కేసీఆర్‌పై మీరు వ్యతిరేక భావనతో ఉన్నట్లున్నారు

‘కేసీఆర్‌పైన, గత ప్రభుత్వంపైన మీరు వ్యతిరేక భావనతో ఉన్నట్టుగా, మా రాజకీయ ప్రత్యర్థులు చేసిన వాదనలతో మీరు ఏకీభవిస్తున్నట్టుగా మీ మాటల్లో స్పష్టమైంది.

Published : 30 Jun 2024 05:02 IST

విద్యుత్‌ కొనుగోళ్లు, థర్మల్‌ప్లాంట్ల నిర్మాణాల్లో అనుమానాలకు తావే లేదు
విచారణ కమిషన్‌ ఛైర్మన్‌ జస్టిస్‌ నరసింహారెడ్డికి మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి లేఖ

ఈనాడు, హైదరాబాద్‌: ‘కేసీఆర్‌పైన, గత ప్రభుత్వంపైన మీరు వ్యతిరేక భావనతో ఉన్నట్టుగా, మా రాజకీయ ప్రత్యర్థులు చేసిన వాదనలతో మీరు ఏకీభవిస్తున్నట్టుగా మీ మాటల్లో స్పష్టమైంది. ఇది సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధం’ అని మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి విచారణ కమిషన్‌ ఛైర్మన్‌ జస్టిస్‌ ఎల్‌. నరసింహారెడ్డికి రాసిన లేఖలో ఆరోపించారు. విద్యుత్‌ కొనుగోళ్లు, థర్మల్‌ప్లాంట్ల నిర్మాణాల్లో లోటుపాట్లపై సమీక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం జస్టిస్‌ నరసింహారెడ్డి కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.  ‘మీ విచారణలో నిష్పాక్షికత ఎంతమాత్రం కనిపించడం లేదు. అరకొర సమాచారంతో కేవలం గత ప్రభుత్వాన్ని, కేసీఆర్‌ను బద్నాం చేయడం కోసమే ఈ విచారణ జరుపుతున్నట్టుగా మేం భావించాల్సి వస్తోంది’ అని జగదీశ్‌రెడ్డి విమర్శించారు. ఛత్తీస్‌గఢ్‌ కరెంటు కొనుగోలు, భద్రాద్రి, యాదాద్రి విద్యుత్కేంద్రాల నిర్మాణంపై సమాచారం కోరుతూ కమిషన్‌ గత ప్రభుత్వంలో విద్యుత్‌శాఖ మంత్రిగా పనిచేసిన జగదీశ్‌రెడ్డికి ఇటీవల లేఖ రాసింది. దానికి 8 పేజీల్లో పంపిన ప్రత్యుత్తరంలో ఆయన కమిషన్‌ ఛైర్మన్‌పైనా ఘాటుగా విమర్శలు చేశారు. శనివారం భారాస కార్యాలయంలో మీడియాతో కూడా ఆయన మాట్లాడారు. ఆయన లేఖలోని కొన్ని అంశాలు ఇలా ఉన్నాయి....

వాస్తవాలను పరిగణనలోకి తీసుకోకుండా...

‘‘విచారణాంశాల్లో భాగస్వాములైన అందరినీ విచారిస్తే మీరు సరైన నిర్ణయానికి వచ్చే అవకాశం ఉండేది. అలాకాకుండా కొద్దిమంది నుంచి మాత్రమే సమాచారం తీసుకుని విలేకరుల సమావేశం నిర్వహించి మీరు మాట్లాడారు. కేసీఆర్‌ పేరును మీరు అక్కడ ప్రస్తావించారు. వాస్తవాలను పరిగణనలోకి తీసుకోకుండా మీరు ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా అభిప్రాయాలు ప్రకటించడం బాధాకరం. ఛత్తీస్‌గఢ్‌ కరెంటు కొనుగోలుకు చెల్లింపులు, భద్రాద్రి, యాదాద్రి ప్లాంట్ల నిర్మాణంలో హేతుబద్ధత గురించి ఎక్కడా ఎటువంటి అనుమానాలకు తావులేదు. పూర్తిగా ప్రభుత్వాలు, ప్రభుత్వ రంగ సంస్థల మధ్య జరిగే ఒప్పందాల్లో ప్రజాధనం దుర్వినియోగానికి అవకాశమే లేదు. ఛత్తీస్‌గఢ్‌ నుంచి  కరెంటు కొనుగోలు ఒప్పందం ఇరు రాష్ట్రాల సీఎంలు రమణ్‌సింగ్, కేసీఆర్, అధికారుల మధ్య జరిగింది. భద్రాద్రి ప్లాంటు నిర్మాణానికి అన్ని అనుమతులు తీసుకున్నాం. ఇందులో కేంద్ర మంత్రులు, అధికారులు భాగస్వాములు. విషయాలన్నీ మీకు కూడా తెలుసు’’ అని కమిషన్‌కు రాసిన లేఖలో జగదీశ్‌రెడ్డి వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని