పల్లెల్లో పడకేసిన పారిశుద్ధ్యం

కాంగ్రెస్‌ ప్రభుత్వ ఏడు నెలల పాలనలో పల్లెల్లో పారిశుద్ధ్యం పడకేసిందని, వేతనాలు లేక పారిశుద్ధ్య కార్మికులు అల్లాడుతున్నారని భారాస సీనియర్‌ నేత, మాజీ మంత్రి టి.హరీశ్‌రావు ధ్వజమెత్తారు.

Published : 03 Jul 2024 04:30 IST

వేతనాల్లేక అల్లాడుతున్న కార్మికులు
మాజీ మంత్రి టి.హరీశ్‌రావు ధ్వజం

తెలంగాణ భవన్‌లో మాట్లాడుతున్న హరీశ్‌రావు. చిత్రంలో మధుసూదనాచారి, దేవీప్రసాద్, పెద్ది సుదర్శన్‌రెడ్డి

ఈనాడు, హైదరాబాద్‌: కాంగ్రెస్‌ ప్రభుత్వ ఏడు నెలల పాలనలో పల్లెల్లో పారిశుద్ధ్యం పడకేసిందని, వేతనాలు లేక పారిశుద్ధ్య కార్మికులు అల్లాడుతున్నారని భారాస సీనియర్‌ నేత, మాజీ మంత్రి టి.హరీశ్‌రావు ధ్వజమెత్తారు. ఇందిరమ్మ రాజ్యం, ప్రజా పాలన అంటే ఇదేనా? అని నిలదీశారు. మంగళవారం తెలంగాణ భవన్‌లో ఎమ్మెల్సీ మధుసూదనాచారితో కలిసి హరీశ్‌రావు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘గ్రామాలు, పట్టణాల అభివృద్ధి కోసం నాటి కేసీఆర్‌ ప్రభుత్వం పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలు చేపట్టింది. ప్రతి నెలా రూ.275 కోట్ల చొప్పున ఏటా రూ.3,330 కోట్లు పల్లెల అభివృద్ధి కోసం ఇచ్చింది. పట్టణాలకు ఏటా రూ.1700 కోట్లు విడుదల చేసింది. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇప్పటి వరకు కనీసం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. కనీసం దోమల నిర్మూలన మందు పిచికారీ చేయించడానికి కూడా డబ్బుల్లేని దుస్థితి నెలకొంది. రాష్ట్ర ఏర్పాటుకు ముందు మొత్తం 87 పంచాయతీల్లో మాత్రమే ట్రాక్టర్లు ఉంటే, మా హయాంలో 12,769 పంచాయతీల్లో అందుబాటులోకి తెచ్చాం. ప్రస్తుతం డీజిల్‌ పోయించక ట్రాక్టర్లు మూలనపడ్డాయి. గ్రామాల్లో ఇప్పటికే జ్వరాలు విజృంభిస్తున్నాయి. పారిశుద్ధ్య సమస్య పెరిగితే డెంగీ, మలేరియా, వైరల్‌ జ్వరాలు మరింతగా ప్రబలే ప్రమాదముంది. వెంటనే స్పెషల్‌ డ్రైవ్‌లు నిర్వహించి పారిశుద్ధ్యం పెంపొందించాలి. సర్పంచులు, జిల్లా పరిషత్‌ల పదవీ కాలం ముగిసినా ఎందుకు ఎన్నికలు నిర్వహించడం లేదు? తక్షణమే పారిశుద్ధ్య కార్మికులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలకు వేతనాలు చెల్లించాలి. పింఛన్ల 2 నెలల బకాయిలు విడుదల చేయాలి.

చంద్రబాబుతో ఏడు మండలాలపై చర్చించాలి

రాష్ట్ర విభజన అంశాలపై ఏపీ, తెలంగాణ సీఎంలు భేటీ కానుండడం సంతోషం. రాష్ట్రం ఏర్పడ్డ తొలినాళ్లలో తెలంగాణలోని 7 మండలాలు, లోయర్‌ సీలేరు ఏపీలో కలిపారు. ఆ బిల్లు పెట్టింది భాజపా, మద్దతు ఇచ్చింది కాంగ్రెస్‌. రేవంత్‌ ఈ విషయంపై ఒత్తిడి తీసుకొచ్చి తిరిగి 7 మండలాలను, లోయర్‌ సీలేరును తెలంగాణకు వచ్చేలా చేయాలి. ఆ తర్వాతే విభజన హామీల గురించి మాట్లాడాలి’’ అని హరీశ్‌రావు డిమాండ్‌ చేశారు. సమావేశంలో భారాస నేతలు పెద్ది సుదర్శన్‌రెడ్డి, అల్లిపురం వెంకటేశ్వరరెడ్డి, ఎర్రోళ్ల శ్రీనివాస్, దేవీప్రసాద్‌ ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని