KTR: ఏఈఈల తుది జాబితా ప్రకటించాలి

ఏఈఈ (సివిల్‌) పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను ప్రకటించడంలో కాంగ్రెస్‌ సర్కారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ విమర్శించారు.

Published : 04 Jul 2024 03:53 IST

కేటీఆర్‌ డిమాండ్‌
టీజీపీఎస్‌సీ ఛైర్మన్‌ మహేందర్‌రెడ్డికి ఫోన్‌

కేటీఆర్‌కు వినతిపత్రం అందజేస్తున్న ఏఈఈ అభ్యర్థులు

ఈనాడు, హైదరాబాద్‌: ఏఈఈ (సివిల్‌) పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను ప్రకటించడంలో కాంగ్రెస్‌ సర్కారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ విమర్శించారు. గత భారాస ప్రభుత్వ హయాంలో దాదాపు 22 నెలల క్రితం 1180 ఏఈఈ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైందని, పరీక్ష నిర్వహణ, సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ గతేడాది సెప్టెంబరు నాటికే పూర్తయిందని, ఆ తర్వాత ఎన్నికల కోడ్‌ కారణంగా అభ్యర్థుల తుది జాబితా విడుదల నిలిచిపోయిందని వివరించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడి 7 నెలలు గడుస్తున్నా.. ఇప్పటివరకు ఈ పోస్టులకు తుది జాబితాను విడుదల చేయలేదని విమర్శించారు. దీంతో అభ్యర్థులు తీవ్ర గందరగోళంలో ఉన్నారని, ప్రభుత్వం వెంటనే ఈ జాబితా ప్రకటించాలని కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు. ఈ పరీక్ష రాసిన అభ్యర్థులు మంగళవారం హైదరాబాద్‌ నందినగర్‌లోని నివాసంలో కేటీఆర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ జాబితాను వెంటనే ప్రకటించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని విజ్ఞప్తిచేశారు. అండగా ఉంటానని అభ్యర్థులకు భరోసా ఇచ్చిన కేటీఆర్‌.. టీజీపీఎస్‌సీ ఛైర్మన్‌ మహేందర్‌రెడ్డికి ఫోన్‌ చేసి ఈ విషయంపై మాట్లాడారు. ఎంపికైన అభ్యర్థుల జాబితాను వెంటనే విడుదల చేయాలని విజ్ఞప్తిచేశారు.

భారాస ఎమ్మెల్యేలపై కేసుల నమోదు గర్హనీయం: కేటీఆర్, హరీశ్‌రావు

భారాస ఎమ్మెల్యేలు కౌశిక్‌రెడ్డి, కోవ లక్ష్మిలపై పోలీసులు అక్రమ కేసులు బనాయించారని కేటీఆర్, హరీశ్‌రావులు వేర్వేరు ప్రకటనల్లో విమర్శించారు. వారిపై కేసుల నమోదును తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రజాపాలన అంటే.. ప్రశ్నించే ప్రజాప్రతినిధులపై అక్రమ కేసులు పెట్టడమేనా అని ప్రభుత్వాన్ని నిలదీశారు. అక్రమ కేసులను చట్టప్రకారంగా ఎదుర్కొంటామని, ప్రభుత్వం ఇప్పటికైనా ప్రతీకార చర్యలను మానుకొని, కేసులను ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు.

చేనేత కార్మికుడి ఆత్మహత్య ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే: కేటీఆర్‌

కాంగ్రెస్‌ సర్కారు పరిపాలన వైఫల్యంతోనే సిరిసిల్లలో మరో చేనేత కార్మికుడు బలయ్యారని కేటీఆర్‌ ఆవేదన వ్యక్తంచేశారు. పల్లె యాదగిరి అనే కార్మికుడు ఆత్మహత్య చేసుకోవడం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ‘‘ఇది ఆత్మహత్య కాదు. ప్రభుత్వ హత్యే. రేవంత్‌రెడ్డి పాలనలో చేనేత రంగం పూర్తిగా సంక్షోభంలో కూరుకుపోయింది. కార్మికుడి కుటుంబాన్ని ఆదుకునేందుకు ప్రభుత్వం వెంటనే రూ.25 లక్షల పరిహారం చెల్లించాలి’’ అని కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు.


సర్పంచుల పెండింగ్‌ బిల్లులను అసెంబ్లీలో ప్రస్తావించండి

అంబర్‌పేట, న్యూస్‌టుడే: సర్పంచుల పెండింగ్‌ బిల్లుల అంశాన్ని రానున్న అసెంబ్లీ సమావేశాల్లో ప్రస్తావించాలని కేటీఆర్‌కు తెలంగాణ సర్పంచుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గూడూరు లక్ష్మీనర్సింహారెడ్డి విజ్ఞప్తి చేశారు. గ్రామ పంచాయతీల్లో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు 7 నెలల వేతనాలూ సత్వరం విడుదలయ్యేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని కోరారు. సంఘం ప్రతినిధులతో కలిసి బుధవారం ఆయన కేటీఆర్‌ను కలిసి ఈమేరకు విన్నవించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని