Jeevan Reddy: ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డికి బుజ్జగింపులు.. దిల్లీకి చేరిన జగిత్యాల పంచాయితీ

కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డికి దిల్లీకి రావాలని పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి దీపాదాస్‌ మున్షీ నుంచి పిలుపు వచ్చింది.

Updated : 26 Jun 2024 16:57 IST

హైదరాబాద్‌: జగిత్యాల భారాస ఎమ్మెల్యే సంజయ్‌ కుమార్‌ కాంగ్రెస్‌లో చేరిక వ్యవహారంపై పంచాయితీ దిల్లీకి చేరింది. సంజయ్‌ కుమార్ చేరికను కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. గత మూడు రోజులుగా జీవన్‌రెడ్డి అలకబూనడంతో బుజ్జగించే కార్యక్రమం సాగింది. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్‌బాబు, ప్రభుత్వ విప్‌లు ఆది శ్రీనివాస్‌, అడ్లూరి లక్ష్మణ్, ఎమ్మెల్యేలు రాజ్‌ఠాకూర్‌, ప్రేమ్‌సాగర్‌రావు తదితరులు బుజ్జగించారు. అయినా, జీవన్‌రెడ్డి మెట్టు దిగలేదు. తన ప్రమేయం లేకుండా జరగాల్సింది జరిగిపోయిందని జీవన్‌రెడ్డి అందోళన వ్యక్తం చేశారు. పార్టీని వీడేది లేదని స్పష్టం చేస్తున్నప్పటికీ ఇవాళ తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయనున్నట్టు వెల్లడించారు. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన పార్టీ అధిష్టానం, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్‌ మున్షీ జీవన్‌రెడ్డికి సర్ది చెప్పే ప్రయత్నం చేశారు.

బుధవారం ఉదయం ఉప ముఖ్యమంత్రి భట్టి, మంత్రి ఉత్తమ్‌ దిల్లీ వెళ్లారు. ఆ వెంటనే భట్టి శ్రీధర్‌బాబుతో మాట్లాడిన తర్వాత జీవన్‌రెడ్డిని దిల్లీకి రావాల్సిందిగా ఆహ్వానించారు. ప్రభుత్వ విప్‌ అడ్లూరి లక్ష్మణ్‌ జీవన్‌రెడ్డిని వెంటబెట్టుకుని దిల్లీ వెళ్లారు. సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మున్షీ, మంత్రులు పొంగులేటి, సీతక్క, కోమటిరెడ్డి, జూపల్లి తదితరులు దిల్లీలోనే ఉన్నారు. రేవంత్ రెడ్డి , దీపాదాస్ మున్షీలతో  సమావేశమైన తర్వాత సాయంత్రం జీవన్‌రెడ్డిని కాంగ్రెస్ పెద్దలతో కూడా కలిపించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 40 సంవత్సరాలుగా కాంగ్రెస్‌లో ఉన్న సీనియర్ నేత అలకబూనడం పార్టీ శ్రేణుల్లో తప్పుడు సంకేతాలు వెళ్లకుండా నిలువరించేందుకు అధిష్టానం నష్ట నివారణ చర్యలు చేపట్టినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని