నిరుద్యోగులతో ప్రభుత్వం చర్చలు జరపాలి

నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం నిలబెట్టుకోవాలని, వారితో చర్చలు జరిపి న్యాయం చేయాలని మాజీ మంత్రి హరీశ్‌రావు డిమాండ్‌ చేశారు.

Published : 01 Jul 2024 03:04 IST

వారి సమస్యలు పరిష్కరించకుంటే అసెంబ్లీని స్తంభింపజేస్తాం
మాజీ మంత్రి హరీశ్‌రావు

గాంధీ ఆసుపత్రిలో దీక్ష చేస్తున్న మోతీలాల్‌ను పరామర్శిస్తున్న మాజీ మంత్రి హరీశ్‌రావు, దేశపతి శ్రీనివాస్, ఎర్రోళ్ల శ్రీనివాస్‌ తదితరులు

సికింద్రాబాద్, న్యూస్‌టుడే: నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం నిలబెట్టుకోవాలని, వారితో చర్చలు జరిపి న్యాయం చేయాలని మాజీ మంత్రి హరీశ్‌రావు డిమాండ్‌ చేశారు. నిరుద్యోగుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే వచ్చే సమావేశాల్లో వారి తరఫున ప్రభుత్వాన్ని నిలదీస్తామని, అసెంబ్లీని స్తంభింపజేస్తామని చెప్పారు. నిరుద్యోగుల డిమాండ్ల సాధన కోసం గాంధీ ఆసుపత్రిలో నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న ఉస్మానియా యూనివర్సిటీ నిరుద్యోగ జేఏసీ నేత మోతీలాల్‌నాయక్‌ను హరీశ్‌రావు ఆదివారం పరామర్శించి మద్దతు ప్రకటించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఏడు రోజులుగా దీక్ష చేస్తున్న మోతీలాల్‌ ఆరోగ్యం క్షీణిస్తోందని, ముఖ్యమంత్రి స్వయంగా వచ్చి మాట్లాడి సమస్యలను పరిష్కరించాలని కోరారు. నిరుద్యోగుల హక్కుల విషయంలో తెజస అధ్యక్షుడు కోదండరాం పూర్తి బాధ్యత తీసుకుని, పరిష్కరించేలా ముందుకురావాలని సూచించారు. ‘‘నిరుద్యోగ యువతకు భారాస అండగా ఉంటుంది. ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకునేవరకు వారి తరఫున పోరాడుతుంది. ఈ అంశాలను ఎక్స్‌లో రాహుల్‌గాంధీకి ట్యాగ్‌చేస్తూ నిరసన వ్యక్తంచేసినా పట్టించుకోవడం లేదు. అశోక్‌నగర్‌లో నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను ఇప్పటికైనా రేవంత్‌రెడ్డి అమలుచేసేలా రాహుల్‌గాంధీ చొరవ చూపాలి. ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలను భర్తీచేస్తామని కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి. ఇచ్చిన హామీ మేరకు 25 వేల టీచర్‌ పోస్టులతో మెగా డీఎస్సీ ప్రకటించాలి. అధికారంలోకి వస్తే జీవో 46ను రద్దు చేస్తామని మాటిచ్చారు. ఆ జీవో ద్వారా ఏర్పడిన సమస్యలను పరిష్కరించాలి. నిరుద్యోగులకు నెలకు రూ.4 వేల నిరుద్యోగ భృతిని చెల్లిస్తామన్న హామీ మేరకు ఇప్పటివరకు బకాయిపడిన వాటితో కలిపి వెంటనే చెల్లించాలి. ప్రభుత్వం చొరవ చూపకుంటే నిరుద్యోగుల తరఫున మరో పోరాటానికి భారాస సిద్ధమవుతుంది’’ అని హరీశ్‌రావు పేర్కొన్నారు. ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి, భారాస నాయకులు దేశపతి శ్రీనివాస్, ఎర్రోళ్ల శ్రీనివాస్, గెల్లు శ్రీనివాస్‌యాదవ్, ఓయూ ప్రొఫెసర్‌ గాలి వినోద్‌కుమార్‌ తదితరులు మోతీలాల్‌ను పరామర్శించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని