ ఫలితాలపై అందరిలోనూ ఉత్కంఠ
ఈనాడు - హైదరాబాద్‌

ఓయూలో సికింద్రాబాద్‌ లోక్‌సభ పరిధిలోని సనత్‌నగర్‌ అసెంబ్లీ సెగ్మెంట్‌ ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు చేస్తున్న సిబ్బంది

హోరాహోరీగా సాగిన లోక్‌సభ ఎన్నికల ఉత్కంఠకు తెర పడే సమయం ఆసన్నమైంది. పోలింగ్‌ ముగిసిన 21 రోజుల తర్వాత.. మంగళవారం ఓట్ల లెక్కింపు జరగనుండడంతో ఫలితాలు తేటతెల్లం కానున్నాయి. పార్టీలకు ప్రతిష్ఠాత్మకంగా.. జాతీయ, రాష్ట్రస్థాయి నేతలకు సవాల్‌గా నిలిచిన ఈ ఎన్నికలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. పదేళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్, పదేళ్లు పరిపాలించిన భారాసతో పాటు రాష్ట్రంలో బలపడే ప్రయత్నం చేస్తున్న భాజపాకూ ఈ ఎన్నికలు అత్యంత కీలకంగా మారాయి. మూడు పార్టీలూ రెండంకెల స్థానాలు సాధించాలన్న లక్ష్యంతో పోటీ పడ్డాయి. ఉన్నవి 17 సీట్లే కనుక.. రెండంకెల సీట్లు వస్తే, అది ఒక పార్టీకే పరిమితం. మూడింటిలోనూ ఏ పార్టీకైనా ఆ భాగ్యం దక్కనుందా? లేదా.. అన్ని పార్టీలు సింగిల్‌ డిజిట్‌ సీట్లతోనే సరిపుచ్చుకోవాలా.. అనేది తేలిపోనుంది. శాసనసభ ఎన్నికల అనంతరం ఐదు నెలలకే జరిగిన లోక్‌సభ పోరులో సర్వశక్తులూ ఒడ్డిన ఈ మూడు ప్రధాన పార్టీలూ అత్యధిక స్థానాలను ఆశిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో హస్తానికి పట్టం కట్టిన ఓటర్లు ఈసారి కూడా మద్దతుగా నిలిచారని కాంగ్రెస్‌ ధీమాతో ఉంది. లోక్‌సభ ఎన్నికలు కావడంతో ప్రధానిగా మోదీ నాయకత్వానికే ప్రజలు ప్రాధాన్యమిచ్చి భాజపా వైపు మొగ్గు చూపారని ఆ పార్టీ భావిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో స్వల్ప శాతం ఓట్ల తేడాతో ఓడిపోయామని, తమ ఓటుబ్యాంకు చెక్కుచెదరలేదని, కాంగ్రెస్‌ ప్రభుత్వంపై నెలకొన్న అసంతృప్తి కలిసి వస్తుందని భారాస విశ్వాసంతో ఉంది. 

అదృష్టవంతులెవరో..

అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఆధిక్యాన్ని కొనసాగించాలని కాంగ్రెస్‌ లోక్‌సభ బరిలో సర్వశక్తులూ ఒడ్డింది. మెజారిటీ స్థానాలను ఆశిస్తూ భాజపా, భారాసలు కూడా పోటాపోటీగా ప్రచారాన్ని కొనసాగించాయి. గత నెల 13న జరిగిన పోలింగ్‌ సరళిని విశ్లేషించుకుని తాజాగా వచ్చిన ఎగ్జిట్‌పోల్‌ అంచనాలతో తమకు దక్కే స్థానాలపై ఓ అభిప్రాయానికి వచ్చిన ప్రధాన పార్టీలు.. ఓట్ల లెక్కింపులో వెలువడే అసలు ఫలితాల కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్‌కు.. లోక్‌సభ ఎన్నికలు రెఫరండమే అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రచారంలో ప్రకటించారు. తమకు రెండంకెల స్థానాలు ఖాయమని భాజపా అగ్రనాయకులు పదే పదే చెప్పారు. అటు భారాస కూడా.. తమకు సిటింగ్‌ స్థానాలతో పాటు అదనపు సీట్లు ఖాయమన్న విశ్వాసంతో ఉంది. రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాలకు మొత్తం 525 మంది అభ్యర్థులు పోటీపడగా వీరిలో కాంగ్రెస్, భారాస, భాజపా ల అభ్యర్థులు 51 మందితో పాటు సీపీఎం, ఎంఐఎం అభ్యర్థులు ఒక్కోచోట బరిలో ఉన్నారు. ప్రస్తుతం భారాసకు తొమ్మిది సిటింగ్‌ స్థానాలుండగా.. భాజపాకు నాలుగు, కాంగ్రెస్‌కు మూడు, ఎంఐఎంకు ఒక సిటింగ్‌ స్థానం ఉన్నాయి. 

అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న ముఖ్యనేతలు 

లోక్‌సభ ఎన్నికల్లో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నవారిలో పలువురు కీలకనేతలు ఉన్నారు. కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డి, భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డి.కె.అరుణ, జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్, మరో కీలకనేత ఈటల రాజేందర్‌ తదితరులు బరిలో ఉన్నారు. మారిన సమీకరణాల నేపథ్యంలో భారాస సిటింగ్‌ ఎంపీ రంజిత్‌రెడ్డి.. ఈసారి కాంగ్రెస్‌ అభ్యర్థిగా బరిలో నిలవగా.. మరో భారాస ఎంపీ బీబీ పాటిల్‌ భాజపా అభ్యర్థిగా పోటీ చేశారు.గత ఎన్నికల్లో చేవెళ్ల నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసిన కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ఈసారి భాజపా తరఫున బరిలో దిగారు.  హైదరాబాద్‌ నుంచి వరుసగా గెలుస్తున్న ఎంఐఎం అగ్రనేత అసదుద్దీన్‌ ఒవైసీ మరోసారి బరిలో నిలిచారు. 

జాతీయ నాయకత్వాల ప్రత్యేక దృష్టి

రాష్ట్రం నుంచి మెజారిటీ స్థానాలు సాధించడమే లక్ష్యంగా భాజపా, కాంగ్రెస్‌ల జాతీయ నాయకులు ప్రత్యేక దృష్టి సారించారు. ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా.. గతంలో కంటే విస్తృతంగా తెలంగాణలో ప్రచారం చేశారు. ఎన్నికల షెడ్యూల్‌ వెలువడినప్పటి నుంచి ఆఖరి రోజు ప్రచారం దాకా కూడా భాజపా అగ్రనేతలు, జాతీయ నాయకత్వం, ఇతర రాష్ట్రాల సీఎంలు, కేంద్రమంత్రులు ప్రచారంలో భాగస్వాములయ్యారు. కాంగ్రెస్‌ అగ్రనేతలు రాహుల్‌గాంధీ, ప్రియాంకాగాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పలు నియోజకవర్గాల్లో ప్రచారం చేయగా.. రాష్ట్ర మంత్రులు, కీలక నాయకులకు ఒక్కో లోక్‌సభ స్థానం బాధ్యతలు అప్పగించారు. భారాస తరఫున ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం కేసీఆర్‌ రాష్ట్రంలో బస్సుయాత్ర ద్వారా విస్తృత ప్రచారం చేయగా.. కేటీఆర్, హరీశ్‌రావు కూడా పలు నియోజకవర్గాల్లో ప్రచారసభలు, రోడ్‌షోలు నిర్వహించారు.


కీలక నియోజకవర్గాలపై అందరి దృష్టి

రాష్ట్రంలోని పలు లోక్‌సభ నియోజకవర్గాల్లో ఆసక్తికర పోరు సాగింది. దేశంలోనే అతి పెద్ద లోక్‌సభ స్థానమైన మల్కాజిగిరి మూడు పార్టీలకు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా మారింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఈ లోక్‌సభ పరిధిలోని అన్ని సెగ్మెంట్లలోనూ విజయం సాధించిన భారాస, గత లోక్‌సభ ఎన్నికల్లో రేవంత్‌రెడ్డి అభ్యర్థిగా ఈ స్థానాన్ని కైవసం చేసుకున్న కాంగ్రెస్, ఈసారి తమ పార్టీ కీలకనేత ఈటల రాజేందర్‌ను బరిలో దించిన భాజపా.. ఇలా మూడు పార్టీలూ మల్కాజిగిరిని చేజిక్కించుకునేందుకు హోరాహోరీ పోరాడాయి. కిషన్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న సికింద్రాబాద్‌లో ఆయనపై సిటింగ్‌ ఎమ్మెల్యేలు దానం నాగేందర్, టి.పద్మారావు పోటీ చేశారు. భారాసకు బలమైన స్థానం మెదక్‌లో పోరు అత్యంత ఆసక్తికరంగా జరగడంతో ఈ ఫలితంపైనా సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. 17 లోక్‌సభ స్థానాల్లో పలు చోట్ల ముఖాముఖి పోటీ జరగ్గా.. మరికొన్ని స్థానాల్లో ముక్కోణపు పోరు సాగింది. ఈ నేపథ్యంలో గెలుపు తమదంటే తమదే అనే ధీమాతో పార్టీలు ఉన్నాయి.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని