జగన్‌ తప్పులు చేయడంతోనే ప్రజలు శిక్షించారు

‘‘ప్రజలు...అధికారాన్ని మనకు సొంత పగలు తీర్చుకోవడానికి ఇవ్వరని జగన్‌ని చూసి నేర్చుకోవాలి. 2019లో అధికారంలోకి వచ్చాక జగన్‌ చేసిన పనులు తప్పని నిరూపించడానికే మొన్న ప్రజలు 11 సీట్లు ఇచ్చారు.

Published : 28 Jun 2024 06:02 IST

మీడియాతో చిట్‌చాట్‌లో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి

ఈనాడు, దిల్లీ: ‘‘ప్రజలు...అధికారాన్ని మనకు సొంత పగలు తీర్చుకోవడానికి ఇవ్వరని జగన్‌ని చూసి నేర్చుకోవాలి. 2019లో అధికారంలోకి వచ్చాక జగన్‌ చేసిన పనులు తప్పని నిరూపించడానికే మొన్న ప్రజలు 11 సీట్లు ఇచ్చారు. మనం చేసిన పాపాలే మనల్ని మింగుతాయి’’ అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఆయన గురువారం దిల్లీలోని తన నివాసంలో మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతూ అనేక విషయాలపై స్పందించారు.‘‘ఆంధ్రప్రదేశ్‌ సీఎంగా చంద్రబాబు ఉన్నా.. మన రాష్ట్ర ప్రయోజనాల విషయంలో నేను రాజీపడను. చంద్రబాబు ఆంధ్రప్రదేశ్‌పై ఎంత నిబద్ధతతో పనిచేస్తారో... నేను నా రాష్ట్రంపై అంతే నిబద్ధతతో పనిచేస్తా. నా ఉద్యోగం కోసమే ఆయన్ని వదిలి రాజకీయాల్లోకి వచ్చా. ఇప్పుడు చంద్రబాబు కోసం ఆ ఉద్యోగం వదులుకుంటానా?’’ అని రేవంత్‌ ప్రశ్నించారు.

ఇప్పుడు జగన్‌ చచ్చిన పాములాంటి వ్యక్తి  

‘‘హైదరాబాద్‌లో జగన్‌ ఇంటిముందు కూల్చివేతల గురించి నాకెవ్వరూ చెప్పలేదు. దీనిపై ఆరాతీస్తే ఓ నాయకుడు చెప్పడంతోనే అధికారులు ఆ పని చేశారని తెలిసింది. అందుకే వారిని సరెండర్‌ చేశాం. బయట మాత్రం చంద్రబాబు చెబితే నేను చేయించానని ప్రచారం చేశారు. ఇప్పుడు జగన్‌.. చచ్చిన పాము. అలాంటి వ్యక్తి ఇంటి ముందున్న గదులు కూలగొట్టాలని చెప్పాల్సిన అవసరం చంద్రబాబుకు ఏముంటుంది? 

హైదరాబాద్‌కు అమరావతి పోటీ కాదు... 

అమరావతి హైదరాబాద్‌కు పోటీ కాదు. హైదరాబాద్‌లోనే ఒకవైపు ఉన్న వారు మరోవైపు వెళ్లడానికి ఇష్టపడటంలేదు. అలాంటిది హైదరాబాద్‌ను వదిలి అమరావతిలో పెట్టుబడులు పెడతారనుకోవడంలేదు. అమరావతిలో లాభం ఉంటే మనం తాడుతో కట్టేసినా ఆగకుండా అక్కడికిపోతారు పోర్టులకు గ్రీన్‌ఫీల్డ్‌ హైవేలు వేస్తున్నాం. డ్రైపోర్టులు కడుతున్నందున నేరుగా కంటెయినర్లు ఇక్కడికే వస్తాయి. రాజస్థాన్‌లో మాదిరి డెస్టినేషన్‌ మ్యారేజ్‌ సెంటర్‌గా హైదరాబాద్‌ను మారుస్తాం.’’ అని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని