రాహుల్‌లా ప్రవర్తించకండి

లోక్‌సభలో స్పీకర్‌ స్థానాన్ని అవమానించేలా ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ మాట్లాడి అమర్యాదకరంగా ప్రవర్తించారని, ఎన్డీయే సభ్యులెవరూ అలా చేయవద్దని ప్రధానమంత్రి నరేంద్రమోదీ సూచించారు.

Published : 03 Jul 2024 04:25 IST

ఎన్డీయే ఎంపీల సమావేశంలో మోదీ 

దిల్లీ: లోక్‌సభలో స్పీకర్‌ స్థానాన్ని అవమానించేలా ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ మాట్లాడి అమర్యాదకరంగా ప్రవర్తించారని, ఎన్డీయే సభ్యులెవరూ అలా చేయవద్దని ప్రధానమంత్రి నరేంద్రమోదీ సూచించారు. కాంగ్రెసేతర నేత, ఓ చాయ్‌వాలా తనయుడు మూడోసారి కూడా ప్రధాని కావడాన్ని విపక్షం జీర్ణించుకోలేక నైరాశ్యంలో మునిగిపోయిందని చెప్పారు. ఎన్డీయే ఎంపీలంతా పార్లమెంటరీ విధి విధానాలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. మోదీ నేతృత్వంలో మూడోసారి కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారి ఎన్డీయే పార్లమెంటరీ పార్టీ సమావేశం మంగళవారం జరిగింది. ఈ సందర్భంగా అధికార పక్ష ఎంపీలకు ప్రధాని దిశానిర్దేశం చేశారు. కొత్తగా ఎన్నికైన సభ్యులు ఆయా నిబంధనల గురించి సీనియర్లను అడిగి తెలుసుకోవాలని సూచించారు. ‘‘కొన్ని దశాబ్దాలపాటు ప్రధాని కుర్చీని ఓ కుటుంబం తన గుప్పిట్లో ఉంచుకుంది. ఆ కుటుంబానికి చెందనివారు ప్రధానులైతే వారికి నామమాత్ర గుర్తింపు ఇచ్చింది. కానీ మా ప్రభుత్వం దేశ నేతలందరికీ సమాన గౌరవం ఇస్తుంది. పార్టీలకు అతీతంగా దేశంలోని ప్రతీ ఎంపీ తమ కుటుంబ సభ్యులతో కలిసి ‘ప్రధానమంత్రి సంగ్రహాలయ్‌’ను సందర్శించాలి. అందులో తొలి ప్రధాని నెహ్రూ నుంచి నా వరకు ప్రధానులందరి ప్రస్థానాన్ని అందంగా ప్రదర్శించారు. ఆయా నేతల జీవిత విశేషాలను మనమంతా తెలుసుకోవాలి. ఇందులో రాజకీయ ఎజెండా ఏమీలేదు. ప్రధానులు చేసిన కృషిని తెలుసుకుని, అభినందించడాన్ని యావద్దేశం ఒక విధిలా భావించాలి’’ అని ప్రధాని సూచించారు.

అధ్యయనం చేయండి.. అనవసర వ్యాఖ్యలు చేయకండి

ఎంపీలు తాము మాట్లాడాలనుకున్న అంశంపై ముందుగానే అధ్యయనం చేయాలని మోదీ సూచించారు. మీడియా ముందు అనవసర వ్యాఖ్యలు చేయొద్దని హితవుపలికారు. సొంత నియోజకవర్గ ప్రజలకు ఎల్లప్పుడూ చేరువగా ఉండాలని, పార్టీలతో సంబంధం లేకుండా దేశానికి సేవ చేయడం ప్రథమ కర్తవ్యమని చెప్పారు. నియోజకవర్గ అంశాలపై వారంతా అవగాహన పెంచుకోవాలన్నారు. మోదీ ప్రసంగ వివరాలను పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్‌ రిజిజు మీడియాకు వెల్లడించారు. ప్రధాని మార్గ నిర్దేశనం ఎంపీలందరికీ, ప్రత్యేకించి తొలిసారి సభకు వచ్చిన సభ్యులకు ఒక మంచి మంత్రంగా భావిస్తున్నామని చెప్పారు. ఎన్నికల్లో విజయంపై మోదీని ఎన్‌డీయే నేతలు సన్మానించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని