ఫలానా గుర్తు కావాలని కోరలేరు

ప్రజాప్రాతినిధ్య చట్టం-1951 నిబంధనలకు విరుద్ధంగా ఎన్నికల్లో ఫలానా గుర్తే కావాలని ఎవరూ కోరలేరని హైకోర్టులో ఎన్నికల కమిషన్‌ బుధవారం వాదనలు వినిపించింది.

Published : 27 Jun 2024 03:38 IST

‘చపాతీ రోలర్‌’పై ఎన్నికల కమిషన్‌ వాదనలు

ఈనాడు, హైదరాబాద్‌ : ప్రజాప్రాతినిధ్య చట్టం-1951 నిబంధనలకు విరుద్ధంగా ఎన్నికల్లో ఫలానా గుర్తే కావాలని ఎవరూ కోరలేరని హైకోర్టులో ఎన్నికల కమిషన్‌ బుధవారం వాదనలు వినిపించింది. త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల గుర్తుల జాబితాలో ‘చపాతీ రోలర్‌’ను చేర్చాలని కోరుతూ హైకోర్టులో అలయన్స్‌ ఆఫ్‌ డెమోక్రటిక్‌ రిఫార్మ్స్‌ పార్టీ పిటిషన్‌ దాఖలుచేసింది. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆలోక్‌ అరాధే, జస్టిస్‌ అనిల్‌కుమార్‌ జూకంటి ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. గతంలో అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికల్లో పిటిషనర్‌ పార్టీ అభ్యర్థులు చపాతీ రోలర్‌ గుర్తుపై పోటీ చేశారన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ అదే గుర్తు కేటాయించేలా ఈసీకి ఆదేశాలివ్వాలని విన్నవించారు. ఈ క్రమంలో ఈసీ తరఫున న్యాయవాది జి.విద్యాసాగర్‌ వాదనలు వినిపిస్తూ..  ప్రజాప్రాతినిధ్య చట్టం నిబంధనలకు విరుద్ధంగా ఫలానా గుర్తు కావాలని ఎవరూ కోరలేరని చెప్పారు. ఉన్న జాబితా నుంచే ఏదో ఒక గుర్తు ఎంపిక చేసుకోవాల్సి ఉంటుందన్నారు. ఈ క్రమంలో పిటిషన్‌ను ఉపసంహరించుకునే అవకాశం ఇవ్వాలని పిటిషనర్‌ తరఫు న్యాయవాది కోరడంతో ధర్మాసనం అంగీకరించింది. దీంతో పిటిషన్‌ను ఉపసంహరించుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని