సంక్షిప్త వార్తలు

కాంగ్రెస్‌ ప్రభుత్వం హామీలు అమలు చేయకుండా కమిషన్లు వేస్తూ కాలయాపన చేస్తోందని భాజపా ఎంపీ రఘునందన్‌రావు ఆరోపించారు.

Published : 04 Jul 2024 03:55 IST

హామీలు అమలు చేయకుండా కాంగ్రెస్‌ కాలయాపన
భాజపా ఎంపీ రఘునందన్‌రావు

ఈనాడు, హైదరాబాద్‌: కాంగ్రెస్‌ ప్రభుత్వం హామీలు అమలు చేయకుండా కమిషన్లు వేస్తూ కాలయాపన చేస్తోందని భాజపా ఎంపీ రఘునందన్‌రావు ఆరోపించారు. బుధవారం భాజపా రాష్ట్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ పార్టీకి మ్యానిఫెస్టోపైనే గౌరవం లేదన్నారు. అధికారంలోకి వచ్చి ఏడు నెలలు కావస్తున్నా రుణమాఫీ అమలు చేయలేదని విమర్శించారు. వరంగల్‌ రైతు డిక్లరేషన్‌ అమలు కాలేదని, వరి ధాన్యానికి రూ.2683 మద్దతు ధర ఇవ్వలేదన్నారు. రాష్ట్రంలో రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు.


జీవో 81లో మార్పులెందుకు చేయలేదు?
ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్‌

హైదరాబాద్, న్యూస్‌టుడే: అధికారంలో ఉన్నప్పుడు జీవో 81లో ఎందుకు మార్పులు చేయలేదని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్‌ భారాస నేత ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ను ప్రశ్నించారు. పీసీసీ ఎస్సీ సెల్‌ ఛైర్మన్‌ ప్రీతంతో కలిసి ఆయన బుధవారం గాంధీభవన్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘‘2018లో భారాస ప్రభుత్వం జీవో 81 ఇచ్చింది. ఈ జీవో నిబంధనలతో అభ్యర్థులకు నష్టం జరుగుతుందంటే అప్పుడే మార్పులు చేర్పులు చేసి నోటిఫికేషన్‌ ఇస్తే ఈ సమస్యే ఉండేది కాదు? అన్నీ తెలిసీ ఎందుకు మార్చలేదు? మీరు చెప్పినా కేసీఆర్‌ ప్రభుత్వం వినలేదా?’’ అని ప్రవీణ్‌కుమార్‌ను ఉద్దేశించి మాట్లాడారు. జీవోలు 46, 81లపై కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావుతో ప్రవీణ్‌కుమార్‌ కలిసి వస్తే తాను చర్చకు సిద్ధమని వెెంకట్‌ పేర్కొన్నారు. 


మతాల మధ్య చిచ్చుపెట్టడమే మోదీ మార్క్‌ పాలనా?
మధుయాస్కీగౌడ్‌ 

హైదరాబాద్, న్యూస్‌టుడే: మతం గురించి మాట్లాడుతూ.. మతాల మధ్య చిచ్చు పెట్టడమే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మార్క్‌ పాలనా అని పీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్, మాజీ ఎంపీ మధుయాస్కీగౌడ్‌ బుధవారం ఒక ప్రకటనలో ప్రశ్నించారు. ‘రైతు సమస్యలు, మహిళా రెజ్లర్లకు లైంగిక వేధింపులపై ప్రధాని మాట్లాడరు. మణిపుర్‌ అల్లర్లపై స్పందించరు. ఇప్పుడు నీట్, పేపర్‌ లీకేజీల గురించి ప్రస్తావించరు. దేశంలో పెరిగిపోతున్న నిరుద్యోగం గురించీ పట్టించుకోరు’ అని విమర్శించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని