విపక్ష నేతగా రాహుల్‌కు గుర్తింపు

లోక్‌సభలో విపక్ష నేతగా కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీకి స్పీకర్‌ ఓంబిర్లా గుర్తింపునిచ్చారు. ఈ మేరకు లోక్‌సభ సచివాలయం బుధవారం ప్రకటన (నోటిఫికేషన్‌) వెలువరించింది.

Published : 27 Jun 2024 05:38 IST

లోక్‌సభ సచివాలయం నోటిఫికేషన్‌
క్యాబినెట్‌ మంత్రి హోదాలో సదుపాయాలు

దిల్లీ: లోక్‌సభలో విపక్ష నేతగా కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీకి స్పీకర్‌ ఓంబిర్లా గుర్తింపునిచ్చారు. ఈ మేరకు లోక్‌సభ సచివాలయం బుధవారం ప్రకటన (నోటిఫికేషన్‌) వెలువరించింది. ఈ నెల 9 నుంచే ఇది అమల్లోకి వస్తుందని తెలిపింది. రాహుల్‌ విషయంలో కాంగ్రెస్‌ తన నిర్ణయాన్ని మంగళవారం అధికారికంగా తెలిపిన విషయం తెలిసిందే. దిగువసభలో ప్రతిపక్ష నేత ఉండడం పదేళ్ల విరామం తర్వాత ఇదే మొదటిసారి. ఈ హోదా పొందడానికి అవసరమైన 10% సంఖ్యాబలం విపక్షాలకు లేకపోవడంతో 16, 17 లోక్‌సభల్లో ఎవరికీ ఇది లభించలేదు. తనకు ఈ అవకాశం కల్పించిన ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఇతర నేతలు, కార్యకర్తలకు రాహుల్‌ ‘ఎక్స్‌’ ద్వారా ధన్యవాదాలు తెలిపారు. అన్ని చర్యల్లో ప్రభుత్వాన్ని జవాబుదారీని చేస్తామని పేర్కొన్నారు. 

ప్రజల గొంతుక వినిపిస్తా 

‘‘ఈ పదవి విషయంలో నాపై ఉంచిన నమ్మకానికి గానూ దేశ ప్రజలకు, కాంగ్రెస్‌ కార్యకర్తలకు, ఇండియా కూటమి పక్షాలకు కృతజ్ఞతలు. వారందరి తరఫున పార్లమెంటులో వాణి వినిపిస్తాను. విపక్ష నేత అనేది ఒక పదవి మాత్రమే కాదు. ప్రజల ప్రయోజనాలు, హక్కుల్ని కాపాడేందుకు అదో పెద్ద బాధ్యత. ప్రజా సమస్యలు, అభిప్రాయాలను వారి తరఫున లోక్‌సభలో ప్రస్తావిస్తా’’ అని రాహుల్‌ ఒక వీడియో సందేశం వెలువరించారు. దళితులు, పేదలు, అణగారిన వర్గాలు, అల్పసంఖ్యాకులు, రైతులు, కార్మిక వర్గాల కోసం.. దాడుల నుంచి రాజ్యాంగాన్ని రక్షించడం కోసం సర్వశక్తులొడ్డి పనిచేస్తానని హామీ ఇచ్చారు. సాధారణంగా టి-షర్టు, ప్యాంటుతో కనిపించే ఆయన.. బుధవారం విపక్షనేతగా సభకు తొలిసారి వచ్చినప్పుడు మాత్రం కుర్తా-పైజామా ధరించారు. 

తొలిసారి రాజ్యాంగబద్ధ పదవి 

రెండున్నర దశాబ్దాల రాజకీయ జీవితంలో రాజ్యాంగబద్ధ పదవిని రాహుల్‌ చేపట్టడం ఇదే తొలిసారి. ఆయనకు ఇప్పుడు కేంద్ర క్యాబినెట్‌ మంత్రి హోదా, దానికి తగ్గట్టు సదుపాయాలు, భద్రత లభిస్తాయి. లోక్‌పాల్, సీఈసీ/ ఎన్నికల కమిషనర్లు, సీబీఐ డైరెక్టర్, సీవీసీ, సీఐసీ వంటి కీలక పోస్టుల ఎంపిక సంఘాల్లో ఆయనొక సభ్యుడిగా ఉంటారు. లోక్‌సభలో విపక్ష సభ్యులు కూర్చునే చోట తొలిసీటు ఆయనకు కేటాయిస్తారు. ఒక ప్రైవేటు కార్యదర్శి, ఇద్దరు అదనపు పీఎస్‌లు, ఇద్దరు సహాయ పీఎస్‌లు, ఇద్దరు వ్యక్తిగత సహాయకులు, ఒక స్టెనో, ఒక గుమాస్తా, మరో ఐదుగురు ఇతర సిబ్బందిని ఆయనకు కేటాయిస్తారు. అద్దె లేకుండా పూర్తి సదుపాయాలతో నివాస గృహాన్ని వినియోగించుకోవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని