కాంగ్రెస్‌లో చేర్చుకున్న ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించండి

కాంగ్రెస్‌ పార్టీ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తోందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎమ్మెల్యే కేటీఆర్‌ ధ్వజమెత్తారు.

Published : 02 Jul 2024 04:37 IST

సీఎం రేవంత్‌రెడ్డికి కేటీఆర్‌ సవాల్‌

జగిత్యాల, న్యూస్‌టుడే: కాంగ్రెస్‌ పార్టీ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తోందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎమ్మెల్యే కేటీఆర్‌ ధ్వజమెత్తారు. సోమవారం జగిత్యాల జిల్లా కేంద్రంలో నిర్వహించిన భారాస ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. ‘‘పార్టీ మారినవాళ్లను రాళ్లతో కొట్టి చంపాలని గతంలో రేవంత్‌రెడ్డి అన్నారు. పార్టీ ఫిరాయించిన వెంటనే సభ్యత్వం కోల్పోయేలా పాంచ్‌ న్యాయ్‌ పేరుతో ప్రణాళికలో చేర్చామని రాహుల్‌ గాంధీ పేర్కొన్నారు. రేవంత్‌రెడ్డికి దమ్ముంటే పార్టీలో చేర్చుకున్న ఆరుగురు ఎమ్మెల్యేలతో  రాజీనామా చేయించి ఎన్నికలకు రావాలి. అప్పుడు ప్రజలే సమాధానం చెబుతారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ 420 హామీలిచ్చి గద్దెనెక్కి ఆరు నెలలు దాటినా.. ఒక్క హామీ నెరవేర్చలేదు. రుణమాఫీ చేయలేదు.. ఉద్యోగాలు ఇవ్వలేదు.. రైతుభరోసా, మహిళలకు సాయం అందించలేదు. ప్రజలు నిలదీస్తారని, కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల్లో ముసలం పుడుతుందని ఒక్కో ఎమ్మెల్యేను ఎత్తుకుపోతూ.. భారాస పని ఖతమైందని వదంతులు పుట్టిస్తున్నారు. గాంధీ ఆసుపత్రిలో నిరాహార దీక్షకు దిగిన మోతీలాల్‌ను పరామర్శించేందుకు వెళ్లిన కాంగ్రెస్‌ ఎమ్మెల్సీని ప్రజలు తరిమికొట్టారు. స్థానిక సంస్థలు, శాసనసభ ఎన్నికలు ఎప్పుడు జరిగినా ఎగిరేది గులాబీ జెండాయే. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌ను భారాస కార్యకర్తలు, కవిత కష్టపడి గెలిపిస్తే..  తన సొంత అభివృద్ధి కోసం కాంగ్రెస్‌లోకి వెళ్లారు. ఆయన క్రషర్‌ ఆగొద్దట.. వియ్యంకుడికి బిల్లులు రావాలట..! దమ్ముంటే ఆయన తన పదవికి రాజీనామా చేసి ప్రజల వద్దకు రావాలి. గడ్డిపోచ లాంటి ఎమ్మెల్యే పోయారు.. గడ్డపార లాంటి కార్యకర్తలు పార్టీలోనే ఉన్నారు’’ అని కేటీఆర్‌ అన్నారు. కార్యక్రమంలో భారాస జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు, మాజీ మంత్రులు కొప్పుల ఈశ్వర్, జి.రాజేశంగౌడ్, ఎమ్మెల్సీ ఎల్‌.రమణ, కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్‌ కల్వకుంట్ల సంజయ్, జడ్పీ ఛైర్‌పర్సన్‌ దావ వసంత, మాజీ ఎమ్మెల్యేలు సుంకె రవిశంకర్, బాజిరెడ్డి గోవర్ధన్, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు తదితరులు పాల్గొన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని