Hemant Soren: ఝార్ఖండ్‌ సీఎం పీఠంపై మళ్లీ హేమంత్‌ సోరెన్‌!

భూకుంభకోణం కేసులో అరెస్టయి ఇటీవల బెయిల్‌పై విడుదలైన జేఎంఎం కార్యనిర్వాహక అధ్యక్షుడు హేమంత్‌ సోరెన్‌ మరోసారి సీఎం పగ్గాలు చేపట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం.

Updated : 03 Jul 2024 16:44 IST

రాంచీ: ఝార్ఖండ్‌ (Jharkhand)ముఖ్యమంత్రిగా మళ్లీ హేమంత్‌ సోరెన్‌ (Hemant Soren) పగ్గాలు చేపట్టేందుకు రంగం సిద్ధమైంది. జేఎంఎం సారథ్యంలోని కూటమి ఎమ్మెల్యే ఏకగ్రీవంగా ఆయన్ను  సభాపక్ష నేతగా ఎన్నుకున్నట్లు ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. భూ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్‌ కేసులో హేమంత్‌ను ఈడీ అధికారులు అరెస్టు చేసిన సమయంలో ఆయన సీఎం పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. దాదాపు 5 నెలల పాటు జైలులో ఉన్న ఆయన జూన్‌ 28న విడుదలైన నేపథ్యంలో ఇండియా కూటమి పార్టీల ఎమ్మెల్యేలు బుధవారం రాంచీలో ప్రస్తుత సీఎం చంపాయీ సోరెన్‌ నివాసంలో భేటీ అయ్యారు. మళ్లీ హేమంత్‌ సీఎంగా ఉండాలని ఏకగ్రీవంగా నిర్ణయించినట్లు సమాచారం. ఈ సమావేశంలో రాష్ట్ర కాంగ్రెస్‌ ఇన్‌ఛార్జి గులాం అహ్మద్‌ మీర్‌, ఆ పార్టీ అధ్యక్షుడు రాజేష్‌ ఠాకూర్‌ పాల్గొన్నారు. హేమంత్‌ సోరెన్‌ సతీమణి కల్పనా సోరెన్‌, ఆయన సోదరుడు సోదరుడు బసంత్‌ కూడా ఉన్నారు.

మరోవైపు మంగళ, బుధవారాల్లో సిట్టింగ్ సీఎం చంపాయీ సోరెన్‌ కీలక కార్యక్రమాలను రద్దు చేసుకోవడంతో రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద మార్పు చోటుచేసుకోబోతోందన్న ఊహాగానాలు చెలరేగాయి. అలాగే, అంతకముందు గందేయ్‌ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో హేమంత్‌ సతీమణి కల్పా సోరెన్‌ గెలుపొందడంతో ఆమె సీఎంగా పగ్గాలు చేపట్టబోతున్నారంటూ ప్రచారం జరిగినప్పటికీ చివరికి హేమంత్‌ సోరెన్‌ మూడోసారి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించేందుకు రంగం సిద్ధమైనట్లు సమాచారం.

ఝార్ఖండ్‌ ముక్తిమోర్చ (JMM) కార్యనిర్వాహక అధ్యక్షుడైన హేమంత్‌ సోరెన్‌ను ఈడీ అధికారులు జనవరి 31న అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అప్పట్నుంచి దాదాపు ఐదు నెలల పాటు బిర్సా ముండా జైలులో ఉన్నారు. తన అరెస్టుకు కొద్దిగంటల ముందే నాటకీయ పరిణామాల మధ్య ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. దీంతో కొత్త సీఎంగా చంపాయీ సోరెన్‌ బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. ఇటీవల హేమంత్‌కు రాంచీ హైకోర్టు బెయిల్‌ మంజూరు చేయడంతో జైలు నుంచి విడుదలయ్యారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు