‘నీట్‌’ రద్దుకు రాజ్‌భవన్‌ ముట్టడి యత్నం

నీట్‌ పరీక్షను రద్దు చేయాలనే డిమాండ్‌తో రాజ్‌భవన్‌ ముట్టడికి విద్యార్థి సంఘాల ఐక్య కమిటీ చేసిన ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకున్నారు.

Published : 02 Jul 2024 04:36 IST

ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్‌ సహా 120 మంది అరెస్టు
కౌన్సెలింగ్‌కు నిరసనగా 6న రాష్ట్ర బంద్‌కు పిలుపు 

ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్‌ ఆధ్వర్యంలో రాజ్‌భవన్‌ ముట్టడికి వెళ్తున్న విద్యార్థి సంఘాల నాయకులు

ఖైరతాబాద్, గోషామహల్, న్యూస్‌టుడే: నీట్‌ పరీక్షను రద్దు చేయాలనే డిమాండ్‌తో రాజ్‌భవన్‌ ముట్టడికి విద్యార్థి సంఘాల ఐక్య కమిటీ చేసిన ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకున్నారు. ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్‌ సహా 120 మందిని అరెస్టు చేశారు. ఎన్‌ఎస్‌యూఐ, ఎస్‌ఎఫ్‌ఐ, ఏఐఎస్‌ఎఫ్, పీడీఎస్‌యూ, వీజేఎస్, ఏఐపీఎస్‌యూ, పీవైసీ, డీవైఎఫ్‌ఐ, ఏఐవైఎఫ్, వైజేఎస్‌ సంఘాల ప్రతినిధులు సంయుక్తంగా ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్‌ ఆధ్వర్యంలో... నెక్లెస్‌ రోడ్డు మీదుగా వెళ్లి రాజ్‌భవన్‌ ముట్టడించాలని నిర్ణయించుకున్నారు. సోమవారం మధ్యాహ్నం విద్యార్థి సంఘాల ప్రతినిధులు కొందరు ఒక బృందంగా ఇందిరాగాంధీ విగ్రహం వద్దకు చేరుకున్నారు. అక్కడ పోలీసులు ఉండటంతో... ఖైరతాబాద్‌ ఫ్లైఓవర్‌ వైపు పరుగులు తీశారు. పోలీసులూ వారి వెంటపడి పట్టుకున్నారు. పీడీఎస్‌యూ నేత గడ్డం శ్యామ్‌... బస్సు తలుపులను బాదారని కొందరు పోలీసులు వాహనంలోకి వెళ్లి చేయిచేసుకున్నారని ఆందోళనకారులు ఆరోపించారు. అనంతరం రెండో బృందం వచ్చినప్పుడు యువతులను అరెస్టు చేసి, తీసుకెళ్తున్న పెట్రోలింగ్‌ వాహనం ఎక్కిన ఏఐవైఎఫ్‌ నాయకుడు సత్యప్రసాద్‌... జెండా పట్టుకుని నినదిస్తుండగా వెనక్కి పడిపోవడంతో వాహనం ముందు అద్దం పగిలింది. మొత్తంగా 120 మందిని అరెస్టు చేసి గోషామహల్‌ ఠాణాకు తరలించిన పోలీసులు, సాయంత్రం సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. ఈ సందర్భంగా బల్మూరి వెంకట్‌ మాట్లాడుతూ... ‘‘నీట్‌లో అవకతవకలు బహిర్గతమైనా కేంద్రం ఆ పరీక్షను రద్దు చేయకుండా మౌనం వహించడం దుర్మార్గం. తెలంగాణ నుంచి 70 వేలకు పైగా విద్యార్థులు పరీక్ష రాశారు. వారి సమస్యను వివరించేందుకు సమయం అడిగినా కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి స్పందించలేదు. గవర్నర్‌కు వినతిపత్రం ఇవ్వాలని అనుమతి కోరినా నిరాకరించారు. అందుకే రాజ్‌భవన్‌ ముట్టడికి నిర్ణయించాం. ఇప్పటికీ కేంద్రం స్పందించకుంటే ధర్నాచౌక్‌ వద్ద మహా దీక్ష చేస్తాం’’ అని హెచ్చరించారు. అనంతరం నీట్‌ కౌన్సెలింగ్‌ను రద్దు చేయాలనే డిమాండ్‌తో ఈనెల 6న రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థల బంద్‌కు విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని