AP news: ప్రతిపక్ష హోదా లేకపోతే ప్రజా సమస్యలపై పోరాడలేరా?

ప్రధాన ప్రతిపక్ష నాయకుడి హోదా ఇవ్వకపోతే ప్రజాసమస్యలపై పోరాడలేరా అని మాజీ ముఖ్యమంత్రి, వైకాపా అధ్యక్షుడు జగన్‌ను తెదేపా నేత సి.రామచంద్రయ్య, కడప ఎమ్మెల్యే రెడ్డప్పగారి మాధవి ప్రశ్నించారు.

Published : 27 Jun 2024 05:09 IST

జగన్‌పై సి.రామచంద్రయ్య, ఎమ్మెల్యే మాధవి ధ్వజం 

ఈనాడు డిజిటల్, అమరావతి: ప్రధాన ప్రతిపక్ష నాయకుడి హోదా ఇవ్వకపోతే ప్రజాసమస్యలపై పోరాడలేరా అని మాజీ ముఖ్యమంత్రి, వైకాపా అధ్యక్షుడు జగన్‌ను తెదేపా నేత సి.రామచంద్రయ్య, కడప ఎమ్మెల్యే రెడ్డప్పగారి మాధవి ప్రశ్నించారు. లోక్‌సభలో ఎన్డీయే స్పీకర్‌ అభ్యర్థికి వైకాపా ఎంపీలు ఓటు వేయాలన్న నిర్ణయం వెనక ఆంతర్యం ఏంటో చెప్పాలని నిలదీశారు. అసెంబ్లీలో వైకాపాను ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించాలంటూ జగన్‌ స్పీకర్‌కు లేఖ రాయడం సిగ్గుచేటని మండిపడ్డారు. మొత్తం సభ్యుల్లో పదో వంతు ఉంటేనే ప్రతిపక్ష హోదా వస్తుందన్న విషయం జగన్‌కు తెలియకపోవడం బాధాకరమని ఎద్దేవా చేశారు. ఈ మేరకు సి.రామచంద్రయ్య బుధవారం ఓ ప్రకటన విడుదల చేయగా, మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో మాధవి విలేకరులతో మాట్లాడారు. ‘ప్రజాసమస్యల్ని అసెంబ్లీలో ప్రస్తావించాలనే ఆలోచన నిజంగా జగన్‌కు ఉంటే ప్రతిపక్ష హోదా ఉందా.. లేదా.. అనేది విషయమే కాదు. అయ్యన్నపాత్రుడు స్పీకర్‌ కాకముందు చేసిన వ్యాఖ్యల్ని లేఖలో వక్రీకరించారు. అసెంబ్లీ వ్యవహారాలకు సంబంధించి రూల్‌ నంబర్‌ 56, క్లాజ్‌ నంబర్‌ ‘సీ’లో మొత్తం సభ్యుల్లో పది శాతం మంది సభ్యులు ఉంటేనే ప్రతిపక్ష హోదా వస్తుందని ఉంది. ఆరుగురు సభ్యుల్ని లాగేస్తే తెదేపాకు ప్రతిపక్ష హోదా కూడా పోతుందని గతంలో జగన్‌ వ్యాఖ్యలు చేసిన విషయం మర్చిపోయారా’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు