KCR: మీకు అండగా నేనుంటా

కాంగ్రెస్‌ ప్రభుత్వం అనేక రకాలుగా ప్రలోభాలకు పాల్పడుతూ.. ఒత్తిడికి గురిచేస్తూ.. లొంగదీసుకోవడానికి ప్రయత్నిస్తోందని, ఎట్టి పరిస్థితుల్లోనూ ధైర్యాన్ని కోల్పోవద్దని భారాస ఎమ్మెల్యేలనుద్దేశించి పార్టీ అధినేత కేసీఆర్‌ పేర్కొన్నారు.

Updated : 27 Jun 2024 07:10 IST

ఎట్టి పరిస్థితుల్లోనూ ధైర్యం కోల్పోవద్దు
ప్రభుత్వ కుట్రలను చట్టప్రకారం ఎదుర్కొందాం
భారాస ఎమ్మెల్యేలకు కేసీఆర్‌ భరోసా

కేసీఆర్‌తో మర్రి రాజశేఖర్‌రెడ్డి, ఎ.జీవన్‌రెడ్డి, మల్లారెడ్డి, బండారి లక్ష్మారెడ్డి, కాలేరు వెంకటేశ్, పల్లా రాజేశ్వర్‌రెడ్డి

ఈనాడు, హైదరాబాద్‌: కాంగ్రెస్‌ ప్రభుత్వం అనేక రకాలుగా ప్రలోభాలకు పాల్పడుతూ.. ఒత్తిడికి గురిచేస్తూ.. లొంగదీసుకోవడానికి ప్రయత్నిస్తోందని, ఎట్టి పరిస్థితుల్లోనూ ధైర్యాన్ని కోల్పోవద్దని భారాస ఎమ్మెల్యేలనుద్దేశించి పార్టీ అధినేత కేసీఆర్‌ పేర్కొన్నారు. ‘‘ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లోకి మిమ్మల్ని నెట్టినా.. ఏ దశలోనైనా మీకు నేను అండగా ఉంటాను. నన్ను కూడా అనేక విధాలుగా ఇబ్బందులకు గురిచేసేందుకు ప్రభుత్వం కుట్రలు చేస్తోంది. ఆ కుట్రలను చట్టప్రకారం ఎదుర్కొందాం’’ అని భరోసా ఇచ్చారు. ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో కేసీఆర్‌తో పలువురు భారాస ఎమ్మెల్యేలు, నేతలు బుధవారం భేటీ అయ్యారు. వీరిలో ఎమ్మెల్యేలు టి.హరీశ్‌రావు, వేముల ప్రశాంత్‌రెడ్డి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, చామకూర మల్లారెడ్డి, మర్రి రాజశేఖర్‌రెడ్డి, బండారి లక్ష్మారెడ్డి, కాలేరు వెంకటేశ్, దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, ఎమ్మెల్సీ తాతా మధు, మాజీ ఎమ్మెల్యేలు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, ఎ.జీవన్‌రెడ్డి, రసమయి బాలకిషన్, సుంకె రవిశంకర్, గిడ్డంగుల సంస్థ మాజీ ఛైర్మన్‌ రజిని సాయిచంద్, భారాస నేతలు రాగిడి లక్ష్మారెడ్డి, సుధీర్‌బాబు, పల్లె రవిగౌడ్‌ తదితరులున్నారు. జిల్లాల నుంచి వచ్చిన కార్యకర్తలను కేసీఆర్‌ పలకరించారు. వారితో ఫొటోలు దిగారు. అనంతరం పార్టీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలతో సమావేశమై రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. ఎమ్మెల్యేలకు పలు సూచనలు చేశారు. ‘‘కాంగ్రెస్‌ ప్రభుత్వం పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తోంది. భారాస ఎమ్మెల్యేలపై ఒత్తిడి తీసుకొచ్చి లొంగదీసుకోవడానికి అన్ని రకాల కుట్రలను ప్రయోగిస్తోంది. ఇలాంటప్పుడే తట్టుకొని నిలబడాలి. ఒత్తిళ్లకు లోనుకావద్దు. ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీ మారొద్దు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎన్ని రకాలుగా ఇబ్బందులు సృష్టించినా.. అధైర్యపడొద్దు. మీకు ఏ చిన్న కష్టమొచ్చినా నేరుగా నన్ను సంప్రదించండి. అన్నింటికీ నేను అండగా నిలుస్తా. చట్టప్రకారం ఎంత దూరమైనా వెళ్లి పోరాడదాం. న్యాయవ్యవస్థపై మనకు నమ్మకం ఉంది. పార్టీ ఫిరాయింపుదారులను వదిలిపెట్టే ప్రసక్తే లేదు. గురువారం(27న) హైకోర్టు తీర్పు వెలువడిన తర్వాత అవసరమైతే సుప్రీంకోర్టును ఆశ్రయిద్దాం. ప్రజల వైపు ఉందాం. వారి సమస్యలపై పోరాడదాం. ప్రజల మద్దతు తప్పకుండా మనకే ఉంటుంది. మళ్లీ భారాస ప్రభుత్వమే అధికారంలోకి వస్తుంది’’ అని కేసీఆర్‌ ధీమా వ్యక్తం చేశారు. 

తెలంగాణ భవన్‌లో గురువారం సింగరేణి ప్రాంత ప్రజాప్రతినిధులు, ముఖ్య నేతలతో భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ సమావేశం కానున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని