హైకోర్టు తీర్పు కేసీఆర్‌కు చెంపపెట్టులాంటిది

జస్టిస్‌ నరసింహారెడ్డి కమిషన్‌ను రద్దు చేయాలంటూ వేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టేయడం మాజీ సీఎం కేసీఆర్‌కు చెంపపెట్టు లాంటిదని ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ ధ్వజమెత్తారు.

Published : 02 Jul 2024 06:04 IST

ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ ధ్వజం
భారాస రద్దు కోసం ఈసీని కలుస్తాం: ఎమ్మెల్యే యెన్నం

హైదరాబాద్, న్యూస్‌టుడే: జస్టిస్‌ నరసింహారెడ్డి కమిషన్‌ను రద్దు చేయాలంటూ వేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టేయడం మాజీ సీఎం కేసీఆర్‌కు చెంపపెట్టు లాంటిదని ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ ధ్వజమెత్తారు. మహబూబ్‌నగర్‌ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డితో కలిసి ఆయన సోమవారం అసెంబ్లీలోని సీఎల్పీ మీడియా హాల్‌లో మాట్లాడారు. ‘‘చట్టం ముందు అందరూ సమానమే అన్న విషయాన్ని కేసీఆర్‌ మరచిపోయారు. విచారణకు సిద్ధమని సవాల్‌ విసిరి పారిపోవాలని చూస్తే కుదరదు.. కమిషన్‌ ముందు కేసీఆర్‌ హాజరై వాస్తవాలు వెల్లడించాల్సిందే. తప్పు జరిగిందని తేలితే శిక్ష అనుభవించాల్సిందే’’ అని ఆది శ్రీనివాస్‌ పేర్కొన్నారు. యెన్నం శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘‘తప్పు చేయనప్పుడు కమిషన్‌ ముందు హాజరుకావడానికి కేసీఆర్‌ ఎందుకు భయపడుతున్నారు? తక్కువ ధరకు విద్యుత్‌ కొనుగోలు చేసే అవకాశమున్నా.. ఎక్కువ ధరకు కొన్నారు. విద్యుత్‌ ఒప్పందాలలో తీసుకున్న కమీషన్‌ల విషయం బయటకు వస్తుందని కేసీఆర్‌కు భయం. ఆయన నిర్ణయాలతో రాష్ట్రం రూ.వేల కోట్లు నష్టపోయింది. చట్టబద్ధ కమిషన్‌ ముందుకు రాను అని కేసీఆర్‌ అంటున్నారంటే.. రాజకీయ పార్టీగా ఉండే అర్హత భారాసకు లేనట్లే. రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్న ఆ పార్టీని రద్దు చేయాలని ఎన్నికల సంఘం ముందుకు వెళ్తాం’’ అని శ్రీనివాస్‌రెడ్డి వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని