తెలంగాణ చరిత్రను భవిష్యత్‌ తరాలకు అందించాలి

తెలంగాణ చరిత్ర, ప్రాముఖ్యతను భవిష్యత్‌ తరాలకు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, అందుకే సమగ్ర సమాచారాన్ని గత ప్రభుత్వం రూపొందించిందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ తెలిపారు.

Published : 03 Jul 2024 04:27 IST

సీఎస్‌కు కేటీఆర్‌ లేఖ

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ చరిత్ర, ప్రాముఖ్యతను భవిష్యత్‌ తరాలకు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, అందుకే సమగ్ర సమాచారాన్ని గత ప్రభుత్వం రూపొందించిందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ తెలిపారు. ఇది ఏ ఒక్క వ్యక్తికో, రాజకీయ పార్టీకో సంబంధించిన సమాచారం కానే కాదని, ఇది ప్రజల ఆస్తి అని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర ఆవిర్భావానికి ముందు, తర్వాత సంఘటనలకు సంబంధించి ఈ విలువైన సమాచారం శతాబ్దాలపాటు ఉండాల్సిన అవసరముందన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. ప్రభుత్వ వెబ్‌సైట్లు, సోషల్‌ మీడియా హ్యాండిల్స్‌లో గత సర్కారుకు సంబంధించిన డిజిటల్‌ కంటెంట్‌ను ఉద్దేశపూర్వకంగా తొలగిస్తున్నారని కేటీఆర్‌ మండిపడ్డారు. ఈ విషయంలో వెంటనే జోక్యం చేసుకోవాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎ.శాంతికుమారికి మంగళవారం ఆయన లేఖ రాశారు. ‘‘కేసీఆర్‌ సీఎంగా ఉన్న(జూన్‌ 2014- డిసెంబరు 2023) నాటి సమయంలోని వేలాది ఫొటోలు, వీడియోలతోపాటు ఎంతో సమాచారాన్ని తొలగించారు. దీని వెనక రాష్ట్ర ప్రభుత్వంలోని ఉన్నతాధికారులే ఉన్నారనే సందేహం కూడా ఉంది. ఈ హేయమైన చర్యను ఆపి.. సమాచారాన్ని కాపాడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా మీపై ఉంది. తొలగించిన కంటెంట్‌ను వెంటనే పునరుద్ధరించేలా సంబంధిత అధికారులను మీరు ఆదేశించాలి. కొందరి ఇష్టాయిష్టాల కోసం ప్రజా ఆస్తులను ధ్వంసం చేస్తే తెలంగాణ భవిష్యత్‌ తరాలు క్షమించవు’’ అని కేటీఆర్‌ తన లేఖలో పేర్కొన్నారు. 2024 జనవరి తర్వాత సమాచారం తొలగించిన వెబ్‌సైట్లు, పోర్టల్స్‌ వివరాలను ఆయన జతపర్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని