వైకాపా నాయకులు కబళించిన ఆస్తుల్ని స్వాధీనం చేసుకోవాలి

గత ప్రభుత్వ హయాంలో వైకాపా నాయకులు, ఇతరులు అక్రమంగా సంపాదించిన ఆస్తుల్ని, కబళించిన భూముల్ని రెవెన్యూ రికవరీ చట్టం లేదా ఇతర చట్టాల్ని ప్రయోగించి స్వాధీనం చేసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబుకు మాజీ ఆర్థిక మంత్రి, తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు సూచించారు.

Published : 03 Jul 2024 04:51 IST

సీఎం చంద్రబాబుకు మాజీ మంత్రి యనమల లేఖ

ఈనాడు, అమరావతి: గత ప్రభుత్వ హయాంలో వైకాపా నాయకులు, ఇతరులు అక్రమంగా సంపాదించిన ఆస్తుల్ని, కబళించిన భూముల్ని రెవెన్యూ రికవరీ చట్టం లేదా ఇతర చట్టాల్ని ప్రయోగించి స్వాధీనం చేసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబుకు మాజీ ఆర్థిక మంత్రి, తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు సూచించారు. ఎఫ్‌ఆర్‌బీఎం వంటి చట్టాల్లో నిర్దేశించిన ఆర్థిక క్రమశిక్షణ మార్గదర్శకాలకు కట్టుబడుతూ ద్రవ్య, రెవెన్యూ లోటులు తగ్గించుకోవాలన్నారు. బిల్లుల చెల్లింపులన్నీ సీఎఫ్‌ఎంఎస్‌ ద్వారానే జరగాలని సూచించారు. రాష్ట్ర ఆర్థికాభివృద్ధి, సుస్థిరతకు చేపట్టాల్సిన చర్యలపై పలు సూచనలు, సలహాలతో ముఖ్యమంత్రికి మంగళవారం ఆయన లేఖ రాశారు. ‘‘వైకాపా ఐదేళ్ల పాలనలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తమైంది. ఆర్థిక అభివృద్ధి సింగిల్‌ డిజిట్‌కే పరిమితమైంది. ద్రవ్యలోటు, ఆదాయం క్షీణించడం, వృథా ఖర్చు, మూలధన వ్యయం క్షీణత వంటివి రాష్ట్ర అభివృద్ధిపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపాయి. ఆ దుర్లక్షణాల్ని తరిమికొట్టి రాష్ట్ర ఆర్థికాభివృద్ధిని కొత్త పుంతలు తొక్కించేందుకు మన ప్రభుత్వం చేస్తున్న కృషి ప్రశంసనీయం. ఆర్థిక మంత్రిగా పనిచేసిన అనుభవంతో... రాష్ట్ర, ప్రజల ఆదాయాన్ని గణనీయంగా పెంచేందుకు 15 అంశాల్ని మీ దృష్టికి తెస్తున్నాను. తెదేపా ఎన్నికల మ్యానిఫెస్టోతో ముడిపడిన ఈ అంశాల్ని సమర్థంగా అమలు చేస్తే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గణనీయంగా మెరుగుపడుతుంది’’ అని యనమల తెలిపారు. ‘‘కేంద్ర ప్రభుత్వం నుంచి పన్నుల్లో 41% లేదా 42% వాటా కోరాలి. గ్రాంట్‌-ఇన్‌-ఎయిడ్‌ రూపంలో కేంద్రాన్ని ఎక్కువ నిధులు కోరాలి. రాష్ట్రానికి ఇప్పటి వరకు కేంద్రం ఇచ్చిన రుణాల్ని మాఫీ చేయాల్సిందిగా అడగాలి. మూలధన వ్యయంలో లీకేజీలను అరికట్టాలి. పారిశ్రామిక వసతులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి’ అనే సూచనలు లేఖలో పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని