సంక్షిప్త వార్తలు (6)

నీట్‌పై దేశవ్యాప్తంగా నిరసనలు ఉద్ధృతమవుతున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం ఉదాసీనంగా వ్యవహరిస్తున్నాయని భారాస సీనియర్‌ నేత, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్‌ ఒక ప్రకటనలో విమర్శించారు.

Updated : 29 Jun 2024 06:32 IST

శాసనసభ సమావేశాల్లో నీట్‌పై తీర్మానం చేయాలి
మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్‌

ఈనాడు, హైదరాబాద్‌: నీట్‌పై దేశవ్యాప్తంగా నిరసనలు ఉద్ధృతమవుతున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం ఉదాసీనంగా వ్యవహరిస్తున్నాయని భారాస సీనియర్‌ నేత, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్‌ ఒక ప్రకటనలో విమర్శించారు. ‘‘ఈ గందరగోళ పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అని విద్యార్థులు ఆందోళనగా, ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నీట్‌ను రద్దు చేయాలంటూ తమిళనాడు అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించింది. నీట్‌ విషయంలో తమిళనాడు ప్రభుత్వం యావత్‌ దేశానికే ఆదర్శనీయంగా నిలుస్తోంది. నీట్‌పై ఇంత రాద్ధాంతం జరుగుతున్నా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తనకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తుండటం సిగ్గుచేటు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి నీట్‌ రద్దు కోసం ఏకగ్రీవ తీర్మానాన్ని ప్రవేశపెట్టాలి’’ అని ఆయన సూచించారు. 


ఎస్సీ వర్గీకరణ సాధనకు 7న నిరసన దీక్ష
ఎమ్మార్పీఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్‌

నల్లకుంట, న్యూస్‌టుడే: దశాబ్దాలుగా పరిష్కారానికి నోచుకోని ఎస్సీ వర్గీకరణ సాధన కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచేలా జులై 7న ఇందిరాపార్కు వద్ద నిరసన దీక్ష చేపట్టనున్నట్లు ఎమ్మార్పీఎస్‌(టీఎస్‌) రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్‌ తెలిపారు. ఎమ్మార్పీఎస్‌ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్రంలో అధికారంలోకి వస్తే వంద రోజుల్లోనే వర్గీకరణ చేస్తామని ఇచ్చిన హామీని పదేళ్లు గడిచినా భాజపా సర్కార్‌ నెరవేర్చలేదని ఆరోపించారు. పలు చరిత్రాత్మక బిల్లులను తీసుకొచ్చిన భాజపా ఎస్సీ వర్గీకరణపై వివక్ష చూపుతోందన్నారు. ఈ నిరసన దీక్షకు రాజకీయ, కులసంఘాల నేతలు తరలిరావాలని పిలుపునిచ్చారు.


రైతులను ఆదుకోండి 
మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ 

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో రైతులు ఎన్నో కష్టాలు పడుతున్నారని, ప్రభుత్వం ఇప్పటికైనా ఆదుకోవాలని భారాస సీనియర్‌ నేత, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ కోరారు. తెలంగాణ భవన్‌లో శుక్రవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... ‘‘రైతుబంధు డబ్బులు ప్రభుత్వం ఎప్పుడు ఇస్తుందా.. అని రైతులు ఎదురు చూస్తున్నారు. రుణమాఫీ ఎవరెవరికి ఇస్తారన్నది స్పష్టతలేదు. సీఎం నియోజకవర్గం కొడంగల్‌లోనే నకిలీ విత్తనాలు పట్టుకున్నారు. వాటిని అరికట్టే చర్యలేవీ?’’ అని ఈశ్వర్‌ ప్రశ్నించారు.


భాజపా పాలనలో ఆర్థిక అంతరాలు: నారాయణ

ఖమ్మం మామిళ్లగూడెం, న్యూస్‌టుడే: పదేళ్ల భాజపా పాలనలో దేశంలో ఆర్థిక అంతరాలు పెరిగాయని, దేశ సంపద కొద్దిమంది చేతుల్లోనే ఉందని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ ఆరోపించారు. ఖమ్మం గిరిప్రసాద్‌ భవన్‌లో పార్టీ జిల్లా కార్యదర్శి పోటు ప్రసాద్‌ అధ్యక్షతన శుక్రవారం రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన నారాయణ మాట్లాడుతూ.. సార్వత్రిక ఎన్నికల్లో భాజపా పరిస్థితి చావుతప్పి కన్నుపోయినట్లు అయిందని ఎద్దేవా చేశారు. బలమైన ప్రతిపక్షం లోక్‌సభలో ఉండటాన్ని సీపీఐ స్వాగతిస్తుందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం రైతుబంధు, రుణమాఫీ, బొగ్గు బ్లాకుల వేలం అడ్డుకోవడం వంటి ప్రధాన అంశాలపై దృష్టి సారించాలని డిమాండ్‌ చేశారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, జాతీయ కార్యదర్శి అజీజ్‌పాషా, కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి పాల్గొన్నారు.


జైలులో పిన్నెల్లిని కలిసిన మాజీ మంత్రులు కాకాణి, అనిల్‌

నెల్లూరు(నేర విభాగం), న్యూస్‌టుడే: నెల్లూరు కేంద్ర కారాగారంలో రిమాండ్‌లో ఉన్న మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని శుక్రవారం మాజీ మంత్రులు కాకాణి గోవర్ధన్‌రెడ్డి, అనిల్‌కుమార్‌ యాదవ్‌ కలిశారు. తొలుత పిన్నెల్లి కుమారుడితోపాటు అనిల్‌ కుమార్, గంట తర్వాత కాకాణి ములాఖత్‌ అయ్యారు. దీంతో ఒక వారంలో రిమాండ్‌లో ఉన్న వారికి అందించే రెండు ములాఖత్‌లు పూర్తయ్యాయి. ఈ వారంలో ఇక పిన్నెల్లిని ఎవరూ కలిసే అవకాశం ఉండదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని