రెచ్చిపోతున్న వైకాపా మూకలు

గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం గారపాడు ఎస్సీ కాలనీలో వైకాపా మూకలు పేట్రేగిపోయాయి. మంగళవారం అర్ధరాత్రి దాటాక సుమారు 60 మంది యువకులు రాళ్లు, కర్రలు, ఇనుప రాడ్లతో ఒక్కసారిగా విరుచుకుపడ్డారు.

Published : 27 Jun 2024 06:02 IST

తెదేపా వర్గీయులపై రాళ్లు, ఇనుప రాడ్లతో దాడి
పోలీసుల సమక్షంలోనే బరితెగింపు
గుంటూరు జిల్లా గారపాడులో ఘటన

గుంటూరు జీజీహెచ్‌లో క్షతగాత్రుడిని పరామర్శిస్తున్న ప్రత్తిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు

వట్టిచెరుకూరు, న్యూస్‌టుడే: గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం గారపాడు ఎస్సీ కాలనీలో వైకాపా మూకలు పేట్రేగిపోయాయి. మంగళవారం అర్ధరాత్రి దాటాక సుమారు 60 మంది యువకులు రాళ్లు, కర్రలు, ఇనుప రాడ్లతో ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. కనిపించిన తెదేపా వర్గీయులను విచక్షణారహితంగా కొట్టారు. ఈ ఘటనలో తెదేపాకు చెందిన పల్లపాటి వీరయ్య, పల్లపాటి రత్తయ్యతో పాటు మరో ఏడుగురు గాయాలపాలయ్యారు. వీరందరినీ స్థానికులు గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. బాధితుల వెంట వెళ్లిన 15 మంది బుధవారం తెల్లవారుజామున తిరిగి వస్తుండగా కాట్రపాడు శివారులో వైకాపా వర్గీయులు దారికాచి మళ్లీ దాడులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో పల్లపాటి విజయరాజు, ఏసుబాబు, మరియదాస్, కూరపాటి చిన్నా, పల్లపాటి సుధీర్, కారసాల పృథ్వీ తీవ్రంగా.. మిగిలిన వారు స్వల్పంగా గాయపడ్డారు.

వైకాపా మూకలు విసిరిన సీసా పెంకులు

గారపాడు, యామర్రు గ్రామాల ఎస్సీ కాలనీల్లోని వైకాపా వర్గీయులు ముందుగా చర్చించుకుని గారపాడు ఎస్సీ కాలనీలోని తెదేపా వర్గీయుల ఇళ్లపై దాడులకు దిగుతున్నారు. అంతకుముందే రాళ్లు, గాజు పెంకులను తెదేపా వర్గీయుల నివాసాలకు సమీపంలో గుట్టలుగా పోసి నిల్వ చేస్తున్నారు.

పోలీసుల ప్రేక్షకపాత్ర

2019లో వైకాపా అధికారంలోకి వచ్చినప్పటినుంచి ఇక్కడ ఇరువర్గాల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. 2020లో ఏర్పాటుచేసిన పోలీస్‌ పికెట్‌ ఇప్పటికీ కొనసాగుతోంది. అయినా దాడి జరగడం చర్చనీయాంశమైంది. తమను వైకాపా వర్గీయులు కొడుతుంటే పోలీసులు చూస్తుండిపోయారని, కనీసం ఆపేందుకు ప్రయత్నం చేయలేదని తెదేపా వర్గీయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దాడులకు తెగబడుతుంటే పోలీసులు ప్రేక్షకపాత్ర వహిస్తున్నారు. సీఐ ఉదయ్‌బాబు, డీఎస్పీ మహబూబ్‌ బాషా గ్రామానికి చేరుకుని పరిస్థితి అదుపులోకి తెచ్చారు. అప్పటివరకు పికెట్‌లో ఉన్న పోలీసులు చోద్యం చూస్తూ ఉండిపోయారని బాధితులు చెబుతున్నారు. 

క్షతగాత్రులకు ఎమ్మెల్యే బూర్ల పరామర్శ

గుంటూరు జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను ప్రత్తిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు బుధవారం పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐదేళ్లుగా తెదేపా వర్గీయులపై దాడులు చేస్తూ వైకాపా మూకలు రాక్షసానందం పొందుతున్నాయని మండిపడ్డారు. బాధ్యులపై కఠినచర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. 


వైకాపా శ్రేణులపై చర్యలు తీసుకోండి

-కేంద్ర మంత్రి పెమ్మసాని

గుంటూరు(పట్టాభిపురం): తెదేపా కార్యకర్తలపై దాడులకు తెగబడుతున్న వైకాపా శ్రేణులపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర సహాయమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌ ఆదేశించారు. గుంటూరు జిల్లా ఎస్పీ తుషార్‌ దూడీకి బుధవారం ఆయన ఫోన్‌ చేసి మాట్లాడారు. వట్టిచెరుకూరు మండలం గారపాడు ఎస్సీ కాలనీలో జరిగిన దాడుల్ని ప్రస్తావించారు. బాధితులకు మెరుగైన చికిత్స అందించాలని గుంటూరు సర్వజనాసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్‌ కిరణ్‌కుమార్‌ను ఆదేశించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని