కోట్ల మంది హిందువులను అవమానించారు

లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ చేసిన ప్రసంగంపై ఇంటా బయటా భాజపా ధ్వజమెత్తింది. హిందువులంతా హింసాత్మక వాదులంటూ ఆయన కోట్ల మందిని అవమానపరిచారని విమర్శించింది.

Published : 02 Jul 2024 06:04 IST

రాహుల్‌పై భాజపా ధ్వజం 
అలా అనలేదన్న ప్రియాంక

దిల్లీ: లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ చేసిన ప్రసంగంపై ఇంటా బయటా భాజపా ధ్వజమెత్తింది. హిందువులంతా హింసాత్మక వాదులంటూ ఆయన కోట్ల మందిని అవమానపరిచారని విమర్శించింది. అయితే హిందువులందరినీ రాహుల్‌ అనలేదని, భాజపా వారిని ఉద్దేశించే ఈ వ్యాఖ్యలు చేశారని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ స్పష్టం చేశారు. రాహుల్‌ గాంధీ వ్యాఖ్యలను హిందూ సాధువులు పలువురు ఖండించారు. వారిలో స్వామి అవధేశానంద గిరి, స్వామి బాలయోగి అరుణ్‌ పురీ ఉన్నారు. రాహుల్‌ గాంధీ క్షమాపణ చెప్పాలని డిమాండు చేశారు.


  •  కోట్ల మంది హిందువులను రాహుల్‌ గాంధీ అవమానించారు. వారంతా హింసకు పాల్పడతారని, విద్వేషాన్ని వ్యాప్తి చేస్తారని, అబద్ధాలు చెబుతారని వ్యాఖ్యానించడంద్వారా మనోభావాలను దెబ్బతీశారు. ఆయన క్షమాపణ చెప్పాలి.       

 అమిత్‌ షా, కేంద్ర హోం మంత్రి


  •  మొదటి రోజు రాహుల్‌ది చెత్త ప్రదర్శన. అబద్ధాలను, హిందుత్వ వ్యతిరేకతను ఆయన ప్రదర్శించారు. దీనిద్వారా 2024 తీర్పును ఆయన సరిగా అర్థం చేసుకోలేదనిపిస్తోంది. 5సార్లు ఎంపీగా గెలిచిన రాహుల్‌ పార్లమెంటరీ సంప్రదాయాలను సరిగా నేర్చుకోలేదు. 

 జేపీ నడ్డా, కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి


  •  హిందువులు మెజారిటీగా ఉన్నంత కాలం ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుంది. దేశంలో ప్రజలు శాంతియుతంగా జీవిస్తారు. ప్రపంచాన్ని చూడండి.. ఎక్కడా ప్రశాంతత లేదు. పాకిస్థాన్‌లోనూ అదే పరిస్థితి. మన దేశంలో శాంతియుతంగా ఉన్నాం.          

 జి.కిషన్‌రెడ్డి, కేంద్ర బొగ్గు, గనులశాఖ మంత్రి 


  •  రాహుల్‌ గాంధీ హిందువులను అవమానించలేదు. భాజపా నేతలను ఉద్దేశించే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

 ప్రియాంకా గాంధీ, కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి


రాహుల్‌ వర్సెస్‌ రాజ్‌నాథ్‌

 అగ్నిపథ్‌పై మాటల తూటాలు

దిల్లీ: లోక్‌సభలో సోమవారం ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ, రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ల మధ్య మాటల తూటాలు పేలాయి. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన అగ్నిపథ్‌ను ‘యూజ్‌ అండ్‌ త్రో లేబర్‌’ పథకంగా రాహుల్‌ అభివర్ణించారు. దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన రాజ్‌నాథ్‌ సింగ్‌.. ప్రతిపక్ష నేత ప్రజల్లో లేనిపోని అపోహలను సృష్టిస్తున్నారని మండిపడ్డారు. ‘మందుపాతర పేలి ఒక అగ్నివీర్‌ ప్రాణాలు కోల్పోతే అతడిని అమర వీరుడిగా పరిగణించరు. నేను అమరుడన్నా.. కేంద్ర ప్రభుత్వంగానీ, ప్రధాని మోదీగానీ ఆ పేరుతో పిలవరు. కేవలం అగ్నివీర్‌గానే గుర్తిస్తారు. అతడి కుటుంబానికి పెన్షన్‌ రాదు. ఎలాంటి నష్ట పరిహారం ఇవ్వరు. కేంద్రం దృష్టిలో అగ్ని వీరులంతా ఉపయోగించుకుని వదిలేసే ఓ లేబర్‌ లాంటివారు’ అంటూ రాహుల్‌ ఘాటుగా విమర్శించారు. ఈ పథకాన్ని తీసుకొస్తున్నప్పుడే దేశంలోని పలు ప్రాంతాల్లో హింసాత్మక నిరసనలు జరిగినట్లు సభకు వివరించారు. ‘మీరు సైనికులను విభజిస్తున్నారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోతే ఒకరిని అమరుడు అంటున్నారు. మరొకరిని అగ్నివీరుడు అంటున్నారు. ఒకరికి పెన్షన్‌ వస్తుంది. మరొకరికి రాదు. అగ్ని వీరుడు జవాన్‌గా పిలిపించుకోలేడు. మీరన్నట్లుగా దేశభక్తుడిగానే మిగిలిపోతాడు’ అంటూ అగ్నివీర్, జవాన్‌కు మధ్య తేడాలను వివరిస్తూ అధికార పక్షంపై మండిపడ్డారు.

158 సంస్థల అభిప్రాయాలు తీసుకున్నాం: రాజ్‌నాథ్‌

రాహుల్‌ మాట్లాడుతున్న సమయంలో.. ప్రధాని మోదీ, హోం శాఖ మంత్రి అమిత్‌ షా మధ్య కూర్చున్న రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ వెంటనే లేచి నిలబడి అభ్యంతరం వ్యక్తం చేశారు. తప్పుడు ప్రకటనలు చేస్తూ.. రాహుల్‌ గాంధీ సభను తప్పుదోవ పట్టిస్తున్నారని తెలిపారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన అగ్నివీర్‌ కుటుంబానికి రూ.కోటి ఆర్థిక సాయం అందజేస్తున్నట్లు చెప్పారు. ఓవైపు రాజ్‌నాథ్‌ మాట్లాడుతుండగానే.. ‘నేను తప్పు మాట్లాడలేదు.. నేను తప్పు మాట్లాడలేదు’ అంటూ రాహుల్‌ నిరసన వ్యక్తం చేశారు. అగ్నివీర్‌ పథకం తీసుకొచ్చే ముందు చాలా ఆలోచించామని, పలువురు నిష్ణాతులు, 158కి పైగా సంస్థల నుంచి అభిప్రాయాలు స్వీకరించిన తర్వాతే దీన్ని అమల్లోకి తీసుకొచ్చామని రాజ్‌నాథ్‌ వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని