Balashowry: విభజన చట్టం హామీ ప్రకారం అమరావతికి సాయం చేయండి

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి నిర్మాణం కోసం విభజన చట్టంలో ఇచ్చిన హామీ ప్రకారం సాయం చేయాలని జనసేన లోక్‌సభాపక్ష నాయకుడు వల్లభనేని బాలశౌరి డిమాండ్‌ చేశారు.

Published : 02 Jul 2024 06:53 IST

లోక్‌సభలో బాలశౌరి డిమాండ్‌ 

ప్రధాని మోదీకి పుష్పగుచ్ఛం అందజేస్తున్న బాలశౌరి

ఈనాడు, దిల్లీ : ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి నిర్మాణం కోసం విభజన చట్టంలో ఇచ్చిన హామీ ప్రకారం సాయం చేయాలని జనసేన లోక్‌సభాపక్ష నాయకుడు వల్లభనేని బాలశౌరి డిమాండ్‌ చేశారు. ఆయన సోమవారం లోక్‌సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చలో మాట్లాడారు. దేశంలో రాజధాని లేని ఏకకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌ ఒక్కటేనని, ఇప్పటివరకు కేంద్రం దీని నిర్మాణం కోసం రూ.1,500 కోట్లు మాత్రమే ఇచ్చిందని, ఇది ఏమాత్రం సరిపోదని పేర్కొన్నారు. అందువల్ల విభజన చట్టంలో పేర్కొన్న హామీ మేరకు పూర్తిసాయం అందించాలని విన్నవించారు. అలాగే పోలవరం ప్రాజెక్టు పూర్తిచేయడానికి ఎప్పటికప్పుడు నిధులు మంజూరుచేస్తూ పోవాలని కోరారు. జల్‌జీవన్‌ మిషన్‌ కింద గ్రామీణ ప్రాంతాల్లో తాగునీరు అందించే పథకానికి ఇదివరకటి రాష్ట్ర ప్రభుత్వం తన వాటా ఇవ్వకపోడంవల్ల ఆ పథకం స్తంభించిపోయిందన్నారు. ఇప్పుడైనా కేంద్ర ప్రభుత్వం కరుణించి మచిలీపట్నం నియోకవర్గంలోని గ్రామీణ ప్రాంతాలకు కొళాయి నీరు అందించడానికి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో ముడిచమురు రిఫైనరీ ఏర్పాటుచేస్తామని విభజన చట్టంలో చెప్పినందున దాని ప్రకారం మచిలీపట్నంలో నెలకొల్పాలని కోరారు. మచిలీపట్నం నుంచి రేపల్లె వరకు కొత్త రైల్వేలైన్‌ నిర్మాణం పూర్తిచేయాలని విజ్ఞప్తిచేశారు. ప్రస్తుతం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు ప్రధాని మోదీ మద్దతు ఇస్తే సీఎం చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ల నాయకత్వంలో అది పూర్వవైభవం సంతరించుకుంటుందన్న నమ్మకం ఉందన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని