ఇంకేం బాకీ ఉంది?

గత పదేళ్ల తన పాలన ట్రైలరేనని, అసలు ఇప్పుడే మొదలైందని ప్రధాని మోదీ వ్యాఖ్యానించడంపై కాంగ్రెస్‌ అధ్యక్షుడు, రాజ్యసభలో విపక్ష నేత మల్లికార్జున ఖర్గే విరుచుకుపడ్డారు.

Published : 02 Jul 2024 04:30 IST

ప్రధాని మోదీపై ఖర్గే ధ్వజం

దిల్లీ: గత పదేళ్ల తన పాలన ట్రైలరేనని, అసలు ఇప్పుడే మొదలైందని ప్రధాని మోదీ వ్యాఖ్యానించడంపై కాంగ్రెస్‌ అధ్యక్షుడు, రాజ్యసభలో విపక్ష నేత మల్లికార్జున ఖర్గే విరుచుకుపడ్డారు. ఇంకేం మిగిలుందని ప్రశ్నించారు. రాష్ట్రపతికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై సోమవారం రాజ్యసభలో ఆయన మాట్లాడారు. పరీక్షల పేపర్ల లీకేజీ, కశ్మీర్‌లో ఉగ్ర దాడులు, రైలు ప్రమాదాలు, విమానాశ్రయాల పైకప్పులు కూలడాలు, వంతెనలు పడిపోవడాలు వంటివి మిగిలాయా అని ఎద్దేవా చేశారు. టోల్‌ పన్నుల పెంపు మిగిలిపోయిందా అని ఖర్గే ప్రశ్నించారు. ఎన్నికల్లో మోదీ చేసిన ప్రసంగాలను, ఆర్‌ఎస్‌ఎస్‌ సిద్ధాంతాలను తప్పుబట్టారు. అయితే వీటిలో పలు వ్యాఖ్యలను రికార్డుల నుంచి రాజ్యసభ ఛైర్మన్‌ జగదీప్‌ ధన్‌ఖడ్‌ తొలగించారు. ప్రశ్నపత్రాల లీకేజీవల్ల 30 లక్షల మంది విద్యార్థుల భవిత ప్రశ్నార్థకంగా మారిందని ఖర్గే ధ్వజమెత్తారు. గత ఏడేళ్లలో 70సార్లు పేపర్లు లీకయ్యాయని తెలిపారు. మొత్తం 2 కోట్ల మంది విద్యార్థులు ఇబ్బందులు పడ్డారని వెల్లడించారు. రాష్ట్రపతి ప్రసంగంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. అందులో మణిపుర్‌ ప్రస్తావన లేకపోవడాన్ని తప్పుబట్టారు. 

90 నిమిషాలపాటు ఖర్గే రాజ్యసభలో ప్రసంగించారు. పలుమార్లు ఆయన ప్రసంగానికి అధికార పక్ష సభ్యులు అంతరాయం కలిగించారు. ఆర్‌ఎస్‌ఎస్‌ సిద్ధాంతం దేశానికి ప్రమాదకరమని ఖర్గే ఆరోపించారు. యూనివర్సిటీలు, ఎన్‌సీఈఆర్‌టీతో పాటు ఇతర విద్యా సంస్థల్లో వైస్‌ ఛాన్సలర్లు, ప్రొఫెసర్ల నియామకాలపై ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రమేయం ఉంటోందన్నారు. ఖర్గే ఆరోపణలను ధన్‌ఖడ్‌ తోసిపుచ్చారు. ఆ సంస్థ జాతీయ ప్రయోజనాల కోసం పని చేస్తోందని స్పష్టం చేశారు. ‘ఆర్‌ఎస్‌ఎస్‌లో సభ్యుడు కావడం నేరమా.. అందులో ఎంతో మంది మేధావులున్నారు’ అని తెలిపారు. రాజ్యసభ నాయకుడు జేపీ నడ్డా కూడా ఖర్గే వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేశారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని