కొత్త చట్టాలతో బాధితులకు అన్యాయం

మార్పు అంటే మంచి జరగాలని, కానీ కేంద్ర ప్రభుత్వం తెచ్చిన కొత్త చట్టాలు ప్రాథమిక హక్కులకు విఘాతంగా ఉన్నాయని భారాస సీనియర్‌ నేత, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్‌ విమర్శించారు.

Published : 01 Jul 2024 03:05 IST

మాజీ ఎంపీ వినోద్‌కుమార్‌

ఈనాడు, హైదరాబాద్‌: మార్పు అంటే మంచి జరగాలని, కానీ కేంద్ర ప్రభుత్వం తెచ్చిన కొత్త చట్టాలు ప్రాథమిక హక్కులకు విఘాతంగా ఉన్నాయని భారాస సీనియర్‌ నేత, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్‌ విమర్శించారు. తెలంగాణ భవన్‌లో పార్టీ నేతలు సోమ భరత్‌కుమార్, గెల్లు శ్రీనివాస్‌ యాదవ్, లలితరెడ్డిలతో కలిసి ఆదివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘కేంద్రం క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్, ఇండియన్‌ పీనల్‌ కోడ్, ఇండియన్‌ ఎవిడెన్స్‌ యాక్ట్‌లను రద్దు చేసి జులై 1 నుంచి కొత్త చట్టాలను అమలులోకి తెచ్చింది. 2023 ఆగస్టులో ఈ బిల్లులను పార్లమెంటులో కేంద్రం ప్రవేశపెట్టింది. ఎఫ్‌ఐఆర్‌ను నమోదు చేయకుండా.. ప్రాథమిక విచారణ చేసేలా కొత్త చట్టం తెచ్చారు. సుప్రీంకోర్టు నిర్దేశానికి భిన్నంగా.. నిందితులకు బేడీలు వేయాలని సవరణ చేశారు. పోలీసు కస్టడీకి తీసుకోవడానికి 14 రోజులకు బదులుగా 90 రోజుల వరకు అవకాశమిచ్చారు. కొత్త చట్టాలపై పార్లమెంట్‌ స్టాండింగ్‌ కమిటీ విస్తృతంగా పరిశీలించి అనేక మంచి సూచనలు చేసినా, వాటిని కేంద్రం పట్టించుకోలేదు. దాదాపు 160 మంది పార్లమెంటు సభ్యులను బయటకు పంపి.. బిల్లును కేంద్రం ఆమోదింపజేసుకుంది. వీటి వల్ల బాధితులకు తీవ్ర అన్యాయం జరుగుతుంది. కొత్త చట్టాల అమలును వాయిదా వేయాలని మోదీని డిమాండ్‌ చేస్తున్నాం’ అని వినోద్‌కుమార్‌ పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని