భారాస బాటలోనే కాంగ్రెస్‌

పార్టీ ఎమ్మెల్యేల ఫిరాయింపులు, నిధుల కేటాయింపు, సింగరేణి ప్రైవేటీకరణలాంటి అంశాల్లో కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం భారాస బాటలోనే నడుస్తోందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ వ్యాఖ్యానించారు.

Published : 01 Jul 2024 03:06 IST

అభివృద్ధి విషయంలో భాజపా ఎమ్మెల్యేలపై వివక్ష తగదు
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌

హుస్నాబాద్‌లో మాట్లాడుతున్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌. చిత్రంలో సుధాకర్‌రెడ్డి, శ్యాంప్రసాద్‌లాల్‌ తదితరులు

కరీంనగర్‌ సాంస్కృతికం, హుస్నాబాద్, న్యూస్‌టుడే: పార్టీ ఎమ్మెల్యేల ఫిరాయింపులు, నిధుల కేటాయింపు, సింగరేణి ప్రైవేటీకరణలాంటి అంశాల్లో కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం భారాస బాటలోనే నడుస్తోందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ వ్యాఖ్యానించారు. ఆదివారం కరీంనగర్‌లో బండి సంజయ్‌ విలేకరులతో మాట్లాడారు. ‘‘అసెంబ్లీ నియోజకవర్గాల అభివృద్ధి విషయంలో భాజపా ఎమ్మెల్యేలపై కాంగ్రెస్‌ ప్రభుత్వం వివక్ష చూపడం దుర్మార్గం. భాజపా గెలిచిన చోట ఆయా నియోజకవర్గాల్లో ఓడిపోయిన కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులను ఇన్‌ఛార్జులుగా పెట్టి నిధులిస్తోంది. ఇది సరి కాదు. కేంద్ర ప్రభుత్వం కూడా ఇదేవిధంగా వ్యవహరిస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించండి. తెలంగాణ అభివృద్ధి లక్ష్యంగా మేము ముందుకు సాగుతున్నాం. రాష్ట్ర మంత్రులు, కాంగ్రెస్‌ ఎంపీలు మా వద్దకు వస్తే పూర్తిగా సహకరిస్తున్నాం. మా మంచితనాన్ని పిరికితనంగా భావిస్తే మీకే నష్టం. సింగరేణి ప్రైవేటీకరణపై కాంగ్రెస్, భారాస పార్టీలు దుష్ప్రచారం చేస్తున్నాయి. గతంలో భారాస ఇలాగే దుష్ప్రచారం చేస్తే ప్రజలు బుద్ధి చెప్పారు. తెలంగాణలో పొత్తు ప్రతిపాదనను జనసేన పార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌ భాజపా ముందుంచారు. దీనిపై జాతీయ, రాష్ట్ర అధ్యక్షులు సహా పార్టీ నాయకత్వం చర్చించి నిర్ణయం తీసుకుంటుంది. వరంగల్, కరీంనగర్‌కు స్మార్ట్‌సిటీ నిధులు ఎక్కువ వచ్చేలా చూస్తా. టీ20 ప్రపంచకప్‌లో భారత్‌ విజయం సాధించడం సంతోషంగా ఉంది. భారత ఆటగాళ్లకు శుభాకాంక్షలు’’ అని సంజయ్‌ తెలిపారు. 

కార్పొరేట్‌ సంస్థలతో విద్యావ్యవస్థ నిర్వీర్యం

కార్పొరేట్‌ విద్యాసంస్థలు ఇచ్చే పైసలతోనే ప్రభుత్వాలు, నాయకులు నడుస్తున్నందున.. విద్యావ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారని బండి సంజయ్‌ అన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో ఆదివారం సరస్వతి శిశుమందిర్‌ నూతన భవనం ప్రారంభించిన అనంతరం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పది మందికి ఉపాధి కల్పించి తక్కువ ఫీజుతో విద్యను అందించే చిన్న చిన్న పాఠశాలలు.. కార్పొరేట్‌ సంస్థల వల్ల మూతపడుతున్నాయని చెప్పారు. కార్యక్రమంలో విద్యాభారతి దక్షిణ క్షేత్ర సంఘటన కార్యదర్శి లింగం సుధాకర్‌రెడ్డి, పెద్దపల్లి అదనపు కలెక్టర్‌ శ్యాంప్రసాద్‌లాల్‌తోపాటు పలువురు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని