మోదీ, అనురాగ్‌లపై చర్యలు తీసుకోండి

పార్లమెంటులో సత్య దూరమైన, కచ్చితంకాని, తప్పుదోవ పట్టించే ప్రకటనలు చేసిన ప్రధాని మోదీ, ఎంపీ అనురాగ్‌ ఠాకుర్‌లపై చర్యలు తీసుకోవాలని కోరుతూ స్పీకర్‌ ఓం బిర్లాకు కాంగ్రెస్‌ ఎంపీ మాణికం ఠాగూర్‌ లేఖ రాశారు.

Published : 05 Jul 2024 04:14 IST

పార్లమెంటులో అవాస్తవాలను చెప్పారు
స్పీకర్‌కు కాంగ్రెస్‌ లేఖ

దిల్లీ: పార్లమెంటులో సత్య దూరమైన, కచ్చితంకాని, తప్పుదోవ పట్టించే ప్రకటనలు చేసిన ప్రధాని మోదీ, ఎంపీ అనురాగ్‌ ఠాకుర్‌లపై చర్యలు తీసుకోవాలని కోరుతూ స్పీకర్‌ ఓం బిర్లాకు కాంగ్రెస్‌ ఎంపీ మాణికం ఠాగూర్‌ లేఖ రాశారు. 115 (1) కింద మోదీ, ఠాకుర్‌లపై ఆదేశాలిచ్చే అధికారాన్ని ఉపయోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. మంగళవారం ప్రధాని మోదీ లోక్‌సభలో మాట్లాడుతూ.. మహిళలకు నెలకు రూ.8,500 ఇస్తామని కాంగ్రెస్‌ తప్పుడు వాగ్దానం చేసిందని అన్నారని, విజయం సాధించి, అధికారంలోకి వచ్చిన తర్వాత ఇస్తామని చెప్పడం తప్పుడు వాగ్దానం ఎలా అవుతుందని మాణికం ప్రశ్నించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఒంటరిగా పోటీ చేసిన రాష్ట్రాల్లో 16చోట్ల ఓట్ల శాతం పడిపోయిందని మోదీ అన్నారని, అయితే హిమాచల్‌ ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ తదితర రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ ఓట్ల శాతం అనూహ్యంగా పెరిగిందని స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ హయాంలో ఆర్మీ జవాన్లకు బుల్లెట్‌ ప్రూఫ్‌ జాకెట్లను కేంద్రం సమకూర్చలేదని ప్రధాని అనడం ఏమాత్రం సరికాదని, అప్పట్లో బుల్లెట్‌ ప్రూఫ్‌ జాకెట్ల కొరత ఉన్న మాట వాస్తవమే అయినప్పటికీ, అసలు జాకెట్లే లేవని చెప్పడం సమంజసం కాదని పేర్కొన్నారు. సైన్యానికి ఫైటర్‌ జెట్‌లను అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇవ్వలేదని మోదీ చెప్పడంలో ఎలాంటి వాస్తవం లేదని, యూపీఏ అధికారంలో ఉన్నప్పుడు జాగ్వార్, మిగ్‌-29, ఎస్‌యూ-30, మిరాజ్‌-2000 లాంటి ఫైటర్‌ జెట్‌లతో న్యూక్లియర్‌ బాంబులు, అగ్ని, పృథ్వీ, అకాశ్, నాగ్, త్రిశూల్‌ ఆ తర్వాత బ్రహ్మోస్‌ లాంటి అద్భుత క్షిపణులు అందుబాటులో ఉన్నాయని స్పష్టం చేశారు. భాజపా అధికారంలోకి వచ్చిన తర్వాత దారిద్య్రరేఖకు దిగువన ఉన్న 25 కోట్ల మందిని అభివృద్ధి పథంవైపు నడిపించామన్న అనురాగ్‌ వ్యాఖ్యల్లోనూ నిజం లేదని స్పష్టం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని