రుణమాఫీ పేరుతో రైతులను వంచించిన కేసీఆర్‌

రుణమాఫీ పేరుతో రైతులను వంచించిన చరిత్ర కేసీఆర్‌ ప్రభుత్వానిదని ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి శ్రీధర్‌బాబు ఆరోపించారు. 2018 ఎన్నికల సమయంలో భారాస మ్యానిఫెస్టోలో మాఫీ హామీ ఇచ్చి 2023 ఎన్నికల ముందుదాకా కేసీఆర్‌ మొద్దు నిద్ర పోయారని ఆయన మీడియాకు తెలిపారు.

Published : 03 Jul 2024 04:32 IST

ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి శ్రీధర్‌బాబు ఆరోపణ

ఈనాడు, హైదరాబాద్‌: రుణమాఫీ పేరుతో రైతులను వంచించిన చరిత్ర కేసీఆర్‌ ప్రభుత్వానిదని ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి శ్రీధర్‌బాబు ఆరోపించారు. 2018 ఎన్నికల సమయంలో భారాస మ్యానిఫెస్టోలో మాఫీ హామీ ఇచ్చి 2023 ఎన్నికల ముందుదాకా కేసీఆర్‌ మొద్దు నిద్ర పోయారని ఆయన మీడియాకు తెలిపారు. భారాస పాలనలో మాఫీ కోసం రైతులు నాలుగేళ్ల పాటు ఎదురు చూడాల్సి వచ్చిందని విమర్శించారు. ‘‘అప్పటికే వారు తీసుకున్న అప్పులు వడ్డీలతో కలిపి మూడు రెట్లు పెరిగాయి. మాఫీ పేరుతో ఎన్నికల ముందు విడుదల చేసిన నిధులు దేనికీ సరిపోక రైతులు నానా అవస్థలు పడ్డారు. రుణ మాఫీ ప్రయోజనమే లేకుండా పోయింది. గతంలోలాగా కాకుండా కాంగ్రెస్‌ ప్రభుత్వం నిజమైన రైతు పక్షపాతిగా నిల్చింది. ఆగస్టు 15 లోగా 47 లక్షల మంది రైతులకు రూ.31వేల కోట్ల రుణాల మాఫీకి ఆదేశాలు జారీ చేసి సీఎం రేవంత్‌రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. పార్లమెంటు ‘ఎన్నికల కోడ్‌’ లేక పోయి ఉంటే ఈ పాటికి రుణమాఫీ ప్రక్రియ పూర్తయ్యేది. అర్హులైన రైతులందరికీ రూ.2 లక్షల వరకు ఒకే దఫా మాఫీని వర్తింపచేస్తామని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేసిన తర్వాత కూడా భారాస నేతలు విమర్శలు చేస్తుండడం వారి అహంకారానికి నిదర్శనం. రుణమాఫీ ప్రక్రియ ప్రారంభంతో గ్రామాల్లో రైతులు సంబరాలు చేసుకుంటున్నారు. గత ప్రభుత్వం రూ.7 లక్షల కోట్ల అప్పుల భారాన్ని మిగిల్చినా ముఖ్యమంత్రి ధైర్యంతో మాఫీకి ముందడుగు వేయడంపై అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రుణమాఫీ జరిగితే గ్రామీణ ప్రాంతాల్లో భారాస  అదృశ్యమవుతుందనే భయంతో ఆ పార్టీ నేతలు అర్థం లేని విమర్శలు చేస్తున్నారు. ప్రజలకు మంచి జరిగే ప్రతి కార్యక్రమాన్ని అన్ని పార్టీలు అభినందించాలి. హామీ నెరవేర్చాలని అడగడంలో తప్పులేదు కానీ నిందలు వేస్తే ప్రజాగ్రహానికి గురవుతారు’ అని మంత్రి తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని