నేపాల్‌కు పాకిన వైకాపా అక్రమాలు

‘శేషాచలం అడవుల్లో కొట్టేసి, అక్రమంగా తరలించిన ఎర్రచందనాన్ని నేపాల్‌ ప్రభుత్వం పట్టుకుంది. వైకాపా ప్రభుత్వంలో ఇక్కడి చెక్‌పోస్టుల్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన కుమారుడు మిథున్‌రెడ్డి పేరు చెబితే వదిలేశారు.

Published : 02 Jul 2024 05:36 IST

అక్కడ పట్టుబడ్డ వేల టన్నుల ఎర్రచందనం
ఆరా తీస్తే, పెద్దిరెడ్డి, మిథున్‌రెడ్డిలదని తేలింది
జనసేన కార్యకర్తల సమావేశంలో పవన్‌

ఈనాడు, కాకినాడ: ‘శేషాచలం అడవుల్లో కొట్టేసి, అక్రమంగా తరలించిన ఎర్రచందనాన్ని నేపాల్‌ ప్రభుత్వం పట్టుకుంది. వైకాపా ప్రభుత్వంలో ఇక్కడి చెక్‌పోస్టుల్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన కుమారుడు మిథున్‌రెడ్డి పేరు చెబితే వదిలేశారు. కానీ నేపాల్‌ పోలీసులకు వీళ్లెవరో తెలీదు కదా, అక్కడ ఆపేశారు. ఆరా తీస్తే తిరుపతి నుంచి వచ్చాయని తేలింది. ఇప్పుడా ఆ ఫైల్‌ నా దగ్గరకు వచ్చింది. ఆ ఎర్రచందనాన్ని తీసుకురావడానికి కిందామీదా పడుతున్నాం. దీన్నిబట్టి మన చెక్‌పోస్టులు ఎంత అలసత్వంగా ఉన్నాయో అర్థమవుతోంద’ని జనసేన అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ వ్యాఖ్యానించారు. కాకినాడ జిల్లా గొల్లప్రోలులో సోమవారం పిఠాపురం జనసేన కార్యకర్తల సమావేశంలో మాట్లాడిన సందర్భంగా ఆయనీ వ్యాఖ్యలు చేశారు. ‘అడవిని కొట్టడం సులువే. పెంచడం ఎంత కష్టమో తెలుసా? అన్నానికి బదులు మీరు డబ్బు తింటారా?’ అని వైకాపా నాయకులను పవన్‌ ప్రశ్నించారు. బియ్యం అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపాలని, దీని వెనుకున్న సూత్రధారులను పట్టుకోవాలని మంత్రి నాదెండ్ల మనోహర్‌కు చెప్పినట్లు పవన్‌ తెలిపారు. 

ఇప్పుడు 11 వచ్చాయ్‌.. రేపు ఒకటే రావొచ్చు

‘వైకాపాకు 151 సీట్లు ఇచ్చి కాలం పరీక్ష పెట్టింది. వాళ్లు ఏదైనా చేసేయొచ్చు అనుకున్నారు. ఫలితం ఎదుర్కొన్నారు. ఈసారి 11 వచ్చాయి. రేపు ఒకటే రావొచ్చు. మనకి ఒకటి వచ్చినప్పుడు వాళ్లకూ రాకూడదని లేదుగా’ అని పవన్‌కల్యాణ్‌ వ్యాఖ్యానించారు. కార్యకర్తలు బై బై జగన్‌ అని నినదించగా.. ఒకసారి చెప్పేశాం కదా, ఎన్నిసార్లు చెబుతామని పవన్‌ ప్రశ్నించారు. ‘బాబూ మీకు దండం పెడతా. వైకాపా నాకు శత్రువు కాదు. వారి లాగా మనమూ చేస్తే, వారికీ మనకూ తేడా ఏంటి? వ్యక్తిగత దాడులకు దిగొద్దు. క్రమశిక్షణ పాటించండి. ప్రజా సమస్యలపైనే మాట్లాడండి’ అని కార్యకర్తలకు జనసేనాని హితవు పలికారు. ‘మీరంతా సీఎం సీఎం అని అరిచి ప్రకృతిని, భగవంతుడ్ని భయపెట్టారు. కనీసం ఉప ముఖ్యమంత్రైనా కాకపోతే ఎలా అని ప్రకృతి కదిలిపోయింది. నేను డిప్యూటీ సీఎంనయ్యాను. కోరిక ధర్మబద్ధంగా ఉండాలి. వేల కోట్లు కావాలి, రుషికొండ కావాలి, దేవాదాయ భూములు కొట్టేయాలంటే జరగద’ని పేర్కొన్నారు. సమావేశంలో జనసేన అధికార ప్రతినిధి వేములపాటి అజయ్‌కుమార్, పిఠాపురం సమన్వయకర్త మర్రెడ్డి శ్రీనివాసరావు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని