10న తెలంగాణకు కాంగ్రెస్‌ కురియన్‌ కమిటీ

లోక్‌సభ ఎన్నికల్లో ఆశించిన మేరకు లక్ష్యాలు సాధించకపోవడానికి కారణాలపై అధ్యయనం చేయడానికి ఏఐసీసీ నియమించిన నిజనిర్ధారణ కమిటీ ఈ నెల 10న తెలంగాణకు రానుంది.

Published : 05 Jul 2024 04:24 IST

లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై అధ్యయనం

హైదరాబాద్, న్యూస్‌టుడే: లోక్‌సభ ఎన్నికల్లో ఆశించిన మేరకు లక్ష్యాలు సాధించకపోవడానికి కారణాలపై అధ్యయనం చేయడానికి ఏఐసీసీ నియమించిన నిజనిర్ధారణ కమిటీ ఈ నెల 10న తెలంగాణకు రానుంది. పార్లమెంటు ఎన్నికల్లో కొన్ని రాష్ట్రాల్లో ఆశించిన స్థాయిలో ఫలితాలు రాబట్టలేకపోవడంపై కాంగ్రెస్‌ పార్టీ అధిష్ఠానం అసంతృప్తితో ఉంది. ఈ నేపథ్యంలో పూర్తిస్థాయిలో ఫలితాలు ఎందుకు రాలేవన్న కారణాలను తెలుసుకునేందుకు కాంగ్రెస్‌.. తెలంగాణ సహా మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, దిల్లీ, ఉత్తరాఖండ్, హిమాచల్‌ప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలకు కమిటీలు వేసింది. తెలంగాణకు పి.జె.కురియన్‌ నేతృత్వంలో రకిబుల్‌ హుస్సేన్, పర్గత్‌సింగ్‌లతో కూడిన కమిటీని నియమించింది. తొలిసారి 10న రాష్ట్రానికి వస్తున్న ఈ కమిటీ రెండు, మూడు రోజులపాటు పలు నియోజకవర్గాల్లో పర్యటిస్తుంది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ 9 ఎంపీ సీట్లను కచ్చితంగా గెలుచుకుంటుందని, మరికొంత కష్టపడితే 12 నుంచి 14 స్థానాలను కైవసం చేసుకోవచ్చని మొదట్లో భావించింది. మహబూబ్‌నగర్, ఆదిలాబాద్, సికింద్రాబాద్‌ లోక్‌సభ స్థానాల్లో గెలుస్తామని ధీమాగా ఉన్నా... అక్కడే ఓటమి చెందడం పార్టీని అసంతృప్తికి లోనుచేసింది. కురియన్‌ కమిటీ సభ్యులు ఈ నియోజకవర్గాల్లో పర్యటించి ఆయా జిల్లాల్లోని కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు, డీసీసీ అధ్యక్షులు, నియోజకవర్గ ముఖ్యనేతలను కలిసి ఓటమికి కారణాలు, వారి అభిప్రాయాలు సేకరించనున్నట్లు తెలుస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని