JP Nadda: రాజ్యసభాపక్ష నేతగా జె.పి.నడ్డా నియామకం

కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జగత్‌ ప్రకాశ్‌ నడ్డా గురువారం రాజ్యసభాపక్ష నేతగా నియమితులయ్యారు. ఎగువసభ 264వ సెషన్‌ ప్రారంభమైన తొలి రోజున ఈ నియామకం విషయాన్ని ఛైర్మన్‌ జగదీప్‌ ధన్‌ఖడ్‌ సభ్యుల హర్షధ్వానాల మధ్య ప్రకటించారు.

Published : 28 Jun 2024 06:00 IST

దిల్లీ: కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జగత్‌ ప్రకాశ్‌ నడ్డా గురువారం రాజ్యసభాపక్ష నేతగా నియమితులయ్యారు. ఎగువసభ 264వ సెషన్‌ ప్రారంభమైన తొలి రోజున ఈ నియామకం విషయాన్ని ఛైర్మన్‌ జగదీప్‌ ధన్‌ఖడ్‌ సభ్యుల హర్షధ్వానాల మధ్య ప్రకటించారు. ఆ సమయంలో ప్రధాని మోదీ కూడా సభలో ఉన్నారు. రాజ్యసభాపక్ష నేతగా జె.పి.నడ్డాను నియమించాలని భాజపా ఇదివరకే నిర్ణయించింది. అదే విషయాన్ని రాజ్యసభకు తెలియజేసింది.

ఆరుగురు కొత్త సభ్యుల ప్రమాణం

బిహార్, ఝార్ఖండ్, మధ్యప్రదేశ్‌ల నుంచి ఎగువసభకు కొత్తగా ఎన్నికైన ఆరుగురు ఎంపీలు గురువారం రాజ్యసభ సభ్యులుగా ప్రమాణం చేశారు. వీరితో సహా రాజ్యసభకు ఎన్నికైన, నియమితులైన 61 మంది కొత్త సభ్యులకు ఛైర్మన్‌ ధన్‌ఖడ్‌ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీని సభకు పరిచయం చేశారు. అనంతరం ప్రధాని మోదీ తన మంత్రి మండలి సభ్యులను రాజ్యసభకు పరిచయం చేశారు. 

‘తెలంగాణ టుడే’ బేషరతు క్షమాపణ

సభాహక్కుల కమిటీ సమర్పించిన మరో నివేదికలో.. ‘తెలంగాణ టుడే’ పత్రిక అసత్య కథనంతో నిబంధనల ఉల్లంఘనకు పాల్పడిందని స్పష్టం చేసింది. అయితే, జరిగిన తప్పిదంపై ఆ పత్రిక ఎడిటర్‌ బేషరతుగా క్షమాపణ తెలిపారని నివేదిక పేర్కొంది.

కాంగ్రెస్‌ నేత శశిథరూర్‌ గురువారం లోక్‌సభలో ఎంపీగా ప్రమాణం చేశారు.


దుష్ప్రవర్తనకు గాను 12 మంది ఎంపీలను దోషులుగా తేల్చిన కమిటీ

త ఏడాది ఆగస్టులో రాజ్యసభ కార్యకలాపాలకు ఆటంకం కలిగించిన 12 మంది విపక్ష ఎంపీలను దోషులకు తేల్చుతూ సభాహక్కుల కమిటీ గురువారం నివేదిక సమర్పించింది. వీరిలో సంజయ్‌ సింగ్, శక్తిసింహ్‌ గోహిల్, సుశీల్‌కుమార్‌ గుప్తా, సందీప్‌కుమార్‌ పాఠక్, ఎన్‌.జె.రాఠవా, ఎల్‌.హనుమంతయ్య, సయ్యద్‌ నాసిర్‌ హుస్సేన్, కుమార్‌ కేట్కర్, పి.డి.నేతమ్, జె.ఎం.హిశం, రంజీత్‌ రంజన్, ఇమ్రాన్‌ ప్రతాప్‌గడి ఉన్నారు. అయితే, కుమార్‌ కేట్కర్, ఎన్‌.జె.రాఠవా, ఎల్‌.హనుమంతయ్యల పదవీకాలం ముగియడంతో వీరిపై ఎలాంటి చర్యలకు కమిటీ సిఫార్సు చేయలేదు. ఆప్‌ ఎంపీ సంజయ్‌ సింగ్‌ను ఇప్పటికే సభ నుంచి సస్పెండ్‌ చేశారు. ఆయన తన ప్రవర్తనకు గాను క్షమాపణ తెలపడంతో సస్పెన్షన్‌ ఎత్తివేయాలని కమిటీ సూచించగా రాజ్యసభ ఛైర్మన్‌ అంగీకరించారు. సంజయ్‌ సింగ్‌కు విధించిన శిక్ష సరిపోతుందని కమిటీ అభిప్రాయపడింది. దోషులుగా తేలిన సభ్యులు భవిష్యత్తులో ఇలాంటి తప్పిదానికి పాల్పడరాదని కమిటీ మందలించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని