janasena party: జనసేన స్ట్రైక్‌ రేట్‌ 100%.. పోటీ చేసిన అన్నిచోట్లా విజయం

ఏపీ ఎన్నికల్లో జనసేన సరికొత్త రికార్డు నమోదు చేసింది. పోటీ చేసిన అన్నిచోట్లా విజయం సాధించింది.

Updated : 04 Jun 2024 18:00 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో పవన్‌ కల్యాణ్‌ (pawan kalyan) నేతృత్వంలోని జనసేన పార్టీ (Janasena party) సరికొత్త రికార్డు నమోదు చేసింది. పోటీ చేసిన అన్నిచోట్లా ఆ పార్టీ విజయం సాధించింది. పదేళ్ల రాజకీయ ప్రయాణంలో సరికొత్త విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. గతేడాది కేవలం ఒక్కటంటే ఒక్క స్థానం గెలుపొందిన ఆ పార్టీ.. ఈసారి ఏకంగా పోటీ చేసిన 21 స్థానాల్లోనూ విజయం సాధించింది. తోక పార్టీ అంటూ విమర్శలు చేసిన వారికి ఈ విజయంతో గట్టి బదులిచ్చింది.

ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదంటూ మొదటినుంచీ చెప్తూ వచ్చిన జనసేనాని పవన్‌ కల్యాణ్‌ కీలక సమయంలో తెదేపాతో పొత్తు ప్రకటించారు. సీట్ల సర్దుబాటు సమయంలో ఆయన 24 స్థానాల్లో పోటీ చేస్తామని తొలుత ప్రకటించారు. తర్వాత మూడు స్థానాలు మిత్రపక్షాలకు విడిచిపెట్టారు. దీంతో కొందరు ‘సీనియర్‌’ నేతలు పవన్‌కు ‘ఉచిత’ సలహాలు ఇచ్చారు. ఆయనకు లేఖాస్త్రాలు సంధించారు. కానీ, వారి ‘పల్లకి మోత’లకు ఎక్కడా పవన్‌ కల్యాణ్‌ తలొగ్గలేదు. వారికి సమాధానం కూడా ఇచ్చిందే లేదు. తన పనిని చేసుకుంటూ పోయారు. 21 స్థానాలకు పార్టీ అభ్యర్థులను ప్రకటించారు. అందరినీ ఒంటిచేత్తో గెలిపించుకోగలిగారు.

98 శాతం కాదు.. 100 శాతం

‘‘గెలిచే సామర్థ్యం ఉన్న అభ్యర్థులనే బరిలో నిలుపుతున్నాం. ఎక్కువ సీట్లు తీసుకుని ప్రయోగాలు చేసే బదులు, తక్కువ స్థానాలు తీసుకుని రాష్ట్ర భవిష్యత్‌ కోసం ముందుకెళ్లాలని నిర్ణయించాం. 98 శాతం స్ట్రైక్‌ రేటు ఉండేలా అభ్యర్థులను ఎంపిక చేశాం. 60, 70 స్థానాలు కావాలని కొందరు అంటున్నారు. గత ఎన్నికల్లో కనీసం 10 స్థానాలు గెలిచి ఉంటే ఎక్కువ స్థానాలు అడిగేందుకు అవకాశం ఉండేది’’ అని ఎన్నికల ముందు పవన్‌ కల్యాణ్‌ ఓ ప్రెస్‌మీట్‌లో చెప్పారు. ఎలాంటి పొరపొచ్చాలు వచ్చినా అవన్నీ దాటుకుని తెదేపా- జనసేన గెలుపునకు కృషి చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఆయన చెప్పినట్లే ఆ పార్టీ అభ్యర్థులు 21 స్థానాల్లో విజయం సాధించారు.

తెదేపా హిట్టింగ్‌

ఈసారి జనసేన, భాజపాతో కలిసి బరిలోకి దిగిన తెలుగుదేశం పార్టీ కూడా సంచలన విజయాన్ని నమోదు చేసింది. 2014 ఎన్నికల్లో 102 స్థానాల్లో గెలుపొందిన ఆ పార్టీ గత ఎన్నికల్లో కేవలం 23 స్థానాలకే పరిమితమైంది. ఈసారి 144 స్థానాల్లో పోటీ చేసిన ఆ పార్టీ 137 స్థానాల్లో విజయం దిశగా దూసుకెళుతోంది. అటు భాజపా 10 స్థానాల్లో పోటీ చేయగా.. 8 చోట్ల విజయం దిశగా దూసుకెళుతోంది. అదే సమయంలో ‘వై నాట్‌ 175’ అంటూ ‘అతి’కి పోయిన వైకాపా.. 10 సీట్లకే పరిమితమయ్యేలా ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు