హనుమకొండ భారాస కార్యాలయానికి నోటీసులు

హనుమకొండ బాలసముద్రంలో ఉన్న భారాస కార్యాలయానికి వరంగల్‌ మహానగర పాలక సంస్థ నోటీసులు జారీచేసింది. పార్టీ కార్యాలయానికి నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ స్థలాన్ని కేటాయించారని...

Published : 03 Jul 2024 04:28 IST

ఈనాడు, వరంగల్‌: హనుమకొండ బాలసముద్రంలో ఉన్న భారాస కార్యాలయానికి వరంగల్‌ మహానగర పాలక సంస్థ నోటీసులు జారీచేసింది. పార్టీ కార్యాలయానికి నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ స్థలాన్ని కేటాయించారని... వెంటనే దీన్ని రద్దు చేసేలా చర్యలు తీసుకోవాలని ఇటీవల వరంగల్‌ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి హనుమకొండ కలెక్టర్‌కు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మంగళవారం అధికారులు హనుమకొండ భారాస జిల్లా అధ్యక్షుడికి నోటీసులు జారీ చేశారు. సర్వే నెంబర్‌ 1066లో కేటాయించిన ఎకరం భూమి ప్రభుత్వ స్థలమని, ఇందులో నిర్మించిన భవనం, భూ కేటాయింపు పత్రాలు మూడు రోజుల్లో తమకు అందజేయాలని అందులో పేర్కొన్నారు. దీనిపై భారాస జిల్లా అధ్యక్షుడు, మాజీ చీఫ్‌విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్‌ను వివరణ కోరగా నోటీసులు అందుకున్నామని, మూడు రోజుల్లో సమాధానం ఇస్తామని పేర్కొన్నారు. భారాస కార్యాలయానికి కేటాయించిన భూమిని రద్దు చేయాలని ఇప్పటికే ఆర్డీవోకు హనుమకొండ కలెక్టర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. భారాస కార్యాలయానికి అప్పటి ప్రభుత్వం గజం రూ.100 ధరకు భూమిని కేటాయించిందని పశ్చిమ ఎమ్మెల్యే తమకు వినతిపత్రంలో తెలిపారని అందులో పేర్కొన్నారు. దీనిపై ఆర్డీవో విచారణ చేపట్టి నివేదిక సమర్పించాలని కలెక్టర్‌ ఆ ఉత్తర్వుల్లో ఆదేశించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని