వైకాపాకు అలీ రాజీనామా

సినీనటుడు అలీ వైకాపాకు రాజీనామా చేశారు. ‘వైకాపానే కాదు, ఇకపై నేను ఏ రాజకీయ పార్టీ మనిషినీ కాదు, ఏ పార్టీ మద్దతుదారుడినీ కాదు.

Published : 29 Jun 2024 05:39 IST

ఇకపై ఏ పార్టీతోనూ సంబంధం ఉండదని ప్రకటన
రాజకీయాలకు స్వస్తి పలుకుతున్నట్టు వెల్లడి

ఈనాడు, అమరావతి: సినీనటుడు అలీ వైకాపాకు రాజీనామా చేశారు. ‘వైకాపానే కాదు, ఇకపై నేను ఏ రాజకీయ పార్టీ మనిషినీ కాదు, ఏ పార్టీ మద్దతుదారుడినీ కాదు. నా సినిమాలు నేను చేసుకుందామని అనుకుంటున్నా’ అని ఆయన తెలిపారు. ‘ప్రతి ఐదేళ్లకోసారి నేనూ సామాన్యుడిలా ఓటు వేసి వస్తానంతే.. రాజకీయాలకు స్వస్తి..గుడ్‌ బై’ అని ప్రకటించారు. ఆయన ఇటీవల వరకూ వైకాపా ప్రభుత్వ సలహాదారుడిగా ఉన్న విషయం తెలిసిందే. ఈ మేరకు శుక్రవారం ఆయన ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశారు.  అందులో.. ‘నేను రాజకీయాలు చేసేందుకు రాజకీయాల్లోకి రాలేదు. నేను చేస్తున్న దాతృత్వ కార్యక్రమాలకు రాజకీయం తోడైతే మరో పది మందికి ఉపయోగపడగలననే రాజకీయాల్లోకి వచ్చా. 1999లో మా పెద్దాయన డి.రామానాయుడి కోసం రాజకీయాల్లో అడుగు పెట్టా. ఆయన బాపట్ల నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తూ.. తనకు ప్రచారం చేయాలంటే కచ్చితంగా వస్తానని చెప్పి తెదేపాలోకి వెళ్లా. దాదాపు 20 సంవత్సరాలు ఆ పార్టీలో ఉన్నా. తర్వాత ఇటు (వైకాపా పేరు ప్రస్తావించకుండా)వచ్చా. నేను ఏ పార్టీలో ఉన్నా నాయకుడిని, పార్టీనీ, ఆ పార్టీ అభ్యర్థులను పొగిడానే తప్ప, ఇతర పార్టీల నాయకులను విమర్శించలేదు. వారి వ్యక్తిగత జీవితాల గురించి ఏ రాజకీయ వేదికపైనా మాట్లాడలేదు. 45 సంవత్సరాలుగా పరిశ్రమలో ఉన్నా. దాదాపు 12 వందలకుపైగా సినిమాల్లో పనిచేశా. 16 సంవత్సరాల క్రితమే మా నాన్న పేరుతో ట్రస్టు పెట్టుకున్నా. చాలా మందిని చదివించాను. నా ఆదాయంలో 20శాతం ట్రస్టుకు ఇస్తున్నా. విదేశాల్లో ఈవెంట్స్‌ చేస్తే వచ్చే ఆదాయంలో 60శాతం ట్రస్టుకే ఇస్తుంటా’ అని అలీ వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని