Shashi Tharoor: కేరళ ఎయిమ్స్‌ తెచ్చిన చిచ్చు.. థరూర్‌, చంద్రశేఖర్‌ మధ్య మాటల యుద్ధం

కేరళలో ఎయిమ్స్ ఏర్పాటుపై ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి  వీణా జార్జ్‌ అసెంబ్లీలో చేసిన ప్రకటన నేపథ్యంలో తిరువనంతపురం ఎంపీ శశథరూర్‌, తాజా ఎన్నికల్లో ఆయన ప్రత్యర్థి రాజీవ్‌ చంద్రశేఖర్‌ మధ్య ‘ఎక్స్‌’ వేదికగా మాటల యుద్ధం చోటు చేసుకుంది.

Published : 01 Jul 2024 00:06 IST

తిరువనంతపురం: కేరళలో ఎయిమ్స్ (Kerala AIIMS) ఏర్పాటుపై ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి  వీణా జార్జ్‌ అసెంబ్లీలో చేసిన ప్రకటన నేపథ్యంలో తిరువనంతపురం ఎంపీ శశథరూర్‌ (Shashi Tharoor), తాజా ఎన్నికల్లో ఆయన ప్రత్యర్థి రాజీవ్‌ చంద్రశేఖర్‌ (Rajeev Chandrashekhar) మధ్య ‘ఎక్స్‌’ వేదికగా మాటల యుద్ధం చోటు చేసుకుంది. కొయ్‌కోడ్‌లోని కినలూర్‌లో ఎయిమ్స్‌ ఏర్పాటు ప్రతిపాదనకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించిందని వీణా జార్జ్‌ అసెంబ్లీలో ప్రకటన చేశారు. దీనిపై థరూర్‌ ఎక్స్‌ వేదికగా స్పందిస్తూ.. భాజపా తప్పుడు వాగ్ధానాలతో ప్రజలను మభ్యపెడుతోందని విమర్శించారు. దీనిపై చంద్రశేఖర్‌ ఘాటు విమర్శలు చేశారు. అత్యంత సున్నితంగా మాట్లాడగలిగే థరూర్‌కు పనులు చేయడం మాత్రం చేతకాదని అన్నారు.

తమకు నచ్చిన చోట ఎయిమ్స్‌ ఏర్పాటుకు ఏ ఎంపీ హామీ ఇవ్వలేరని ఎక్స్‌ వేదికగా థరూర్‌ వ్యాఖ్యానించారు. అలా కాకుండా సీపీఎం నేతృత్వంలోని కేరళ ప్రభుత్వ ప్రతిపాదనకు కేంద్రం అంగీకరించిందంటే దాని వెనకున్న మర్మం తెలుసుకోవాలన్నారు.  కేరళలో ఎయిమ్స్‌ ఎక్కడ ఏర్పాటు చేయాలన్నదానిపై ఆ రాష్ట్ర ప్రభుత్వం కేవలం కొయ్‌కోడ్‌ను మాత్రమే ప్రతిపాదించింది. ఒకే ఒక్క ఆప్షన్‌ ఇవ్వడంతో విధిలేని పరిస్థితుల్లో కేంద్రం అంగీకరించిందని చెప్పారు.  అదే విషయాన్ని శనివారం ఆ రాష్ట్ర మంత్రి సభకు వెల్లడించారని అన్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించేలా భాజపా నేతలు వ్యవహరించడం సిగ్గు చేటన్నారు. తిరువనంతపురంలో ఎయిమ్స్‌ ఏర్పాటుకు ఎన్నోసార్లు ప్రయత్నించానని, చాలా మందితో సంప్రదింపులు జరిపానని గుర్తు చేశారు.

దీనిపై భాజపా నేత రాజవ్‌ చంద్రశేఖర్‌ ఘాటుగా విమర్శలు గుప్పించారు. శశిథరూర్‌కు ప్రకటనలు తప్ప పనులు చేతకావని ఎద్దేవా చేశారు. తిరువనంతపురం నుంచి నాలుగు సార్లు ఎంపీగా ఎన్నికైన ఆయన.. ఇక్కడి ప్రజల కోసం ఏం చేశారని ప్రశ్నించారు. ‘‘ గత 15 ఏళ్లుగా తిరువనంతపురం ఎంపీగా ఉన్న ఆయన.. ఒక్క హామీనైనా నెరవేర్చారా? తిరువనంతపురాన్ని బార్సిలోనా చేస్తానన్న నుంచి ఇక్కడికి హైకోర్టు బెంచ్‌ తీసుకొస్తానన్నంత వరకు ఇలా ఎన్నో హామీలు గుప్పించారు. ఒక్కటైనా నెరవేరిందా?  కొయ్‌కోడ్‌కు ఎయిమ్స్‌ వచ్చిందని తెలియగానే రిలాక్స్‌ అయిపోయారు.  అదే భాజపా/ఎన్డీయే ఎంపీ ఇక్కడి నుంచి ప్రాతినిధ్యంవహిస్తే అలా ఊరుకుంటారా? కచ్చితంగా పోరాడతాం.’’ అని చంద్రశేఖర్‌ అన్నారు.  ఇటీవలి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థిగా బరిలోకి దిగిన చంద్రశేఖర్.. తనను గెలిపిస్తే ఇక్కడికి ఎయిమ్స్‌ తీసుకొస్తానని హామీ ఇచ్చారు. కాంగ్రెస్‌ అభ్యర్థి థరూర్‌పై విజయం సాధించేందుకు తీవ్ర ప్రయత్నం చేశారు.అయితే ఓటమి పాలయ్యారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని