పోలవరం నిర్వాసితుల పునరావాసంపై శ్వేతపత్రం విడుదల చేయాలి: సీపీఎం

పోలవరం నిర్వాసితుల పునరావాసంపై రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు డిమాండ్‌ చేశారు.

Updated : 30 Jun 2024 06:35 IST

ఈనాడు డిజిటల్, అమరావతి: పోలవరం నిర్వాసితుల పునరావాసంపై రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు డిమాండ్‌ చేశారు. ఈ ప్రాజెక్టు నిర్మాణంలో చోటుచేసుకున్న అవకతవకలపై ఉన్నతస్థాయి విచారణ చేసి, బాధ్యులను కఠినంగా శిక్షించాలని శనివారం ఆయన ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ‘ప్రాజెక్టు అంచనాల్లో లక్షకు పైగా కుటుంబాలు నిర్వాసితులవుతారని లెక్కగట్టారు. కానీ, దాన్ని 96 వేలకు కుదించడం దారుణం. ముంపు గ్రామాలపై శాస్త్రీయంగా సర్వే చేయాలి. ఆర్‌అండ్‌ఆర్‌ను త్వరగా పూర్తి చేయాలి. ఆగస్టులో గోదావరికి వరదలొచ్చే ప్రమాదం ఉంది. ముంపు గ్రామాల ప్రజల కోసం ముందస్తు చర్యలు చేపట్టాలి’ అని కోరారు.


వైకాపా పాలనలో పోలవరం ప్రాజెక్టులో అక్రమాలు సుస్పష్టం: లంకా దినకర్‌

ఈనాడు, అమరావతి: పోలవరం ప్రాజెక్టుపై రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేయడంతో వైకాపా పాలనలో జరిగిన అక్రమాలు మరోసారి స్పష్టమయ్యాయని భాజపా రాష్ట్ర అధికార ముఖ్య ప్రతినిధి లంకా దినకర్‌ పేర్కొన్నారు. విజయవాడలోని పార్టీ కార్యాలయంలో శనివారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. ‘2019 ముందు జగన్‌ పోలవరం ప్రాజెక్టులో అవినీతి జరిగినట్లు ఆరోపించారు. అధికారంలోకి వచ్చిన అనంతరం ఆ ప్రాజెక్టుకు సంబంధించి గత ప్రభుత్వ అంచనాలతోనే కేంద్రం ఆమోదానికి యత్నించారు. వైకాపా సర్కారు అనాలోచిత రివర్స్‌ టెండరింగ్‌ విధానం వల్ల అనేక నష్టాలు ఎదురయ్యాయి. ఎన్డీయే పాలనలో పోలవరం ప్రాజెక్టును పూర్తిచేయడంతోపాటు నదుల అనుసంధానం, అనువైన ప్రాంతాల్లో నీటి నిల్వ ట్యాంకుల నిర్మాణం జరుగుతుంది’ అని వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని