సంక్షిప్త వార్తలు (5)

పదేళ్లు అధికారంలో ఉండి జాబ్‌ క్యాలెండర్‌ ఎందుకివ్వలేదని భారాస నాయకులను కాంగ్రెస్‌ నేతలు ప్రశ్నించారు. నిరుద్యోగులు సమయం వృథా చేసుకోకుండా పోటీ పరీక్షలకు సన్నద్ధం కావాలని సూచించారు.

Updated : 03 Jul 2024 06:38 IST

పదేళ్లలో జాబ్‌ క్యాలెండర్‌ ఎందుకివ్వలేదు?: కాంగ్రెస్‌ 

హైదరాబాద్, న్యూస్‌టుడే: పదేళ్లు అధికారంలో ఉండి జాబ్‌ క్యాలెండర్‌ ఎందుకివ్వలేదని భారాస నాయకులను కాంగ్రెస్‌ నేతలు ప్రశ్నించారు. నిరుద్యోగులు సమయం వృథా చేసుకోకుండా పోటీ పరీక్షలకు సన్నద్ధం కావాలని సూచించారు. పీసీసీ అధికార ప్రతినిధులు భవానీరెడ్డి, లింగం, కేఎస్‌వీ చారి, చనగాని దయాకర్‌గౌడ్, తదితరులు మంగళవారం గాంధీభవన్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నిరుద్యోగులను రెచ్చగొట్టి వాళ్ల జీవితాలతో భారాస, భాజపాలు ఆడుకుంటున్నాయన్నారు. జాబ్‌ క్యాలెండర్‌తో నిరుద్యోగుల సమస్యల పరిష్కారం దిశగా ప్రభుత్వం ఆలోచన చేస్తోందని వారు తెలిపారు.


జీవన్‌రెడ్డితో కలిసి పనిచేస్తా.. ఎమ్మెల్యే సంజయ్‌ 

జగిత్యాల గ్రామీణం, న్యూస్‌టుడే: జగిత్యాల ప్రాంత అభివృద్ధి కోసమే అధికార పార్టీ కాంగ్రెస్‌లో చేరానని, సీనియర్‌ నేత ఎమ్మెల్సీ టి.జీవన్‌రెడ్డితో కలిసి పనిచేస్తానని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌కుమార్‌ స్పష్టం చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో జూన్‌ 23న భారాస నుంచి కాంగ్రెస్‌ పార్టీలో చేరిన ఆయన మంగళవారం జగిత్యాలలోని క్యాంపు కార్యాలయంలో కార్యకర్తలను కలిసి అనంతరం విలేకరులతో మాట్లాడారు. సీఎం రేవంత్‌రెడ్డి రైతు పక్షపాతి అని, వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చారని, ఆరు గ్యారంటీల్లో ఇప్పటికే కొన్ని అమలు చేస్తున్నారని పేర్కొన్నారు.


జాబ్‌ క్యాలెండర్‌ను వెంటనే విడుదల చేయాలి

మాజీ మంత్రి సత్యవతి రాథోడ్‌ డిమాండ్‌

ఈనాడు, హైదరాబాద్‌: నిరుద్యోగులకు ఇచ్చిన హామీమేరకు కాంగ్రెస్‌ ప్రభుత్వం వెంటనే జాబ్‌ క్యాలెండర్‌ను విడుదల చేయాలని భారాస సీనియర్‌ నేత, మాజీ మంత్రి సత్యవతి రాథోడ్‌ డిమాండ్‌ చేశారు. లేదంటే కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను, నాయకులను ప్రజలు గ్రామాల్లో తిరగనీయరని హెచ్చరించారు. తెలంగాణ భవన్‌లో మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ... ‘‘నిరుద్యోగుల తరఫున మోతీలాల్‌ దీక్ష చేపడితే నేను సంఘీభావం తెలిపాను. ఆయన పోరాటం యువతకు స్ఫూర్తి. కాంగ్రెస్‌ ప్రభుత్వ మోసాన్ని గ్రహించి మోతీలాల్‌ దీక్షకు దిగడాన్ని అభినందిస్తున్నా. ఇచ్చిన ప్రతి హామీని అమలు చేయకుంటే.. తిరుగుబాటుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వంపై ప్రజల్లో నమ్మకం పోతోంది’’ అన్నారు.


నేడు తెదేపా ముఖ్య నేతల సమావేశం

ఈనాడు, హైదరాబాద్‌: తెదేపా ముఖ్య నేతలు హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ భవన్‌లో బుధవారం సమావేశం కానున్నారు. తెదేపా అధినేత చంద్రబాబునాయుడు ఆంధ్రప్రదేశ్‌ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలిసారి వస్తున్న ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు చేయాల్సిన ఏర్పాట్లపై చర్చించనున్నారు.


ఏజెన్సీల్లో మొబైల్‌ వాహనాలతో రేషన్‌ పంపిణీ చేయాలి: సీపీఎం

ఈనాడు, అమరావతి: ఏజెన్సీ గ్రామాల్లో మొబైల్‌ వాహనాల ద్వారా రేషన్‌ సరఫరా కొనసాగించాలని కోరుతూ సీఎం చంద్రబాబుకు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు లేఖ రాశారు. ‘‘అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం జిల్లాల్లోని ఏజెన్సీ ప్రాంతాల్లో ఇప్పటి వరకు మొబైల్‌ వాహనాల ద్వారా రేషన్‌ బియ్యం పంపిణీ చేస్తున్నారు. ఇప్పుడు అలా చేయకపోతే లబ్ధిదారులు 10-15 కిలోమీటర్లు నడిచి బియ్యం తెచ్చుకోవాల్సిన దుస్థితి ఏర్పడుతుంది. దీనిపై ప్రభుత్వం పునఃసమీక్షించి యధావిధిగా మొబైల్‌ వాహనాల ద్వారా సరకుల సరఫరా చేయాలి’’ అని కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని