ఎంపీలను సస్పెండ్‌ చేసి తీసుకొచ్చారు: ఖర్గే

పార్లమెంటులో ఎంపీలను సస్పెండ్‌ చేయటం ద్వారా కొత్త నేర న్యాయ చట్టాలను కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిందని కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విమర్శించారు.

Published : 02 Jul 2024 06:04 IST

దిల్లీ: పార్లమెంటులో ఎంపీలను సస్పెండ్‌ చేయటం ద్వారా కొత్త నేర న్యాయ చట్టాలను కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిందని కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విమర్శించారు. ‘‘ఎన్నికల్లో రాజకీయంగా, నైతికంగా దెబ్బతిన్న ప్రధాని మోదీ, భాజపా నేతలు రాజ్యాంగాన్ని గౌరవిస్తున్నట్లు నటిస్తున్నారు. సోమవారం నుంచి అమలులోకి వచ్చిన మూడు నేర న్యాయ చట్టాలను 146 మంది విపక్ష ఎంపీలను బలవంతంగా సస్పెండ్‌ చేసి ఆమోదించారనేది అసలు వాస్తవం. భారత పార్లమెంటరీ వ్యవస్థపై ఈ ‘బుల్డోజర్‌ న్యాయం’ ఆధిపత్యాన్ని విపక్ష ఇండియా కూటమి ఆమోదించబోదు’’ అని ఆయన అన్నారు. గత శీతాకాల పార్లమెంటు సమావేశాలను ఉద్దేశించి ఖర్గే ఈ వ్యాఖ్యలు చేస్తూ సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’లో పోస్ట్‌ చేశారు.

సవరణలు చేస్తే సరిపోయేది: చిదంబరం

కొత్త న్యాయ చట్టాల్లో 90-99 శాతం పాత వాటి నుంచి కాపీ కొట్టారని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత పి.చిదంబరం తెలిపారు. ఇప్పటివరకు అమల్లో ఉన్న చట్టాల్లో కొన్ని సవరణలు చేస్తే సరిపోయేదని వ్యాఖ్యానించారు. కొన్ని అంశాల్లో మెరుగులు దిద్దినప్పటికీ వాటిని సవరణల రూపంలో తీసుకురావాల్సిందన్నారు. కొన్ని మార్పులు మాత్రం రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నాయని ఆక్షేపించారు. కొత్త చట్టాలను తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ డెరెక్‌ ఓబ్రియెన్‌ రాజ్యాంగ విరుద్ధమైనవి, క్రూరమైనవిగా అభివర్ణించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని