పల్లె దవాఖానా ప్రారంభోత్సవంలో కాంగ్రెస్‌ జెండాలు

కుమురంభీం జిల్లాలో మంత్రి సీతక్క ఆదివారం విస్తృతంగా పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ క్రమంలో రెబ్బెన మండలం నవేగాంలో నిర్మించిన పల్లె దవాఖానా ప్రారంభోత్సవ విషయంలో స్థానిక ఎమ్మెల్యే కోవ లక్ష్మి నిరసన వ్యక్తం చేశారు.

Published : 01 Jul 2024 03:05 IST

నిరసన తెలుపుతూ వెళ్లిపోయిన ఎమ్మెల్యే కోవ లక్ష్మి
రెబ్బెనలో మంత్రి సీతక్కతో భారాస నాయకుల వాగ్వాదం


రెబ్బెనలో మంత్రి సీతక్క వద్ద నిరసన తెలుపుతున్న భారాస నాయకులు

రెబ్బెన, న్యూస్‌టుడే: కుమురంభీం జిల్లాలో మంత్రి సీతక్క ఆదివారం విస్తృతంగా పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ క్రమంలో రెబ్బెన మండలం నవేగాంలో నిర్మించిన పల్లె దవాఖానా ప్రారంభోత్సవ విషయంలో స్థానిక ఎమ్మెల్యే కోవ లక్ష్మి నిరసన వ్యక్తం చేశారు. ముందుగా కాగజ్‌నగర్‌లో పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన మంత్రి సీతక్క.. తరువాత నవేగాంలోని పల్లె దవాఖానాను ప్రారంభించేందుకు బయలుదేరారు. అంతకు ముందే అక్కడికి చేరుకున్న ఆసిఫాబాద్‌ ఎమ్మెల్యే కోవ లక్ష్మి కార్యక్రమం వద్ద కాంగ్రెస్‌ పార్టీ ఫ్లెక్సీలు, జెండాలు ఉండటాన్ని గమనించి అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వం నిర్వహించే అధికారిక కార్యక్రమంలో ఒక పార్టీ జెండాలు పెట్టడం ఏమిటని అధికారులను ప్రశ్నించారు. దీనిపై నిరసన వ్యక్తం చేస్తూ ప్రారంభోత్సవంలో పాల్గొనకుండానే వెళ్లిపోయారు. అనంతరం సీతక్క చేరుకొని దవాఖానాను ప్రారంభించారు. తరువాత రెబ్బెనలోని మరో పల్లె దవాఖానాను ప్రారంభించేందుకు వెళ్లగా.. భారాస శ్రేణులు అక్కడికి చేరుకొని ఎమ్మెల్యే కోవ లక్ష్మికి మద్దతుగా నిరసన తెలిపారు. మంత్రి వారికి నచ్చజెప్పడంతో కార్యక్రమంలో ఎంపీపీ సౌందర్య, వైస్‌ ఎంపీపీ సత్యనారాయణ, మాజీ సర్పంచి అహల్యాదేవితోపాటు భారాస నాయకులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని