నా వ్యాఖ్యల తొలగింపు అప్రజాస్వామికం

రాష్ట్రపతికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై సోమవారం లోక్‌సభలో తాను చేసిన ప్రసంగంలోని కొన్ని వ్యాఖ్యలను తొలగించడాన్ని నిరసిస్తూ స్పీకర్‌ ఓం బిర్లాకు ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ మంగళవారం లేఖ రాశారు.

Published : 03 Jul 2024 04:14 IST

స్పీకర్‌కు రాహుల్‌ గాంధీ లేఖ

దిల్లీ: రాష్ట్రపతికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై సోమవారం లోక్‌సభలో తాను చేసిన ప్రసంగంలోని కొన్ని వ్యాఖ్యలను తొలగించడాన్ని నిరసిస్తూ స్పీకర్‌ ఓం బిర్లాకు ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ మంగళవారం లేఖ రాశారు. రికార్డుల నుంచి తన వ్యాఖ్యల తొలగింపు పార్లమెంటరీ ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని స్పష్టం చేశారు. వాటిని వెంటనే రికార్డుల్లో నమోదు చేయాలని కోరారు. ‘భాజపా ఎంపీ అనురాగ్‌ ఠాకుర్‌ ఎన్నో ఆరోపణలు చేశారు. అయితే వాటిలో ఒక్క పదాన్నే తొలగించారు. ఇందులో హేతుబద్ధత లేదు. సభాధ్యక్ష స్థానానికి ప్రసంగంలోని వ్యాఖ్యలను తొలగించే సంపూర్ణ అధికారం ఉంది. అయితే ఎటువంటి పదాలను తొలగించాలనే నిబంధన నిబంధన-380లో ఉంది. అందుకు భిన్నంగా నా ప్రసంగంలోని వ్యాఖ్యలను తొలగించడంతో నేను దిగ్భ్రాంతికి గురయ్యాను. తొలగించిన నా వ్యాఖ్యలు నిబంధన-380 కిందకు రావు. క్షేత్ర స్థాయిలో వాస్తవ పరిస్థితులనే నేను సభ దృష్టికి తెచ్చాను. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 105 (1) ప్రకారం తాము ప్రాతినిధ్యం వహించే ప్రాంతాల ప్రజల గళాన్ని సభలో వినిపించే స్వేచ్ఛ ప్రతి సభ్యుడికీ ఉంది. సభ్యుడిగా నా హక్కును సోమవారం వినియోగించుకున్నాను. అందువల్ల తొలగించిన నా వ్యాఖ్యలను మళ్లీ రికార్డుల్లో పొందుపరచాలని కోరుకుంటున్నా’ అని రాహుల్‌ గాంధీ లేఖలో పేర్కొన్నారు. నిజాల్ని మోదీ ప్రపంచం నుంచి తొలగించగలరేమోగానీ, వాస్తవ ప్రపంచం నుంచి కాదని రాహుల్‌ గాంధీ వ్యాఖ్యానించారు.

వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించిన స్పీకర్‌

రాహుల్‌ గాంధీ సోమవారం లోక్‌సభలో చేసిన ప్రసంగంలోని కొన్ని వ్యాఖ్యలను స్పీకర్‌ ఓం బిర్లా రికార్డులను నుంచి తొలగించారు. అధికార పక్షం అభ్యంతరాలతో హిందూ మతాన్ని ఉద్దేశించి రాహుల్‌ చేసిన వ్యాఖ్యలతోపాటు భాజపా, ఆర్‌ఎస్‌ఎస్, అగ్నివీర్, మోదీ, నీట్‌ పరీక్షల్లో అక్రమాలపై ప్రతిపక్ష నేత అన్న మాటలను తొలగిస్తున్నట్లు లోక్‌సభ సచివాలయం మంగళవారం ప్రకటించింది.

ప్రతిపక్ష నేతపై నోటీసు

మరోవైపు రాహుల్‌ వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తంచేస్తూ స్పీకర్‌కు భాజపా ఎంపీ బాంసురీ స్వరాజ్‌ నోటీసు ఇచ్చారు. ఆయన వ్యాఖ్యలు ప్రజలను తప్పుదారి పట్టించేలా ఉన్నాయని పేర్కొన్నారు. నిబంధన 115 ప్రకారం రాహుల్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని