Keshava Rao: రాజ్యసభ సభ్యత్వానికి కేశవరావు రాజీనామా

భారాసను వీడి కాంగ్రెస్‌లో చేరిన కె.కేశవరావు రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. గురువారం మధ్యాహ్నం ఆయన రాజ్యసభ ఛైర్మన్‌ జగదీప్‌ ధన్‌ఖడ్‌ను కలిసి రాజీనామా లేఖ సమర్పించారు.

Published : 05 Jul 2024 04:33 IST

దిల్లీలో కేశవరావు నివాసానికి వెళ్లి ఆయనతో సమావేశమైన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి. పక్కన ఎంపీ అనిల్‌కుమార్‌ యాదవ్‌

ఈనాడు, దిల్లీ: భారాసను వీడి కాంగ్రెస్‌లో చేరిన కె.కేశవరావు రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. గురువారం మధ్యాహ్నం ఆయన రాజ్యసభ ఛైర్మన్‌ జగదీప్‌ ధన్‌ఖడ్‌ను కలిసి రాజీనామా లేఖ సమర్పించారు. పార్టీ మారిన నేపథ్యంలో నైతిక బాధ్యతగా తాను రాజీనామా సమర్పిస్తున్నట్లు ఆయన ఛైర్మన్‌కు తెలిపారు. అందుకు ధన్‌ఖడ్‌ స్పందిస్తూ.. ‘మిమ్మల్ని మేం మిస్‌ అవుతున్నాం, తిరిగి వస్తారని ఆశిస్తున్నా’ అని పేర్కొన్నట్లు తెలిసింది. ఒకసారి కాంగ్రెస్‌ తరఫున, రెండుసార్లు భారాస నుంచి కేశవరావు రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఆయన కుమార్తె, హైదరాబాద్‌ నగర మేయర్‌ విజయలక్ష్మి ఇప్పటికే కాంగ్రెస్‌లో చేరారు. బుధవారం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో కేకే హస్తం గూటికి చేరారు. కేశవరావు రాజీనామాతో ఆ స్థానానికి త్వరలో ఉప ఎన్నిక జరిగే అవకాశం ఉంది. అసెంబ్లీలో కాంగ్రెస్‌కు మెజార్టీ స్థానాలున్నందున ఆ పార్టీ అభ్యర్థి ఎన్నికయ్యే అవకాశమే ఎక్కువగా ఉంది.  

విలువలకు కట్టుబడి రాజీనామా: కేశవరావు 

విలువలకు కట్టుబడి తాను రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసినట్లు కేశవరావు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ‘‘కాంగ్రెస్‌లో చేరిన నేపథ్యంలో నైతికంగా, చట్టపరంగా రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయక తప్పదు. నాకింకా రెండేళ్ల సమయం ఉన్నప్పటికీ విలువలకు కట్టుబడి రాజీనామా చేశా’’ అని పేర్కొన్నారు. మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గురువారం సాయంత్రం దిల్లీలో కేశవరావు నివాసానికి వెళ్లి ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయన అనుభవాన్ని, సేవలను రాష్ట్ర ప్రభుత్వపరంగా ఉపయోగించుకుంటామని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని