Lok Sabha elections Counting: తొలుత పోస్టల్‌ బ్యాలెట్లు.. తర్వాత ఈవీఎంలు

ఓట్ల లెక్కింపు ప్రక్రియను అత్యంత కట్టుదిట్టమైన భద్రత నడుమ.. అనేక జాగ్రత్తలు తీసుకుంటూ అధికారులు నిర్వహిస్తారు.

Updated : 04 Jun 2024 06:51 IST

ఓట్ల లెక్కింపు జరుగుతుందిలా.. 

దిల్లీ: ఓట్ల లెక్కింపు ప్రక్రియను అత్యంత కట్టుదిట్టమైన భద్రత నడుమ.. అనేక జాగ్రత్తలు తీసుకుంటూ అధికారులు నిర్వహిస్తారు. ఇందుకోసం ఎన్నికల సంఘం (ఈసీ) నిర్దేశించిన అన్ని నిబంధనలను కచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఎలా సాగుతుందంటే.. 

  • ఎన్నికల నిర్వహణ నిబంధనలు-1961లోని ‘రూల్‌ 54ఏ’ ప్రకారం.. పోస్టల్‌ బ్యాలెట్‌ పత్రాలను తొలుత లెక్కిస్తారు. రిటర్నింగ్‌ అధికారి (ఆర్‌వో) టేబుల్‌ వద్ద ఈ ప్రక్రియ మొదలవుతుంది. 
  • కౌంటింగ్‌ ప్రారంభ సమయానికి ముందు అందిన పోస్టల్‌ బ్యాలెట్లనే లెక్కింపు కోసం పరిగణనలోకి తీసుకుంటారు. 
  • పోస్టల్‌ బ్యాలెట్ల లెక్కింపు మొదలైన అరగంట తర్వాత- ఈవీఎంలలోని ఓట్లను లెక్కించడం ప్రారంభిస్తారు. 
  • ఒకవేళ ఏదైనా నియోజకవర్గంలో పోస్టల్‌ బ్యాలెట్లేవీ లేకపోతే.. నిర్దేశిత సమయానికే ఈవీఎంలలోని ఓట్ల లెక్కింపు మొదలవ్వాలి. 
  • కౌంటింగ్‌కు ‘ఫారం 17సీ’తోపాటు ఈవీఎంలలోని కంట్రోల్‌ యూనిట్లు (సీయూ) ఉంటే సరిపోతుంది. 
  • సీయూల నుంచి ఫలితాన్ని నిర్ధారించే ముందు.. వాటిపై పేపర్‌ సీల్‌ చెదిరిపోకుండా కౌంటింగ్‌ అధికారులు జాగ్రత్తగా చూసుకోవాలి. మొత్తం పోలైన ఓట్లు.. ‘ఫారం 17సీ’లో పేర్కొన్న సంఖ్యతో సమానంగా ఉన్నాయో లేదో సరిచూసుకోవాలి. 
  • సీయూలోని ఫలితాన్ని కౌంటింగ్‌ సూపర్‌వైజర్, మైక్రో అబ్జర్వర్, అభ్యర్థుల తరఫు కౌంటింగ్‌ ఏజెంట్లకు చూపించాలి. అనంతరం అభ్యర్థులవారీగా వచ్చిన ఫలితాన్ని ‘ఫారం 17సీ’లోని పార్టు-2లో నమోదు చేయాలి. 
  • సీయూలోని డిస్‌ప్లే ప్యానెల్‌పై ఒకవేళ ఫలితం కనిపించకుంటే.. అన్ని సీయూల లెక్కింపు పూర్తయ్యాక, ఆయా వీవీ ప్యాట్‌లలోని స్లిప్పులను లెక్కించాలి. 
  • ప్రతి పోలింగ్‌ స్టేషన్‌కు చెందిన ‘ఫారం 17సీ’ని.. తుది ఫలితాన్ని సమీకరిస్తున్న అధికారికి పంపించాలి. ఆ అధికారి వాటిని ‘ఫారం 20’లో పొందుపరుస్తారు. 
  • ఓట్ల లెక్కింపు పూర్తయ్యాక.. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం లేదా లోక్‌సభ సీటు పరిధిలోని ఒక్కో అసెంబ్లీ సెగ్మెంట్‌ నుంచి ఐదు పోలింగ్‌ స్టేషన్లను ర్యాండమ్‌గా ఎంపిక చేసుకొని, వాటిలో పోలైన ఓట్లతో వీవీప్యాట్‌ స్లిప్పులను సరిచూసుకోవాలి. 
  • తిరస్కరణకు గురైన పోస్టల్‌ బ్యాలెట్‌ల సంఖ్య కంటే మెజార్టీ తక్కువగా ఉన్నట్లయితే.. తిరస్కరణకు గురైన పోస్టల్‌ బ్యాలెట్‌లను తప్పనిసరిగా పునఃపరిశీలించాలి. ఆ తర్వాతే తుది ఫలితాన్ని వెల్లడించాలి. 
  • ఇద్దరు అభ్యర్థులకు సమాన సంఖ్యలో అత్యధిక ఓట్లు వస్తే.. డ్రా విధానంలో ఫలితాన్ని ప్రకటిస్తారు.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు