KCR: పార్టీని వీడే వారి గురించి ఆలోచించొద్దు: కేసీఆర్‌

పార్టీని వీడి దొంగల్లో కలసినవారి గురించి బాధలేదని.. అంతకన్నా మెరుగైన, మెరకల్లాంటి యువ నాయకులను పార్టీ సృష్టిస్తుందని భారాస అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ తెలిపారు. 

Updated : 28 Jun 2024 19:24 IST

హైదరాబాద్‌: పార్టీని వీడి దొంగల్లో కలిసిన వారి గురించి బాధలేదని.. అంతకన్నా మెరుగైన, మెరకల్లాంటి యువ నాయకులను పార్టీ సృష్టిస్తుందని భారాస అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ అన్నారు. ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో శుక్రవారం జగిత్యాల, కోరుట్ల నియోజకవర్గాల నుంచి వచ్చిన నేతలు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌ పార్టీని వీడిన నేపథ్యంలో కీలక వ్యాఖ్యలు చేశారు.  

‘‘భారాస శ్రేణులకు ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు ఒక లెక్కే కాదు. పార్టీ నుంచి వెళ్తోన్న నాయకుల గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఒకరు పోతే 10 మంది నాయకుల్ని పార్టీ తీర్చిదిద్దుకుంటుంది. తెలంగాణ ఆత్మను అర్థం చేసుకుంటూ సమస్యలను లోతుగా పట్టుకోగలిగి పరిష్కరించగలిగే సత్తా భారాసకే ఉంది. రెట్టించిన ఉత్సాహంతో భవిష్యత్తులో ఇంకా బాగా ప్రజల కోసం పనిచేయాల్సి ఉంది. పదేళ్లపాటు అన్ని వర్గాల అభివృద్ధికి కృషి చేశాం. కొన్ని సార్లు ప్రజాస్వామ్యంలో అబద్ధపు ప్రచారాలు నమ్మి ప్రజలు బోల్తాపడుతుంటారు. మొన్నటి ఎన్నికల్లో అదే జరిగింది. ఓడిపోయినంత మాత్రాన నిరుత్సాహపడొద్దు. అధికారం ఉంటేనే పనిచేస్తామంటే పద్ధతి కాదు. ఏ హోదాలో ఉన్నా ప్రజల కోసం పనిచేయాల్సిందే. అంతిమ లక్ష్యం తెలంగాణ ప్రజల సంక్షేమం, అభివృద్ధి మాత్రమే. నాడు ఉద్యమంలోకి దిగినప్పుడు మనతో ఎవరు ఉన్నారు? నాడైనా, నేడైనా నాయకులను తయారు చేసుకునేది పార్టీనే’’ అని కేసీఆర్‌ వ్యాఖ్యానించారు. అంతకముందు.. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నేతలతో ప్రత్యేకంగా సమావేశమైన కేసీఆర్.. పార్టీ బలోపేతం కోసం తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని