Hemant Soren: నాపై మరో కుట్ర జరుగుతోంది: హేమంత్ సోరెన్‌

ఝార్ఖండ్‌ మాజీ సీఎం హేమంత్‌ సోరెన్ కేంద్రంలోని భాజపాపై విరుచుకుపడ్డారు. భూస్వామ్య శక్తులకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తామని ప్రకటించారు. 

Updated : 30 Jun 2024 18:28 IST

రాంచీ: భూస్వామ్య శక్తులకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తామని ఝార్ఖండ్‌ మాజీ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌ (Hemant Soren) ప్రకటించారు. రాష్ట్రంలో భాజపాను విపక్ష ‘ఇండియా’ కూటమి తరిమికొట్టడం ఖాయమని అన్నారు. ఒక సభలో పాల్గొన్న హేమంత్‌.. మోదీ సర్కార్‌పై విరుచుకుపడ్డారు.

‘‘నేను జైలు నుంచి విడుదల కావడంతో కాషాయ పార్టీ సతమతమవుతోంది. మళ్లీ నాపై కొత్తగా కుట్రకు తెర తీయబోతోంది. నాడు తెల్లదొరలకు వ్యతిరేకంగా సంతాల్‌ తిరుగుబాటు జరిగింది. అదే మాదిరిగా ఝార్ఖండ్‌తో పాటు దేశవ్యాప్తంగా భూస్వామ్య శక్తులకు వ్యతిరేకంగా తిరుగుబాటు జరుగుతుంది. భాజపాను విపక్షాల కూటమి తరిమికొడుతుంది. రాష్ట్రంలో ఆ పార్టీ తుడిచిపెట్టుకుపోయే సమయం ఆసన్నమైంది’’ అని దుయ్యబట్టారు.

‘మోదీ నైతికంగా ఓడిపోయారు

‘‘హవాలా కేసులో నాపై ఉద్దేశపూర్వకంగా భాజపా కుట్ర పన్నింది. తనకు వ్యతిరేకంగా గళం విప్పిన వారిని లక్ష్యంగా చేసుకుంటోంది. దానికి కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఆయుధంగా ఉపయోగించుకుంటోంది. నేను జైలు నుంచి వచ్చి రెండు రోజులే అయ్యింది. కాషాయ పార్టీ అగ్రనేతలు తరచూ రాష్ట్రానికి రాకపోకలు సాగిస్తున్నారు. నాపై మరో కుట్రకు తెరతీసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి’’ అని ఆరోపించారు. కాగా.. ఇటీవల హైకోర్టు మంజూరు చేసిన బెయిల్‌తో జైలు నుంచి హేమంత్‌ విడుదలైన సంగతి తెలిసిందే. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని