ఏయూలో అక్రమాలను తవ్వి తీస్తాం

‘వైకాపా పాలనలో ఆంధ్రా విశ్వవిద్యాలయం సహా అనేక వర్సిటీల ప్రతిష్ఠ మసకబారింది. ఎన్నో అవకతవకలు చోటుచేసుకున్నాయి.

Published : 30 Jun 2024 05:32 IST

రూ.వంద కోట్ల నిధులు పక్కదారి పట్టించారు
వీసీగా ప్రసాదరెడ్డి చేసిన ఘోరాలకు  శిక్ష తప్పదు
న్యాయ విచారణ చేపట్టాలని గవర్నర్‌ను కోరతాం
కూటమి ఎంపీ, ఎమ్మెల్యేలు, నేతల స్పష్టీకరణ

ఏయూలో మాట్లాడుతున్న అనకాపల్లి ఎంపీ సీఎం రమేశ్, ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు, వెలగపూడి రామకృష్ణబాబు, వంశీకృష్ణ శ్రీనివాస్‌ తదితరులు

ఈనాడు, విశాఖపట్నం, ఏయూ ప్రాంగణం, న్యూస్‌టుడే : ‘వైకాపా పాలనలో ఆంధ్రా విశ్వవిద్యాలయం సహా అనేక వర్సిటీల ప్రతిష్ఠ మసకబారింది. ఎన్నో అవకతవకలు చోటుచేసుకున్నాయి. విద్యావనాలను రాజకీయ కేంద్రాలుగా మార్చేశారు. వర్సిటీలన్నింటికీ పూర్వవైభవం తీసుకొస్తాం’ అని తెదేపా, జనసేన, భాజపా కూటమి నేతలు స్పష్టం చేశారు. ఏయూలో బోధన, బోధనేతర ఉద్యోగుల పదోన్నతులు, ఇతర ప్రయోజనాల విషయంలో వీసీ ప్రసాదరెడ్డి హయాంలో బాధితులైన వారందరికీ న్యాయం జరుగుతుందని, అదే సమయంలో అడ్డదారుల్లో వచ్చి లబ్ధిపొందిన వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని నేతలు హామీ ఇచ్చారు. శనివారం ఏయూలో అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్, ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు, వెలగపూడి రామకృష్ణబాబు, వంశీకృష్ణ శ్రీనివాసయాదవ్, టీఎన్‌ఎస్‌ఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు ప్రణవ్‌ గోపాల్‌ తదితరులు ప్రసాదరెడ్డి అక్రమాలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆయన రాజీనామా నేపథ్యంలో బాధిత ఉద్యోగులు, విద్యార్థులు సంబరాలు నిర్వహించారు. ప్రసాదరెడ్డిని శిక్షించాలంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు. అనంతరం వారంతా కూటమి నేతలకు స్వాగతం పలికి వర్సిటీ ముందున్న భారీ గేట్ల తాళాలు తీయించారు. ఈ సందర్భంగా కూటమి ప్రజాప్రతినిధులు, నేతలు మాట్లాడారు. 

రాజీనామా చేసినా శిక్ష తప్పదు 

‘రాజీనామా చేసినంత మాత్రాన ప్రసాదరెడ్డిని వదిలే సమస్య లేదు. గత ఐదేళ్లలో జరిగిన అక్రమాలను బయటకు తీస్తాం. రూ.వంద కోట్ల రూసా నిధులు దుర్వినియోగం చేశారు. భవిష్యత్తులో ఇంకెవరూ అలా చేయకుండా ఆయనను శిక్షించాలని ప్రభుత్వాన్ని కోరతాం. గవర్నర్‌ను కలిసి ఏయూలో అవకతవకలపై ఫిర్యాదు చేస్తాం’ అని అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్‌ తెలిపారు. ‘ఏయూ నుంచి వైకాపా కోసం సర్వేలు నిర్వహించారు. ఎన్నికలకు డబ్బులు, పార్టీ జెండాలు పంపిణీ చేశారు. విద్యార్థులను ఎన్నో విధాలుగా ఇబ్బంది పెట్టారు. ఉద్యోగులపై కక్షపూరితంగా వ్యవహరించారు. విద్యార్థులు ఎంతో విలువైన ఐదేళ్ల సమయాన్ని పోగొట్టుకున్నారు. ఆయన చేసిన అక్రమాల నిగ్గు తేల్చాల్సిందే’ అని పేర్కొన్నారు. మాజీ ఎంపీ ఎంవీవీ పదో తరగతి వరకే చదివినట్లు గత ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్నారు. అలాంటిది ఆయన ఈ వర్సిటీలో పీహెచ్‌డీ చేస్తున్నారంటే ఏమనుకోవాలి’ అని ఎంపీ ప్రశ్నించారు. 

ఏయూలో కూటమి నేతలకు స్వాగతం పలుకుతున్న ఉద్యోగులు, విద్యార్థులు

ఇష్టారాజ్యంగా పదవులు, హోదాలు 

ప్రసాదరెడ్డి నచ్చిన వాళ్లకు ఇష్టారాజ్యంగా పదవులు, హోదాలు కట్టబెట్టారని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ధ్వజమెత్తారు. ‘దేశంలో ఎక్కడా లేనివిధంగా అకడమిక్‌ షెడ్యూల్త్‌ో సంబంధం లేకుండా కావల్సిన వ్యక్తులకు స్పెషల్‌ ఎగ్జామ్స్‌ నిర్వహించి సర్టిఫికెట్లు, సీట్లు ఇచ్చేశారు. ఐపీఎస్‌ అధికారి సంజయ్‌కు ప్రత్యేకంగా పరీక్ష నిర్వహించి పట్టా ఇచ్చారు. ఎక్కడైనా పరీక్ష ఫలితాల్లో తక్కువ మార్కులొస్తే రీవాల్యుయేషన్‌ పెడతారు. ఏయూలో మాత్రం రీరీవాల్యూషన్‌ అని చెప్పి అనేక రకాల అవకతవకలకు పాల్పడ్డారని తెలిపారు. ఏయూను వైకాపా కార్యాలయంలా మార్చేసి.. సిగ్గులేకుండా జగన్, ఎంపీల పుట్టిన రోజులు చేశారు. ఆదర్శంగా ఉండాల్సిన వీసీ పదవిని రాజకీయాలకు తాకట్టు పెట్టారు’ అని గంటా విమర్శించారు. వైకాపా పాలనలో ఉద్యోగులు, బోధన సిబ్బంది సమస్యలు పట్టించుకునేవారే లేరని, వారి సమస్యలకు పరిష్కారం చూపుతామని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని