యూపీలో మాకు 80 సీట్లు వచ్చినా.. ఈవీఎంలను విశ్వసించం

పార్లమెంటు సమావేశాల్లో భాగంగా రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై జరుగుతున్న చర్చలో విపక్ష నేతలు మోదీ సర్కారుపై విరుచుకుపడ్డారు.

Updated : 03 Jul 2024 04:41 IST

లోక్‌సభలో అఖిలేశ్‌ ప్రసంగం

దిల్లీ: పార్లమెంటు సమావేశాల్లో భాగంగా రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై జరుగుతున్న చర్చలో విపక్ష నేతలు మోదీ సర్కారుపై విరుచుకుపడ్డారు. ఎస్పీ అధినేత, ఎంపీ అఖిలేశ్‌ యాదవ్‌ పేపర్ల లీకేజీ, ఈవీఎంలు, అయోధ్య ఎన్నికల ఫలితాలు, ఉత్తర్‌ప్రదేశ్‌లో అవినీతిపై మాట్లాడారు. సార్వత్రిక ఎన్నికల్లో మతతత్వ రాజకీయాలకు దేశ ప్రజలు ముగింపు పలికారని స్పష్టం చేశారు. ‘ఎన్నికల సమయంలో 400 సీట్లు అంటూ వారు ప్రచారం చేశారు. కానీ ప్రజలు మాకు నైతిక విజయం కట్టబెట్టారు. ప్రస్తుత ప్రభుత్వం ఎక్కువ కాలం ఉండదని అంతా చెబుతున్నారు. వ్యక్తిగత లక్ష్యాల ఆధారంగా దేశాన్ని నడిపించలేరు’ అని అఖిలేశ్‌ దుయ్యబట్టారు. ‘అసలు పేపర్‌ లీక్‌లు ఎందుకు జరుగుతున్నాయి.. యువతకు ఉద్యోగాలు ఇవ్వొద్దనే ఉద్దేశంతో ప్రభుత్వమే ఇలాంటి చర్యలకు ఒడిగడుతోంది’ అని మండిపడ్డారు. ‘ఈవీఎంలపై నాకు ఎప్పుడూ నమ్మకం లేదు. మాకు 80కి 80 సీట్లు వచ్చినా ఆ నమ్మకం కుదరదు. ఈవీఎంల సమస్య ఇంకా అలాగే ఉంది’ అని ఆందోళన వ్యక్తం చేశారు. ‘కుల గణనకు మేం అనుకూలం. అలాగే అగ్నివీర్‌ పథకాన్ని మేం ఎప్పటికీ అంగీకరించం. ఇండియా కూటమి అధికారంలోకి వస్తే.. దానిని రద్దు చేస్తాం’ అని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని